logo

సిబ్బంది లేక అంగన్‌వాడీల్లో ఇబ్బంది

వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం ఇది. దీనిని మంజూరైన భవనం ఆరేళ్ల క్రితం నిలిచిపోయింది. దీంతో ఉన్నత పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి 25 మంది పైగా చిన్నారులు

Published : 27 Jun 2022 04:28 IST

వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం ఇది. దీనిని మంజూరైన భవనం ఆరేళ్ల క్రితం నిలిచిపోయింది. దీంతో ఉన్నత పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి 25 మంది పైగా చిన్నారులు రోజూ వస్తుంటారు. ఆయా అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఉపాధ్యాయురాలు కేంద్రాన్ని నెట్టుకొస్తుంది. భర్త వంట చేస్తే ఆమె చిన్నారుల ఆలనా చూసుకుంటూ గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తుంది. మధ్యాహ్నం పూట పిల్లలకు అన్నం తినిపించేందుకు తల్లుల సహకారం తీసుకొంటుంది. ఇక్కడ ఆయాని నియమిస్తే అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సమావేశాలకు వెళ్లిన సమయంలో కేంద్రం మూతపడకుండా ఉంటుంది. చిన్నారులను పర్యవేక్షించడం సులువవుతుంది.

న్యూస్‌టుడే, వీర్నపల్లి: గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో పోషకాహార లోపాన్ని అధిగమించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను నడిపిస్తున్నారు. కేంద్రాల్లో అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయడంతోపాటు విద్యను నేర్పిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు సైతం మెనూ ప్రకారం భోజనంతోపాటు గుడ్డు, పాలు, బాలామృతం, చిరుతిండికి సంబంధించిన ఆహారాన్ని ప్రభుత్వమే సమకూర్చుతోంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలను ఇప్పటికీ భర్తీ చేయకపోవడంతో జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లాలో రెండు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిపి 1,174 మంది పని చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయకపోవడంతో కేంద్రాల ద్వారా సేవలు అందించడంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 60 మంది ఆయాలు, 12 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను జిల్లాలో భర్తీ చేయాల్సి ఉంది. దీనికి తోడు వయోపరిమితి పూర్తి చేసుకున్న కార్యకర్తలు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి తరవాత ప్రక్రియను నిలిపివేశారు. కొత్త నిబంధనలు జారీ చేసి మరోసారి భర్తీకి ప్రకటన జారీ చేస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలు, అవగాహన కార్యక్రమాలు జరిగినప్పుడు చిన్నారులను పర్యవేక్షించాల్సిన ఆయాలు లేనిచోట కేంద్రాలు మూతపడుతున్నాయి. ఈ సమయంలో చిన్నారులకు ఆహారాన్ని అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే కార్యకర్తలు లేని పాఠశాలల్లో పిల్లలకు అక్షరాలు దిద్దించడం కష్టతరమవుతుంది. ఇద్దరి విధులు ఒక్కరే నిర్వర్తించడంతో అనుకున్న మేర లక్ష్యం నెరవేరడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


భర్తీ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది
- లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమాధికారి

కేంద్రాల్లో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. జిల్లాలో 72 ఖాళీలు ఉన్నాయి. అందులో 60 మంది ఆయాలు, 12 మంది అంగన్‌వాడీ టీచర్లను నియమించాల్సి ఉంది. గతంలో వెలువడ్డ ప్రకటన ప్రక్రియను ప్రభుత్వమే నిలిపివేసింది. కొత్త నిబంధనలు, విద్యార్హతలు, చిన్నారుల పర్యవేక్షణపై నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే భర్తీ చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని