logo
Published : 27 Jun 2022 04:28 IST

వేతనం ఆసుపత్రిలో.. విధులు అధికారుల ఇళ్లలో..

న్యూస్‌టుడే, చైతన్యపురి

రీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో  17 మంది శాశ్వాత రోగి సహాయకుల(ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు)తో పాటు 36 మంది తాత్కాలిక పేషెంట్‌కేర్‌లు ఉన్నారు. అయినా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందటం లేదు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, అత్యవసర వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన రోగులను, వికలాంగులను అడ్మిట్‌ నిమిత్తం వార్డులకు తీసుకెళ్లాలన్నా, వైద్య పరీక్షల నిమిత్తం ఎక్స్‌రే, స్కానింగ్‌ కేంద్రాల వద్దకు స్ట్రెచర్‌పై తీసుకెళ్లాలంటే పేషెంట్‌ కేర్‌ల సహాయం తప్పని సరి. జిల్లా ఆసుపత్రిలో 53 మంది సహాయకులు ఉన్నప్పటికీ రోగులకు అందుబాటులో ఉండటం లేదు. కుటుంబీకులు, బంధువులే వారికి సహాయకులుగా ఉంటున్నారు.

సొంత పనులకు
36 మంది తాత్కాలిక పేషెంట్‌కేర్‌లు ఉండగా (ఎంసీహెచ్‌ అదనం) అందులో 10 మందికి పైగా విధులకు హాజరవకుండా ఆసుపత్రి అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. ఒకరిని ఆసుపత్రిలో ఓ ఉద్యోగి సహాయకుడికిగా పెట్టుకున్నారు. మరో ఇద్దరు ఆసుపత్రి అధికారులకు పర్సనల్‌ పీఏలుగా, మరొకరిని ప్రజాప్రతినిధి ఇంటి వద్ద, మరో ఇద్దరిని ఆసుపత్రి అధికారుల ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలే సిబ్బంది కొరతతో ఆసుపత్రిలో ఇబ్బందులు ఎదర్కొంటుండగా ఉన్నవారిని అధికారులు సొంత అవసరాలకు ఉపయోగించుకోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.


చిత్రంలో చక్రాల కుర్చీలో రోగిని వార్డుకు తీసుకెళుతున్న వ్యక్తి వారి బంధువే. చికిత్స నిమిత్తం సర్జికల్‌వార్డులో అడ్మిటైన ఇతనికి వైద్యులు స్కానింగ్‌ రాయడంతో ఈ నె 24న   కుర్చీలో స్కానింగ్‌ గదికి తీసుకువచ్చారు. స్కానింగ్‌ అనంతరం తిరిగి వార్డుకు తీసుకెళ్లేందుకు అందుబాటులో పేషెంట్‌కేర్‌ లేకపోవడంతో బంధువే వార్డుకు తీసుకెళ్లారు.


చిత్రంలో రెండు కాళ్లు లేక చేతులతో పాకుతూ ఆసుపత్రిలో తిరుగుతున్న ఇతని పేరు దుర్గయ్య, బెజ్జంకి గ్రామానికి చెందిన ఇతనికి జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 24న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి ప్రధాన గేట్‌ వద్ద అతని మూడు చక్రాల సైకిల్‌ను పెట్టి ఆసుపత్రి వరండాలోకి వచ్చారు. అక్కడి నుంచి ఓపీ గదుల వద్దకు వెళ్లేందుకు స్ట్రెచర్‌బాయ్‌ (పేషెంట్‌కేర్‌) కోసం చూడగా అక్కడ అందుబాటులో లేక చేతులతో పాకుతూ ఓపీ గదికి వెళ్లారు. పరీక్షల అనంతరం ఇంజక్షన్‌ నిమిత్తం క్యాజువాలిటీ వద్దకు ఇలా గంట పాటు ఆసుపత్రిలో జ్వరంతోనే నేలపై పాకుతూ తిరిగారు. వార్డుబాయ్‌, పేషెంట్‌కేర్‌ సిబ్బంది చక్రాల కుర్చీలో వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల్సి ఉన్నా పట్టించుకోలేదు.


సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరవుతున్నారు
-డాక్టర్‌ జ్యోతి, ఆర్‌ఎంవో

జిల్లా ఆసుపత్రిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, పేషెంట్‌కేర్‌, సెక్యూరిటీ సిబ్బంది మూడు షిప్టులుగా పని చేయాల్సి ఉంటుంది. పేషెంట్‌కేర్‌ సిబ్బంది ముందుస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో కొన్ని సందర్భాల్లో రోగులకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి వారిని తొలగించి కొత్తవారికి అవకాశం వచ్చి రోగులు ఇబ్బందులు పడకుండా  చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి కొత్త పోస్టులు మంజూరు లేకపోవడంతో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొంత మందిని రికార్డు రూంలో సహాయకులుగా, అధికారుల పీఏలుగా వినియోగించుకుంటాం. డ్యూటీ సమయంలో అధికారులు ఇళ్లలో పని చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని