logo

24 గంటల వైద్యం అందేదెక్కడ

గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటల పాటు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించింది. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా అక్కడ రాత్రివేళ వైద్యం అందడం లేదు. సాధారణ ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు

Updated : 25 Jun 2022 06:45 IST

 అరకొర సౌకర్యాలతో అవస్థలు  

 వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది కొరత

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, పెద్దపల్లి కలెక్టరేట్‌

వెల్ది 24గంటల ఆరోగ్య కేంద్రం 50ఏళ్ల కిందట నిర్మించగా శిథిలావస్థలో ఉంది. 13 గ్రామాలకు సేవలందించాల్సిన ఇక్కడ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రతిరోజు 80-100మంది ఔట్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు వైద్యులున్నా స్టాఫ్‌నర్సు ఇతర సిబ్బంది లేక రాత్రి వైద్యం అందడం లేదు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక కరీంనగర్‌ వెళ్తున్నారు. మూడు హెల్త్‌ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులు ఆసుపత్రిని చూస్తే భయపడుతున్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటల పాటు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించింది. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా అక్కడ రాత్రివేళ వైద్యం అందడం లేదు. సాధారణ ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలందించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఆసుపత్రుల పనితీరుపై ఉమ్మడి జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందం పరిశీలన కథనం.
లక్ష్యం ఇదీ
24 గంటల వైద్య కేంద్రాల్లో సాయంత్రం 4 నుంచి తెల్లవారు 9గంటల వరకు స్టాపు నర్సు, వాచ్‌మెన్‌ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. గర్భిణులు రాత్రివేళలో పురిటి నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడితే వారికి తక్షణ వైద్యం అందించాలి. పాము, తేలు కుట్టిన వారికి ప్రాథమ చికిత్స అందించాలి. ఇద్దరు వైద్యులు ఉండాలి. ప్రతిరోజు రాత్రి ఒక వైద్యుడు పర్యవేక్షించాలి. మందుల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే ప్రధాన ఆసుపత్రులకు పంపించాలి. చాలా ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సులు లేరు. ఉన్నా వారిని ఇతర ఆసుపత్రులకు డిప్యూటేషన్‌పై పంపిస్తున్నారు. వైద్యులదీ అదే దారి. ఫలితంగా 24గంటల వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది.
భారంగా మారినా.. ప్రైవేటు వైపు పరుగులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడంతో అత్యవసర పరిస్థితిలో భారమైనా ప్రైవేటుకు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా పురిటి నొప్పులు, ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారు గత్యంతరం లేక ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. వైద్యులు, స్టాపు నర్సులను అందుబాటులో ఉంచితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
ఇతర చోట్ల విధులు
కరీంనగర్‌ జిల్లాలో 24గంటల ఆసుపత్రుల పరిస్థితి విచిత్రంగా ఉంది. చొప్పదండి, శంకరపట్నం, వావిలాలలో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులను కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అర్బన్‌ ఆసుపత్రి, నర్సింగ్‌ స్కూల్‌, జిల్లా ఆసుపత్రికి డిప్యూటేషన్‌పై పంపించడంతో అక్కడ సేవలందడం లేదు. కొన్నింటిలో వైద్యులు అలాగే ఉన్నారు. డిప్యూటేషన్లు రద్దు చేసి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించుకోవాల్సిన అవసరముంది. కొన్ని చోట్ల సిబ్బంది కొరత తీర్చాలి. నైట్‌ వాచ్‌మెన్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.
మారుమూల ప్రాంతాల్లో..
పెద్దపల్లి జిల్లాలో ఐదు 24గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొలనూర్‌లో స్టాఫ్‌ నర్సుతో పాటు ఇతర సిబ్బంది, ముత్తారం ఆసుపత్రిలో కూడా సిబ్బంది కొరత ఉంది. ఈ జిల్లాలో 24గంటల వైద్య సేవలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో మరి దయనీయంగా ఉంది.
ఖాళీల భర్తీతోనే..
సిరిసిల్ల జిల్లాలో ఐదు ఆసుపత్రులు ఉన్నాయి. ఇల్లంతకుంట 24గంటల ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక్క వైద్యుడు సెలవులో వెళ్లినా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైతే స్టాఫ్‌ నర్సు, ఇతర సిబ్బంది వైద్యం అందిస్తారు. కోనరావుపేట, చందుర్తి, పోతుగల్‌ ఆసుపత్రుల్లో ఒక్కో వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఎల్లారెడ్డిపేట ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులుండగా ఒకరిని రాచర్ల బొప్పాపూర్‌ ఉపకేంద్రంలో డిప్యూటేషన్‌పై నియమించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళలలో వైద్యం అందుబాటులో ఉంది. మొత్తానికి వైద్యుల ఖాళీలు భర్తీ చేయాలి.
జగిత్యాలలో అంతంత మాత్రమే
జగిత్యాల జిల్లాలో కూడా రాత్రివేళలో మొక్కుబడి వైద్యం అందుతోంది. తొమ్మిది ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత ఉంది.


ఉమ్మడి జిల్లాలో 24గంటల ఆసుపత్రుల వివరాలు
జిల్లా ప్రాథమిక ఆరోగ్య 24గంటల
కేంద్రాలు ఆసుపత్రులు
కరీంనగర్‌ 18 07
జగిత్యాల 19 09
రాజన్న సిరిసిల్ల 11 05
పెద్దపల్లి 18 05

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని