logo
Published : 27 Jun 2022 04:28 IST

అనుబంధ కాలువతో ఆయకట్టుకు భరోసా

అందుబాటులోకి రానున్న ఎస్సారెస్పీ లింక్‌ కెనాల్‌

నిర్మాణం పూర్తయిన అనుబంధ కాలువ

న్యూస్‌టుడే, పెద్దపల్లి: ఎస్సారెస్పీ ఆయకట్టులో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతుండటంతో ఏటా కాలువ చివరి భూములకు నీటి సమస్య తలెత్తుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గతంలో పాలకులు పలు ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జిల్లా అవసరాలు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో వరద కాలువ, కాకతీయ కాలువలను కలుపుతూ నిర్మించిన అనుబంధ కాలువ ఈ వానాకాలంలో అందుబాటులోకి రానుంది. రెండేళ్లుగా ఊరిస్తున్న ఇది గత వేసవిలో పూర్తి కావడంతో సాగునీటి కష్టాలు తీరనున్నాయి.

3 వేల క్యూసెక్కులతోనే ఉపశమనం
జిల్లాలో మొత్తం సాగుభూమి విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలు కాగా వీటిలో 1.87 లక్షల ఎకరాలు ఎస్సారెస్పీ ఆయకట్టు. 24 వేల ఎకరాలు బోరుబావులద్వారా, 41 వేల ఎకరాలు బావులు, 1185 ఎకరాలు చెరువులు, కుంటల ఆధారంగా సాగవుతున్నాయి. ఇవే కాకుండా గోదావరి, మానేరు నదులు, మరిన్ని చిన్న నీటి వనరుల ద్వారా పంటలు పండిస్తున్నారు. అయినప్పటికీ కాలువ ఎగువ, దిగువ ప్రాంతాలకు నీరందకపోవడంతో ఏటా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని కొన్ని గ్రామాలు, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, మంథని మండలాల్లోని చివరి ఆయకట్టుకు ప్రతి సీజన్‌లో కష్టాలు తప్పడం లేదు. రెండు కాలువల్లో కలిపి 3 వేల క్యూసెక్కుల నీరు వస్తేనే కొంత ఉపశమనం కలుగుతుంది. కాగా సామర్థ్యంతో సంబంధం లేకుండా నీటి లభ్యత ఆధారంగా ఒక్కో కాలువలో వేయి క్యూసెక్కుల వరకు నీటి విడుదలతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఎగువ ప్రాంతాలైన జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్‌, పెద్దపల్లి మండలాల్లోని పంటలు కూడా ఎండిన సందర్భాలున్నాయి.

కాకతీయ కాలువలోకి నీటిని వదిలేందుకు లింక్‌ కెనాల్‌పై ఏర్పాటు చేసిన రెగ్యులేటర్‌ గేట్లు

నిరంతరాయంగా విద్యుదుత్పత్తి
3 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన అనుబంధ కాలువలో కనీసం 2800 క్యూసెక్కుల వరకు పారే అవకాశముంది. ఈ నీటిని మొత్తం పెద్దపల్లి జిల్లా అవసరాలకు మళ్లిస్తే కాకతీయ కాలువ ద్వారా జిల్లాకు వచ్చే వాటాను ఎల్‌ఎండీకి మళ్లించేందుకు అవకాశముంటుంది. అలాగే ఏడాది పొడవునా డి-83కి నీటిని విడుదల చేస్తే కాలువలపై నిర్మించిన 9.16 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మినీ హైడల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతుంది. కాలువలో 200 క్యూసెక్కుల కనీస ప్రవాహంలోనూ కేంద్రాలు పని చేస్తాయి. డి-83 కాలువలోకి వరదకాలువ ద్వారా నిరంతరాయంగా నీటిని మళ్లించడం ద్వారా సాగునీటి అవసరాలు తీరడంతో పాటు విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియ సజావుగా జరుగుతుంది.

రివర్స్‌ పంపింగ్‌ ఆలోచనతోనే..
గోదావరి ఎగువన నిర్మించిన ప్రాజెక్టులతో వట్టిపోతున్న శ్రీరాంసాగర్‌ జలాశయాన్ని కాళేశ్వరం నీటితో రివర్స్‌ పంపింగ్‌ విధానంతో నింపాలనే ఆలోచన నుంచే లింక్‌ కెనాల్‌(అనుబంధ కాలువ)కు అంకురార్పణ జరిగింది.
వరద కాలువ నుంచి కాకతీయ కాలువకు చేరే నీటిని ఎగువకు మళ్లించేందుకు పలు ప్రాంతాల్లో గేట్లు నిర్మించి, అవసరమైన ప్రాంతాల్లో పంపింగ్‌ చేయాలనేది పథకం ఉద్దేశం.
గంగాధర మండలం ర్యాలపల్లి సమీపంలోని వరద కాలువ నుంచి మల్యాల మండలం తాటిపల్లి సమీపంలోని కాకతీయ కాలువకు నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం రూ.27 కోట్లు వెచ్చించింది.
3.25 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మాణ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతోంది. ఈ కాలువ 98వ కిలోమీటరు మైలురాయి వద్ద కాకతీయ కెనాల్‌లోకి చేరుతుంది.
అక్కడి నుంచి దిగువన 116వ కిలోమీటరు మైలురాయి వద్ద డి-83, మరో 5 కిలోమీటర్ల తర్వాత డి-86 కాలువ ఉన్నాయి. ఈ రెండు కాలువల సామర్థ్యం 3500 క్యూసెక్కులు.
లింక్‌ కెనాల్‌ను 3000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించగా, ఇందుకోసం ప్రభుత్వం 70 ఎకరాల భూమిని సేకరించింది. మరో 4.5 ఎకరాల భూసేకరణ ప్రక్రియ మందగించడంతో నిర్మాణం రెండేళ్లు ఆలస్యమైంది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts