logo
Published : 27 Jun 2022 04:28 IST

వానాకాలం.. అప్రమత్తం

నగరపాలక ఆధ్వర్యంలో అత్యవసర సేవలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

వరదనీటిని మురుగుకాల్వల్లోకి పంపిస్తున్న కార్మికులు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కోవడానికి వీలుగా ప్రత్యేకంగా రెస్క్యూ బృందాలు ఏర్పాటు చేశారు. రాత్రిపూట వర్షం పడితే రహదారులు జలమయమవుతున్నాయి. గంటల తరబడి వరదనీరు నిలిచి ఉండటం, డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో నీరంతా రోడ్లపై ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఉధ్రృతంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునుగుతున్నాయి. సెలవు రోజుల్లో, రాత్రి కార్మికులు అందుబాటులో ఉండకపోవడం, సమస్యలు ఎదురవుతుండటంతో రెండేళ్ల కిందట అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

కాలనీలో ఇళ్ల మధ్యన నిలిచిన నీటిని మోటార్లు పెట్టి తోడుతున్న సిబ్బంది

వర్షం పడితే చాలు వీధుల్లోకి
వర్షం పడితే చాలు అత్యవసర బృందాలు రంగంలోకి దిగుతాయి. కాలనీల్లోకి వరదనీరు చేరినా, నాలాలు మూసుకుపోయినా వెంటనే తొలగిస్తారు. గుంతలు పడితే అక్కడ తాత్కాలిక చర్యలు తీసుకుంటారు. రహదారులపై చెట్లు పడిపోతే కట్టర్‌ ద్వారా కత్తిరించి పక్కకు జరిపిస్తారు. ఎక్కడైన వరదనీటిలో ఇళ్లు మునిగితే మోటార్లు పెట్టి నీటిని ఖాళీ చేయిస్తారు. పాత గోడలు పడిపోతే వెంటనే శిథిలాలు తొలగించేలా చర్యలు తీసుకుంటారు.

మూడు షిఫ్టులు 60మంది సిబ్బంది
నగరంలోని 60డివిజన్లు ఉండగా మూడు షిఫ్టులలో 24గంటలు పని చేసేలా 60మంది కార్మికులు, ఏడు ట్రాక్టర్లు, నోడల్‌ అధికారులు, పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారు. వీరితో పాటు డీఆర్‌ఎఫ్‌ వ్యాను, కారు ఒక షిఫ్టునకు 20మంది కార్మికులు, విద్యుత్తు, నీటి విభాగం సిబ్బంది, రెండు ట్రాక్టర్లు పని చేసేందుకు సిద్ధంగా ఉంచారు.

పర్యవేక్షణతో సమస్యలు దూరం
వర్షాకాలంలో అత్యవసర సేవలందించేందుకు వీలుగా ప్రత్యేకంగా అధికారులు, కార్మికులను నియమించారు. వీరంతా ఈ నెల 24 నుంచి నవంబర్‌ 30 వరకు విధులు నిర్వర్తించనున్నారు. నగర మేయర్‌ వై.సునీల్‌రావు ఆదేశాల మేరకు కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం అధికారులు, కార్మికులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరముంది. గతేడాది అధికారులు అందుబాటులో ఉండకపోవడం, వాహనాలు సమకూర్చకపోవడం, కావాల్సిన పనిముట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మూడు షిఫ్టులలో ఉండే సిబ్బంది, కార్మికులు, అధికారులు అప్రమత్తంగా ఉండేలా నిరంతరం ఉన్నతాధికారులు పరిశీలించాలి. రాత్రిపూట కేటాయించిన బృందం నగరపాలక కార్యాలయంలోనే ఉండి ఎక్కడైన సమస్య వస్తే వెంటనే చేరుకునే విధంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరముంది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts