logo
Published : 27 Jun 2022 04:28 IST

దారులా.. ఏరులా?

నగరంలో ఏళ్ల తరబడి సమస్య
పరిష్కారం చూపని నగరపాలిక
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

నాణ్యతలేని రహదారుల నిర్మాణం.. చినుకు పడిందంటే మురుగుతో పాటు రోడ్డెక్కి పారుతున్న వరద.. వెరసి నగరంలోని పలు ప్రధాన రహదారులు అస్తవ్యస్తం.. రహదారుల పక్కన ఉపరితల మురుగు కాల్వలు లేకపోవడం, ఆయా ప్రాంతాల్లో మురుగు జలాలను బయటకు ప్రవహించేలా ఏర్పాట్లు చేయకపోవడంతో చాలాచోట్ల మురుగు జలాలు రోడ్ల పక్కనే నిలుస్తూ చెరువులను తలపించడంతో పాటు రోడ్డెక్కి ప్రవహిస్తున్నాయి. ఇక ఏమాత్రం వర్షం కురిసినా రోడ్డును ముంచెత్తుతోంది. నగరంలోని పలు డివిజన్లలో దశాబ్దాల తరబడి ఈ సమస్య ఉన్నప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. నగరంలోని పలు రహదారులపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన...


ప్రధాన రహదారి... మురుగుమయం

గౌతమినగర్‌ నుంచి సంజయ్‌గాంధీనగర్‌, భరత్‌నగర్‌ మీదుగా విఠల్‌నగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గరి రహదారి ఇది.. ఒక దశలో ఈ రహదారిని రింగు రోడ్డుగా అభివృధ్ధి చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. మురుగంతా రోడ్డుపైన ప్రవహిస్తూ ఇరువైపులా చెరువును తలపిస్తుంది. ఉపరితల మురుగు కాల్వను కబ్జా చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.

 


ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పట్టించుకోదు.. బల్దియా స్పందించదు

శ్రీపాద ప్రాజెక్టు నుంచి రామగుండం ఎరువుల కర్మాగారానికి నీటి సరఫరా కోసం ఎల్కలపల్లిగేటు కాలనీలోని ప్రధాన రహదారిని తవ్వి పైపులు వేశారు. స్థానికులు అడ్డుకోగా పని పూర్తికాగానే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కర్మాగారం అధికారులు నగరపాలక కార్పొరేటర్‌, కమిషనర్‌ సమక్షంలోనే హామీ ఇచ్చారు. పని పూర్తయాక పట్టించుకోవడం లేదు. కర్మాగారంపై ఒత్తిడి పెంచి రోడ్డు నిర్మాణం చేయించేలా స్థానిక కార్పొరేటర్‌తో పాటు మేయర్‌, కమిషనర్‌ స్పందించడం లేదు.


భారీ వాహనాలతో శిథిలం

రామగుండం ఎరువుల కర్మాగారంలో తుక్కు ఇనుము, బూడిద, బొగ్గు తరలించే భారీ వాహనాలు వెళ్లడంతో లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయమైంది. రోడ్డు చెడిపోతోందని వాహనాలను స్థానికులు అడ్డుకున్నప్పటికీ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్న గుత్తేదార్లు అవేం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. సెంటినరీకాలనీ, పోతనకాలనీ, పెంచికలపేట, కమాన్‌పూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో రద్దీ తీవ్రంగా ఉంటోంది.


చినుకు పడితే వరద

ప్రగతినగర్‌ కాలనీలో రహదారుల నిర్మాణం చేపట్టిన బల్దియా చాలా చోట్ల ఉపరితల, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం చేపట్టలేదు. మురుగు రోడ్డుపైనే ప్రవహిస్తూ కాలనీ చివరలో రోడ్డుపై నిలుస్తూ మురికి గుంతను తలపిస్తోంది. పరిసరాల్లోని వారు దుర్వాసనతో పాటు దోమల బెడదతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


పరిశీలనలు తప్ప.. పరిష్కారం లేదు

ఇందిరానగర్‌ కూడలి నుంచి నగరపాలక ఉపరితల జలాశయంతో పాటు పరిసర కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇది.. ఈ రోడ్డు రెండు డివిజన్లకు మధ్య ఉండడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. సుమారు పన్నెండేళ్ల క్రితం స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో రూ.10 లక్షలతో ఉపరితల మురుగు కాల్వ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినా ఆచరణకు నోచుకోలేదు.


కాలమేదైనా... మునక తప్పదు

అడ్డగుంటపల్లిలోని ఈ రోడ్డుపై కాలమేదైనా మురుగు మాత్రం రోడ్డెక్కి పారుతుంది. అడ్డగుంటపల్లి, రాజీవ్‌నగర్‌, సంజయ్‌గాంధీనగర్‌ మేదుగా వివిధ కాలనీలకు వెళ్లేవారితో నిరంతరం రద్దీగా ఉంటుంది. ఇటీవల అడ్డగుంటచెరువు ప్రాంతంలో భవన నిర్మాణాలు అధికం కావడతో రాకపోకలు పెరిగాయి. రైసుమిల్లుతో పాటు పలు వ్యాపార సంస్థలకు ఇదే ప్రధాన రహదారి. రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts