logo
Published : 27 Jun 2022 04:28 IST

ఉపాధి వేట.. మోసాల బాట

గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి జిల్లా వాసులు
న్యూస్‌టుడే, మేడిపల్లి

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న గల్ఫ్‌ వలస ప్రయాణంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నా అభాగ్యులకు ఆసరా దొరకడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్నాళ్లు వలస ప్రయాణానికి విరామం లభించినా ఇటీవల మళ్లీ వలసలు పెరిగాయి. వాటితో పాటే మోసాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ వలస జీవితం, ఏజెంట్ల మోసాలు, ప్రభుత్వ కార్యాచరణపై కథనం...  

మాజీ కేంద్రమంత్రి, రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా విదేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా గురించి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ ఈ ఏడాది మార్చి 25న సమాధానమిస్తూ 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ప్రవాస భారతీయులు, 1.86 కోట్ల మంది విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ సంతతి వారు ఉన్నారని పేర్కొన్నారు. గల్ఫ్‌ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, బహెరాన్‌లలో 88.88 లక్షల మంది భారతీయులు ఉన్నారని వెల్లడించారు. కాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారు 3.5 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  2019లో మన దేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు 3.68 లక్షల మంది వలస వెళ్లగా 2020 నాటికి ఆ సంఖ్య 94,145కు పడిపోయింది. 2021 నుంచి ఆయా దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య 1.32 లక్షలకు పెరిగి 2022లో 3.50 లక్షల సరాసరికి చేరుకుంది. అదే నిష్పత్తిలో మన జిల్లాల నుంచి వెళ్తున్న వారి సంఖ్య 2021 నుంచి పెరుగుతూ వస్తోంది.

గల్ఫ్‌ వెళ్లేందుకు జగిత్యాలలో ముంబయి బస్సు ఎక్కుతున్న దృశ్యం

ఆపదలో 83328 21100
నకిలీ ఏజెంట్ల నియంత్రణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధూశర్మ ప్రకటించారు. మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసే వారిపై తమకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఏజెంట్ల మోసాలపై గల్ఫ్‌ దేశాల నుంచైనా 83328 21100 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

నకిలీ ఏజెంట్లు..

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన కొందరిని ఓ ఏజెంట్‌ మాయమాటలు చెప్పి దుబాయి పంపాడు. కానీ అక్కడికి వెళ్లి తాము మోసపోయామని బాధితులు లబోదిబోమంటూ సామాజిక మాధ్యమాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఏజెంట్లు తమ కుటుంబసభ్యులను మోసం చేశారంటూ కలెక్టరేట్‌ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించడంతో అధికారులు నకిలీలపై చర్యలకు ఆదేశించారు.

వేములవాడ గ్రామీణ మండలానికి చెందిన కొందరు సందర్శక వీసాపై వెళ్లి మోసానికి గురైనట్లు గుర్తించి అక్కడి కార్మిక సంఘాలకు విషయం వివరించారు.

కోరుట్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి తాను ఏజెంట్‌ వలలో చిక్కి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు బాధితులు కూడా మోసపోయినట్లు గోడు వెళ్లబోసుకున్నారు.

కార్యాచరణ ఏదీ?

కేరళలో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 2021 ఏప్రిల్‌లో ఆరుగురు సభ్యుల తెలంగాణ బృందం తిరువనంతపురంలోని నోర్కా రూట్స్‌ కార్యాలయాన్ని సందర్శించింది.

కేరళలో పర్యటించిన అధికారుల బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా మన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బడ్జెట్‌ సమయంలో ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

గల్ఫ్‌ దేశాల్లో మోసాల బారిన పడుతున్న వారు, స్వదేశాలకు తిరిగి వస్తున్న వారికి కేరళ ప్రభుత్వం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.

గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయాలు హెచ్చరించినా మోసాలు ఆగడం లేదు.

పని మనుషులు అవసరమని ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి ఇటీవల యూఏఈ వెళ్లిన 20 మంది మహిళలు తాము మోసపోయినట్లు గుర్తించే లోపే నిందితులు అపార్ట్‌మెంట్లలో బంధించగా పోలీసులు విడిపించి మన దేశానికి పంపించారు. వీరిలో ఒకరిద్దరు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వారు కూడా ఉన్నారని దుబాయిలోని మన జిల్లాల వాసులు పేర్కొన్నారు.

గల్ఫ్‌ సంక్షేమం కోసం ఎన్నారై పాలసీ విధానం అమలు చేయాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమగ్ర ఎన్నారై విధానం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించినా అమలుకు నోచుకోలేదు.

మన రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.500 కోట్లు కేటాయిస్తే గల్ఫ్‌ కార్మికులకు చేదోడుగా నిలిచినట్లు ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి
- గుగ్గిళ్ల రవి, గల్ఫ్‌ జేఏసీ కన్వీనర్‌

గల్ఫ్‌ వెళ్లే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. నకిలీ ఏజెంట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. గల్ఫ్‌లో మోసాల బారిన పడిన వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా న్యాయ సహాయం చేయాలి. ఇబ్బందులు ఎదురై స్వదేశానికి తిరిగి వచ్చేవారికి రవాణా ఛార్జీలు చెల్లించాలి. స్వదేశానికి వచ్చిన వారికి అర్హతను బట్టి ఉపాధి, ఉద్యోగం చూపాలి.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts