logo
Published : 27 Jun 2022 04:28 IST

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ఉమ్మడి జిల్లాలో 16,236 కేసుల పరిష్కారం

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న న్యాయమూర్తి భవానిచంద్ర

కరీంనగర్‌ న్యాయవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కరీంనగర్‌ న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా విడిపోయి కొత్త జిల్లా కోర్టులు ఏర్పడినప్పటికీ న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. కరీంనగర్‌ జిల్లా కోర్టులో ఆదివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి, ఇన్‌ఛార్జి  ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి భవానిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై  ప్రసంగించారు. లోక్‌ అదాలత్‌లో రాజీకి వీలైనటువంటి క్రిమినల్‌ కేసులు, సివిల్‌ దావాలు, మోటారు వాహన చట్టం కింద నమోదైన,  ప్రిలిటిగేషన్‌ కేసులను ఇరువర్గాల సమక్షంలో సమన్వయ పద్ధతిలో రాజీ కుదుర్చి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కోర్టులో పెండింగ్‌ కేసులు తగ్గడమే కాకుండా కక్షిదారులకు ఆర్థికంగా భారం తగ్గి సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసులకు న్యాయమూర్తి ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి శ్యాంప్రసాద్‌ లాల్‌, అదనపు డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీ మదన్‌లాల్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి పాల్గొనగా కార్యక్రమాన్ని న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి జడ్జి సుజయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కోర్టులోని న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, కార్యదర్శులు పెరుక శ్రీనివాస్‌, సిరికొండ శ్రీధర్‌రావు, పురెళ్ల రాములు, న్యాయవాదులు పాల్గొన్నారు.

లోక్‌అదాలత్‌లో కరీంనగర్‌ జిల్లాలో 7,078(46 సివిల్‌, 6,990 క్రిమినల్‌, 42 ప్రిలిటిగేషన్‌ కేసులు ఉన్నాయి)ఇందులో మోటార్‌ వాహనాల చట్టం కింద నమోదైన 27 కేసులను పరిష్కారించగా రూ.1,22,31,000 నష్ట పరిహారం వెంటనే కక్షిదారులకు చెల్లించేందుకు ప్రతివాదులు అయిన బీమా సంస్థలు ఒప్పుకోవడంతో వెంటనే తీర్పులు వెలువరించారు. రాత్రి ఏడు గంటల వరకు అందిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1378, జగిత్యాల జిల్లాలో 4,469, పెద్దపల్లి జిల్లాలో 3,311 కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించినట్లు తెలిసింది.

35 ఏళ్ల కిందటి...
కోహెడ మండలం నారాయణపూర్‌కు గ్రామానికి చెందిన ఆస్తి పంపకం సంబంధించిన కేసు 1987లో కరీంనగర్‌ న్యాయస్థానంలో దాఖలైంది. వారసత్వంగా వచ్చే ఆస్తి పంపకం గురించి పరకాల బాలవ్వ అనే మహిళ కుటుంబసభ్యులపై దావా దాఖలు చేయగా పలమార్లు రాష్ట్ర హైకోర్టులో అప్పిలు చేశారు. తదుపరి కక్షిదారులు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ఇందులో ఇరువురు ప్రతివాదులు మృతి చెందగా, వారి వారసుల పేర్లను నమోదు చేశారు. 35 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసు ఆదివారం జరిగిన లోక్‌అదాలత్‌లో ఇరువర్గాల సమక్షంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి విచారించారు. ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదరడంతో న్యాయమూర్తి వెంటనే తీర్పు చెప్పారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts