logo

ప్రీపెయిడ్‌ మీటర్‌ అమలు సాధ్యమేనా!

విద్యుత్తు సంస్థ కలల ప్రాజెక్టు ప్రీపెయిడ్‌ మీటర్లు.. అయిదేళ్ల కిందట నమూనా ప్రాజెక్టు కింద ప్రభుత్వ కార్యాలయాలకు బిగించినా ప్రస్తుతం సాధారణ మీటర్లకు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి

Published : 27 Jun 2022 04:28 IST

అయిదేళ్లుగా అలంకారప్రాయం

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు సంస్థ కలల ప్రాజెక్టు ప్రీపెయిడ్‌ మీటర్లు.. అయిదేళ్ల కిందట నమూనా ప్రాజెక్టు కింద ప్రభుత్వ కార్యాలయాలకు బిగించినా ప్రస్తుతం సాధారణ మీటర్లకు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి సంస్థ దృష్టి సారించడం లేదు. ఫలితంగా కలల ప్రాజెక్టు అటకెక్కింది.

ప్రస్తుత విధానంలో ఇబ్బందులు..
ప్రస్తుతం విద్యుత్తు వాడుకున్న తరువాతే బిల్లు చెల్లిస్తున్నాం. మీటర్‌ రీడింగ్‌ కార్మికులు ఇంటింటికి తిరిగి నమోదు చేస్తున్నారు. బిల్లుల నమోదు సమయంలో కార్మికుడు ఆలస్యంగా లేదా సమయానికి ముందే రీడింగ్‌ తీయడం వల్ల యూనిట్లు తేడా వస్తోందంటూ కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి విద్యుత్తు అధికారులు 30రోజుల సరాసరితో లెక్కిస్తున్నామంటూ సంజాయిషీ ఇస్తున్నా వినియోగదారులు సంతృప్తిచెందడం లేదు. బిల్లు వచ్చిన నాటి నుంచి వినియోగదారులకు సుమారు 15రోజుల వరకు చెల్లించే అవకాశం చిక్కుతోంది. చెల్లించే సమయం ఎక్కువగా ఉండటంతో సంస్థకు నిధులు సకాలంలో జమకావడం లేదు. దీనికితోడు ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్తు బకాయిలు రూ.కోట్లకు చేరుకున్నాయి. వీటిని చెల్లించడానికి ప్రభుత్వ అధికారులు మొగ్గుచూపడం లేదు. గుదిబండగా మారిన ప్రభుత్వ బకాయిల వసూలు సంగతి పక్కన పెట్టి కొత్తగా వాడుకున్న విద్యుత్తు బిల్లులను ఎప్పటికప్పుడు వసూలు చేయాలన్న లక్ష్యంతో విద్యుత్తు సంస్థ నమూనా ప్రాజెక్టు కింద కరీంనగర్‌లోని కలెక్టరేట్‌లో 27 శాఖలకు ప్రీ పెయిడ్‌ మీటర్లను బిగించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న వీటి ఆచరణలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

సమస్యలు ఇవీ..
కలెక్టరేట్‌లోని కార్యాలయాలకు బిగించిన ప్రీ పెయిడ్‌ మీటర్లు వాటి సామర్థ్యం(సాంక్షన్‌ లోడ్‌) పరిమితి దాటగానే ఆటోమెటిక్‌గా విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవి. కనెక్షన్‌ తీసుకునే సమయంలో విద్యుత్తు సంస్థ అనుమతించిన లేదా కనెక్షన్‌ దారుడు కోరుకున్న లోడ్‌ ఎంతఉందో అంతమేరకే విద్యుత్తు వినియోగం జరగ్గానే సరఫరా నిలిచిపోయేది. కలెక్టరేట్‌లోని కార్యాలయాలకు అర్ధాంతరంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి, కార్యాలయ పనులకు ఆటంకం కలిగింది. ఈ విషయం విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వారు సమస్యను అధిగమించాలంటే లోడ్‌ను పెంచాలంటూ నోటీసులు జారీచేశారు. దానికి అనుగుణంగా అదనపు ఛార్జీలను ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాయి. అయినా ఆచరణలోకి మీటర్లు రాలేదు.

విద్యుత్తు సంస్థ కలెక్టరేట్‌లో స్మార్ట్‌ మీటర్లు బిగించిన వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో విఫలమయింది. సిబ్బందికి ఈ మీటర్లపై శిక్షణ ఇవ్వలేదు. ప్రీ పెయిడ్‌ కార్డులు విక్రయించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌లో విద్యుత్తు బిల్లులు చెల్లించే సదుపాయం రావడంతో ప్రీ పెయిడ్‌ కార్డుల సమస్య ఉండకపోవచ్చు. ఇప్పటికైనా విద్యుత్తు సంస్థ ఈ మీటర్లపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.

స్మార్ట్‌ మీటర్ల ధర ఎక్కువ మొత్తంలో ఉండటం ఒక సమస్యగా మారింది. ఇంటి మీటర్‌ కాలిపోతే రూ.1250 చెల్లిస్తే కొత్త మీటర్‌ ఇస్తున్నారు. ఇదే స్మార్ట్‌ మీటర్‌ కాలిపోతే సుమారు రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు. కుటీర పరిశ్రమలు వాడే సీటీ మీటర్‌ కాలిపోతే రూ.15వేలు వెచ్చించాలి. ఇంత భారీ మొత్తం వినియోగదారులు చెల్లించేందుకు ఇష్టపడకపోవచ్చు. స్థోమతలేని పేద, మధ్య తరగతి వినియోగదారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీంతో ప్రీ పెయిడ్‌ మీటర్లు ఆచరణ సాధ్యం కావడం లేదు.

ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుకోసం విద్యుత్తు సంస్థ భారీ మొత్తంలో ఖర్చుచేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2023 నాటికి ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాల్సిందేనంటోంది. ఈ నేపథ్యంలో ఈ మీటర్లలోని లోపాలను, ఇబ్బందులను అధిగమిస్తే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల బకాయి భారం తగ్గుముఖం పడుతుంది. విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా ఎగవేతదారులకు ఉన్నఫలంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతూ మొండిబకాయి దారుల మెడలు వంచే అవకాశం చిక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని