logo

నేను మీ వాడిని

సిరిసిల్లలో 2009లో పోటీ చేసిన సందర్భంలో మంత్రిని అవుతాననుకోలేదు. అందరూ కలిసి నన్ను గెలిపిస్తేనే.. ముఖ్యమంత్రి గుర్తించి నాకు మంత్రి పదవి అప్పగించారు. దాని ద్వారానే నాకు రాష్ట్రంతోపాటు జాతీయ, అంతర్జాతీయంగా పేరొచ్చింది.

Updated : 25 Jun 2022 06:51 IST

మీరు ఓట్లేసి గెలిపిస్తేనే ఇంత పేరొచ్చింది
అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
కేటీఆర్‌

బీసీ కుల సంఘాల బాధ్యులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: సిరిసిల్లలో 2009లో పోటీ చేసిన సందర్భంలో మంత్రిని అవుతాననుకోలేదు. అందరూ కలిసి నన్ను గెలిపిస్తేనే.. ముఖ్యమంత్రి గుర్తించి నాకు మంత్రి పదవి అప్పగించారు. దాని ద్వారానే నాకు రాష్ట్రంతోపాటు జాతీయ, అంతర్జాతీయంగా పేరొచ్చింది. జిల్లాలోని ప్రతి కులానికి ఒక అన్నగా... తమ్ముడిగా నా శక్తిమేరకు అందరి సంక్షేమం కోసం పని చేస్తానని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలో శుక్రవారం మంత్రి పర్యటించారు. మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు ఆరు మీటర్ల పైకి వచ్చాయని, దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలోని రాజరాజేశ్వర, అన్నపూర్ణ, మల్లన్నసాగర్‌ ద్వారా ఎగువమానేరు అక్కడి నుంచి చెరువులు నింపుకుంటూ వచ్చామన్నారు. మరోవైపు జిల్లాలో అవలంబించిన నీటి సంరక్షణ విధానాలతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కలెక్టరేట్‌లో జిల్లాలోని బీసీ కులాల బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయించి, ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. వాటిల్లో కల్యాణ మండపాలు, బాల, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు నిర్మించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లోని మంత్రి ఛాంబర్‌లో జిల్లా న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరిసిల్లలోని జిల్లా న్యాయం స్థానం విస్తరణ, వేములవాడలోని న్యాయస్థానంలో అదనపు వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని న్యాయవాదులు మంత్రి దృష్టికి విజ్ఞప్తి చేశారు.
విద్యా అవకాశాలకు నిలయం
సిద్దిపేట నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడుగుపెడుతుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల దర్శనమిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లకు వస్తూ కళాశాల భవన సముదాయాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. సర్దాపూర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ, వైద్య కళాశాలల భవన సముదాయాలకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాలకు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లు కళ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రతిష్ఠాపనోత్సవంలో...
లక్ష్మీపూర్‌తండా (గంభీరావుపేట), న్యూస్‌టుడే: మండలంలోని లక్ష్మీపూర్‌తండాలో కొత్తగా సేవాలాల్‌ మహరాజ్‌, జగదాంబ అమ్మవారి ఆలయాలను నిర్మించి శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి కేటీఆర్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యువకులతో సెల్ఫీలు దిగారు. గిరిజన తండాకు చెందిన చిన్నారిని ఎత్తుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, జడ్పీటీసీ సభ్యురాలు కొమిరిశెట్టి విజయ, సెస్‌ డైరెక్టర్‌ నారాయణరావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచులు లకావత్‌ మంజుల, శ్రీధర్‌పంతులు, దొమకొండ ఎల్లం, తెరాస మండల అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, నాయకులు లక్ష్మణ్‌, సురేందర్‌రెడ్డి, దయాకర్‌రావు, రాజారాం తదితరులు పాల్గొన్నారు.
కుల వృత్తులకు పూర్వ వైభవం
ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ వచ్చాకే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని  మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ముస్తాబాద్‌ మండల కేంద్రంలో సీడీపీ నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీ కృష్ణ యాదవ సంఘం ఫంక్షన్‌ హాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మొదటి విడతలో రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టామన్నారు. రెండో విడత కోసం కొంతమంది డీడీలు కట్టి ఎదురుచూసే వారు బాధపడనవసరం లేదని పేర్కొన్నారు. మొన్న రూ.4 వేల కోట్లు మంజూరైనట్లు చెప్పారు. డీడీలు కట్టిన వారితో పాటు మిగిలిపోయిన వారికి కూడా అందిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక యాదవలకు గొర్రెలు, మత్స్యకారులకు చేపల పెంపకం, రైతులకు రైతు బంధు, పాల ఉత్పత్తులు పెంచేందుకు రుణాలు వంటివి అందిస్తూ కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చిందన్నారు. ముస్తాబాద్‌ తమ్ముళ్ల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో నాలుగు ఎకరాల స్థలం ఇవ్వాలని యాదవ సంఘం నాయకులు కోరగా, తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. పలువురు నాయకులు పార్టీలో చేరగా పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు చెవుల మల్లేశ్‌, సర్పంచి గాండ్ల సుమతి, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య, రైబస మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ శీలం జానాభాయి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ అన్నం రాజేందర్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని