logo

అడ్డ దారి.. అడిగేదెవరని!

అధికారిక రీచ్‌ల నుంచి ఇసుకను తరలించేందుకు గుత్తేదారులు అడ్డ‘దారులు’ తొక్కుతున్నారు. ఓదెల, సుల్తానాబాద్‌ మండలాల్లోని పలు రీచ్‌ల నుంచి తరలిస్తున్న వాహనాల రాకపోకలకు సుల్తానాబాద్‌ పట్టణంలో కొత్తగా మట్టి రహదారినే నిర్మిస్తున్నారు.

Published : 25 Jun 2022 06:27 IST

ఇసుక రవాణా కోసం కాలువ పక్కన మట్టితో నిర్మాణం
న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌

ఎస్సారెస్పీ పిల్ల కాలువ మీదుగా పోసిన మట్టి

అధికారిక రీచ్‌ల నుంచి ఇసుకను తరలించేందుకు గుత్తేదారులు అడ్డ‘దారులు’ తొక్కుతున్నారు. ఓదెల, సుల్తానాబాద్‌ మండలాల్లోని పలు రీచ్‌ల నుంచి తరలిస్తున్న వాహనాల రాకపోకలకు సుల్తానాబాద్‌ పట్టణంలో కొత్తగా మట్టి రహదారినే నిర్మిస్తున్నారు. సుల్తానాబాద్‌-గట్టెపల్లి రోడ్డు నుంచి సుల్తానాబాద్‌-శాస్త్రీనగర్‌ రాజీవ్‌ రహదారి వరకు ఎస్సారెస్పీ డీ 86 ప్రధాన కాలువ వెంట మట్టి రహదారి వేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో గుత్తేదారులు కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో సమీప రైతులు ఆందోళన చెందుతున్నారు.
యథేచ్ఛగా మట్టి తరలింపు
రహదారి నిర్మాణం కోసం వాడుతున్న మట్టి తవ్వకాలకు రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గట్టెపల్లి శివారులోని అసైన్డ్‌ భూమిలో అడ్డగోలుగా మట్టి తవ్వుతూ టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. దీన్ని రోడ్డు నిర్మాణానికి వినియోగించడంతో పాటు పలు నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దారు యాకన్నను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా మట్టి తరలింపునకు ఎవరికీ అనుమతులు లేవన్నారు.
దుమ్ముతో అవస్థలు
సుల్తానాబాద్‌లోని శాంతినగర్‌ నుంచి అశోక్‌నగర్‌ మీదుగా శాస్త్రీనగర్‌ వరకు కొత్తగా వేసిన మట్టి రహదారితో విపరీతంగా దుమ్ము లేస్తూ పట్టణవాసులు అవస్థలు పడుతున్నారు. మట్టి రోడ్డుపై ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలు వెళ్తున్న క్రమంలో దుమ్ము లేచి ద్విచక్రవాహనదారులు, పాదచారుల కళ్లలో పడుతోంది. ఈ రహదారి మీదుగా ఇసుక రవాణా ప్రారంభమైతే దుమ్ము మరింత ఎక్కువ లేచి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులున్నాయి. సుల్తానాబాద్‌లో ఇసుక రవాణా సమయంలో దుమ్ము నివారణకు నీళ్లు చల్లుతున్నామని చెబుతున్న గుత్తేదారులు రాత్రి సమయంలో విస్మరిస్తున్నారు. దీంతో ఉదయానికల్లా చెట్లపై, దుకాణాలపై దుమ్ము పేరుకుపోతోంది. మరోవైపు ఇసుక గుత్తేదారులు వేసిన తాత్కాలిక మట్టి రహదారినే పట్టణానికి బైపాస్‌ రోడ్డుగా ప్రచారం చేసుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు సమీపంలోని స్థలాల విక్రయాలు పెంచుకోవడానికి యత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
అనుమతులపై అనుమానాలు
ఎస్సారెస్పీ డీ86 ప్రధాన కాలువ పక్క నుంచి వేస్తున్న మట్టి రహదారి నిర్మాణానికి ప్రాజెక్టు అధికారుల అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాలువ నిర్మాణం కోసం రైతుల నుంచి ఈ భూమిని సేకరించారు. కాలువ తవ్వకం పోగా మిగిలిన భూమిని నిర్వాసితులైన రైతులు సాగు చేసుకున్నారు. దీంతో పాటు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కొత్తగా వేస్తున్న మట్టి రోడ్డుతో వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పాటు గుత్తేదారులు ఎస్సారెస్పీ పిల్ల కాలువలో పైపులు వేయకుండానే పూడుస్తూ రహదారి నిర్మించడంతో వచ్చే వానాకాలంలో సాగునీరు ఎలా వస్తుందని సమీప రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ ఏఈ ప్రవీణ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా రహదారి నిర్మాణంపై ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని