logo

విద్యుత్తు సమస్యలకు పరిష్కారమెప్పుడో?

చొప్పదండి మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటికి విద్యుత్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేవలం కొన్ని సమస్యలకు పరిష్కారం

Published : 25 Jun 2022 06:46 IST

సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు (పాతచిత్రం)

చొప్పదండి, న్యూస్‌టుడే: చొప్పదండి మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటికి విద్యుత్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేవలం కొన్ని సమస్యలకు పరిష్కారం చూపగా మరికొన్నింటిని గాలికొదిలేశారు. ప్రతీ ఏటా సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కార్యచరణ రూపొందిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.
  ఇళ్లపై తీగలు
పట్టణంలోని వినాయకనగర్‌, శ్రీరామ టాకీసు, మారుతీనగర్‌తో పాటు పలు కాలనీల్లో విద్యుత్తు తీగలు ఇళ్లపై ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వాటిని ఇళ్లకు సమీపంలో లేకుండా కొంచెం దూరంగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా ఫలితంలేకుండా పోతుంది. తమ ఇళ్ల నుంచి చేతికందేవిధంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. ప్రధాన కూడళ్ల సమీపంలో పలు రకాల విద్యుత్తు తీగలు ఒకే స్తంబానికి ఉండటంతో సైతం పలు ప్రమాదాలకు నెలవుగా మారింది. కొంతమంది ఇంటిలోనే ఇనుప స్తంబాలు ఉండటంతో వారు భయంతో జీవిస్తున్నారు.
నూతన స్తంభాల జాడేదీ?
కొన్ని విద్యుత్తు స్తంభాల నుంచి కనెక్షన్లు తొలగించినప్పటికి వాటిని అక్కడి నుంచి తొలగించలేదు. విరిగిపోయిన స్తంబాల స్థానంలో కొత్తవి వేసినప్పటికీ పాతవి అలాగే ఉంటున్నాయి. పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో నూతన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా కొత్త స్తంభాలను వేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కేవలం మొదటి నాలుగు వార్డుల్లో 30 చొప్పున నూతన స్తంభాలు వేసి చేతులు దులుపుకున్నారు. మిగతా వార్డుల్లో విద్యుత్తు స్తంభాలు లేక రాత్రిపూట అంధకారంలో ఉంటున్నారు.


దశల వారీగా..
- రజిత, ఇన్‌ఛార్జి కమిషనర్‌, పురపాలకసంఘం

పట్టణ ప్రగతిలో భాగంగా విద్యుత్తు సమస్యలన్నింటిని గుర్తించడం జరిగింది. వాటన్నింటిని దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాం. ఇప్పటికే వార్డుల వారీగా కావాల్సిన అవసరాలు, తీర్చాల్సిన సమస్యలపై సమావేశాలు నిర్వహించడం జరిగింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని