logo
Published : 27 Jun 2022 04:28 IST

అడిగినంత ఇస్తేనే ఆస్తి నమోదు...

బల్దియాలో  రెవెన్యూ తీరు
జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే

జగిత్యాల మున్సిపాలిటీ కార్యాలయం

భూముల ధరలకు రెక్కలు రావడంతో స్థిరాస్తుల్ని బల్దియాలో నమోదు చేసుకునే ప్రక్రియలో అంతులేని అవినీతి చోటుచేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటి నెంబరు పేరిట పురపాలక రెవెన్యూ విభాగంలో ప్రతినెలా రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన భవన యజమానుల నుంచి కొందరు పురపాలక సిబ్బంది అసెస్‌మెంట్‌ పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిబంధనల మేరకు అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నవారు డబ్బులు ఇవ్వకపోతే అసెస్‌మెంట్‌ చేయకుండా కార్యాలయానికి తిప్పుకుంటున్నారని అంటున్నారు.

ఆన్‌లైన్‌లో అవకాశం...
ఆస్తి నమోదులో అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మధ్య దళారులను ఆశ్రయించకుండా సొంతంగా బల్దియాలో నమోదుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అధికారులు సంబంధిత ఇంటిని పరిశీలించి ఆ ప్రాంతాన్ని.. ధ్రువీకరణ పత్రాల ఆధారంగా విచారణ చేపడతారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే 25 రెట్లు అధికంగా పన్ను వసూలు చేసి చర్యలు తీసుకుంటారు. అవసరమైతే దరఖాస్తును తిరస్కరిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇంటి నెంబరు కేటాయించి నిబంధనల మేరకు పన్ను వసూలు చేస్తారు.

సాగుతున్న దందా..
పురపాలక రెవెన్యూ విభాగంలో గత కొన్నాళ్లుగా పలువురు సిబ్బంది అక్రమ దందా కొనసాగిస్తున్నారని పట్టణ ప్రజలు అంటున్నారు. పురపాలికలో పంచాయతీలు విలీనమైన తరువాత ఇంటి నెంబర్ల కేటాయింపునకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నారని చెబుతున్నారు. నిర్మాణాలు పూర్తయినవాటికే నిబంధనల మేరకు ఇంటి నెంబర్లు కేటాయించాలి. కానీ కొందరు రేకుల షెడ్లు కూడా నిర్మించకుండా ఒక్కో స్థలంలో రెండేసి ఇంటి నెంబర్లు తీసుకోవడం గమనార్హం. ఇటీవల శివారులో అధికంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిని నిబంధనల మేరకు కొనుగోలు చేసిన యజమానుల నుంచి అసెస్‌మెంట్‌ చేయకపోవడంతో బల్దియా ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇటీవల రెవెన్యూ విభాగంలో అక్రమార్కుల బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సిబ్బంది గత నాలుగు రోజులుగా కార్యాలయానికి హాజరు కావడం లేదని సమాచారం. గత తొమ్మిది నెలల నుంచి నమోదైన ఇంటి నెంబర్ల ఆధారంగా ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అక్రమాలివిగో..

పాత ధర్మపురిరోడ్డులో ఓ వ్యక్తి ఆరు గుంటల స్థలంలో రెండు సొంత ఇళ్లు నిర్మించుకున్నాడు. ఇతను స్వయంగా సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం రెవెన్యూ శాఖ అందజేసిన ఆస్తిమార్పిడి ధ్రువీకరణ పత్రం ఉన్నా డబ్బులు ఇవ్వని కారణంగా ఇతని దరఖాస్తును సిబ్బంది తిరస్కరించారు.

ఇస్లాంపురాలో ఓ వ్యక్తి పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టలేదు. కేవలం ఆస్తిమార్పిడి ధ్రువీకరణ పత్రం ఆధారంగా డబ్బులు తీసుకొని ఇతనికి ఇంటి నెంబరు కేటాయించారు.

ఉప్పరిపేటలో మరో యజమాని ఇంటి నెంబరు కోసం సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ సైతం ఉంది. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని కేవలం నిర్మాణం పూర్తిస్థాయిలో లేదనే సాకుతో తిరస్కరించారు.

కరీంనగర్‌రోడ్డులో పూర్తినిర్మాణం లేని రెండు షెడ్లకు ఇంటి నెంబర్లు కేటాయించారు.

గణేష్‌నగర్‌లో నిర్మాణంలేని ఇంటికి అక్రమంగా నెంబరు కేటాయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


డబ్బులు అడిగితే మెసేజ్‌ పెట్టండి
స్వరూపరాణి, కమిషనర్‌

బల్దియాలో అసెస్‌మెంట్‌ పేరిట సిబ్బంది డబ్బులు అడిగితే నాకు మెసేజ్‌ చేసినా స్పందిస్తాను. కార్యాలయంలో అక్రమాలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఇంటి నెంబర్ల కేటాయింపు కోసం ఎవరూ మధ్య దళారులను ఆశ్రయించకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే సరిపోతుంది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts