logo
Published : 27 Jun 2022 04:28 IST

ఇక బడుల్లో బయోమెట్రిక్‌

త్వరలో పునఃప్రారంభానికి విద్యాశాఖ కసరత్తు
పరికరాల పనితీరుపై వివరాల సేకరణ
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

యంత్రంలో వేలిముద్ర వేస్తున్న ఉపాధ్యాయుడు(పాతచిత్రం)

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ హాజరు విధానం కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడాది వైరస్‌ ప్రభావం తగ్గి పూర్తి స్థాయిలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పటిష్ఠంగా నిర్వహించేలా చర్యలు చేపట్టింది. గతంలో వినియోగించిన యంత్రాల ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాఠశాలల వారీగా సమాచారం రాబట్టారు. చాలా చోట్ల యంత్రాలు మనుగడలో లేవని గుర్తించారు. వీటి స్థానంలో కొత్త పరికరాలు కొనుగోలు చేసే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.

నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట
పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. చాలా మంది ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకున్నా ప్రధానోపాధ్యాయుల పరస్పర సమన్వయంతో మరుసటి రోజు రిజిస్టరులో సంతకం చేసుకునే పరిస్థితి ఉండేది. అలాగే విద్యార్థుల హాజరులోనూ కాకి లెక్కలుండేవి. గైర్హాజరైన పిల్లల పేరిట వచ్చే మధ్యాహ్న భోజన పథకం బిల్లులు దుర్వినియోగమయ్యేవి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేందుకు, విద్యార్థుల హాజరు పక్కాగా నమోదు చేసేందుకు 2018లో బయోమెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లో పరికరాలు పని చేయకపోవడం, సిగ్నల్‌ సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం పరిస్థితి చక్కబడటంతో ఏడాది పాటు వేలిముద్రలతో హాజరు నమోదు విధానం అమలైంది.

కావాలనే పాడు చేశారా!
కొవిడ్‌ ఉద్ధృతితో దాదాపు రెండేళ్లుగా పరికరాలను వినియోగించలేదు. గతేడాది సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా బయోమెట్రిక్‌ విధానం ప్రారంభించలేదు.
ప్రతి పాఠశాలలో పరికరాల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఎక్కడెక్కడ యంత్రాలు పని చేస్తున్నాయి? ఎక్కడెక్కడ చేయడం లేదు? అనే విషయమై జాబితా రూపొందించారు.
జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో 526 బయోమెట్రిక్‌ పరికరాలున్నాయి. ఇందులో 635 పవర్‌ అడాప్టర్లలో 632 పని చేస్తున్నాయి. 418 యాంటీన్నాలకు 409 సరిగ్గా ఉన్నట్లు నివేదించారు.
కొన్ని చోట్ల ఉపాధ్యాయులు కావాలనే పరికరాలను పని చేయకుండా చేశారనే ఆరోపణలున్నాయి. బయోమెట్రిక్‌ విధానం అమలైతే సమయానికి పాఠశాలకు హాజరు కావాల్సి ఉండటంతో కావాలనే వాటిని పాడు చేశారన్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది.
జిల్లాలో తెలుగు మాధ్యమంలో 1,383 మంది, ఆంగ్ల మాధ్యమంలో 30,120 మంది, ఉర్దూ మాధ్యమంలో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి 2,274 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.


ఉన్నతాధికారులకు నివేదిస్తాం
జక్కం శ్రీనివాస్‌, సమగ్ర శిక్ష ప్రణాళిక విభాగం జిల్లా సమన్వయకర్త

జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాల పనితీరుపై సమాచారం సేకరించాం. గతంలో వినియోగించిన పరికరాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. పాడయిన వాటి స్థానంలో కొత్తగా బిగించనున్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని