logo

వాహన యోగం ఎప్పుడో?

రైతే దేశానికి వెన్నుముఖ అని సభా వేదికల్లో గొప్పగా చెప్పే నాయకులు వారికి సేవలందించే వ్యవసాయశాఖ అధికారులకు సౌకర్యాల కల్పన పట్ల ఆలోచించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో రైతన్నలకు

Published : 25 Jun 2022 06:42 IST

క్షేత్రస్థాయి పర్యటనకు ఇబ్బంది పడుతున్న వ్యవసాయాధికారులు
న్యూస్‌టుడే, వేములవాడ

సాగుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

రైతే దేశానికి వెన్నుముఖ అని సభా వేదికల్లో గొప్పగా చెప్పే నాయకులు వారికి సేవలందించే వ్యవసాయశాఖ అధికారులకు సౌకర్యాల కల్పన పట్ల ఆలోచించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో రైతన్నలకు క్షేత్రస్థాయిలో పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇతరత్రా సహాయ సహకారాలు అందిస్తూ రైతన్నల ముంగింట్లో సేవలందించే సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు అవసరమైన వాహన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడంలో చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగు సమయాల్లో రైతులకు అవసరమైన మెలకువలు, సూచనలు చేసేందుకు వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటిస్తుంటారు. రైతు వేదికల్లో పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి అనేక రకాల ఇబ్బందులను అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభుత్వ శాఖల్లో కొందరి అధికారులకు ప్రభుత్వం వాహనాలను సమకూర్చగా కొన్ని శాఖలకు ప్రతి నెలా వాహనాల వినియోగానికి రూ. 33 వేలను ఖర్చుల కింద అందజేస్తుంది. అలాంటిది గ్రామాల్లోని వ్యవసాయ పంట క్షేత్రాల్లో, క్లస్టర్లలోని గ్రామాల్లో పర్యటించే ఆయా మండలాల వ్యవసాయాధికారులకు మాత్రం ప్రభుత్వ వాహన సౌకర్యం కల్పించకపోవడం పట్ల సంబంధిత అధికారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. వీరికి కేవలం నెలకు టూర్‌ అలవెన్స్‌ కింద రూ.900లను ప్రభుత్వం ఇస్తున్నప్పటికి అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇతర శాఖల మాదిరిగా ఇవ్వాలి
- భాస్కర్‌, ఏడీఏ, వేములవాడ

మొదటి నుంచీ వ్యవసాయశాఖకు ప్రభుత్వ వాహనాలు లేవు. రైతుల పంట చేలల్లోకి ఎప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినా వ్యవసాయ అధికారులు సొంత వాహనాలపై వెళ్లాల్సి ఉంటుంది. అరకొరగా కొంత ట్రావెల్‌ అలవెన్స్‌ను ప్రభుత్వం ఇస్తుంది. ఇతర శాఖల మాదిరి వ్యవసాయశాఖకు ప్రభుత్వ వాహనాలు అవసరమే.

సొంత డబ్బులతో...
జిల్లాలో 13 మంది మండల వ్యవసాయ అధికారులతో పాటు 57 మంది వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులున్నాయి. విస్తరణాధికారులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ వ్యవసాయాధికారులు ఎనిమిది మందే విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి మండల వ్యవసాయ అధికారికి ఒక ప్రభుత్వ వాహనం అవసరం. ఇలాంటి సందర్భంలో చాలా మంది ఏవోలు తమ సొంత డబ్బులతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను సమకూర్చుకుని గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటిస్తున్నారు. చాలా మంది వ్యవసాయ విస్తరణ అధికారులు తమకు కేటాయించిన క్లస్టర్‌ పరిధిలోని రైతు వేదికలకు వెళ్లి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కనీసం ఏవోలకైనా  ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చితే రైతులకు మరింతగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. గ్రామాల్లో పంటల నమోదు, రైతు బీమా వివరాల సేకరణ, పంటల సాగు వివరాలు తదితర వాటికి తప్పనిసరిగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు శాస్త్రవేత్తల పర్యటన, ఇతరత్రా సందర్భాల్లోనూ వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాహనం తప్పనిసరి అవసరమవుతుంది. జిల్లా స్థాయిలో, ఏడీఏ పరిధిలో జరిగే సమావేశాలకు ఏవోలు హాజరువుతుంటారు. ఇలాంటి సందర్భంలోనూ సొంత వాహనాల్లో సమావేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయశాఖ అధికారులకు వాహన సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని