logo

గడువులతోనే రెండేళ్లు పూర్తి

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు పెంచే అదనపు టీఎంసీ కాలువ పనులకు ఆటంకాలు తప్పడం లేదు. జిల్లాలో రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ వరకు చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. 2019లోనే టెండర్ల ప్రక్రియ

Published : 27 Jun 2022 04:28 IST

మందకొడిగా అదనపు టీఎంసీ కాలువ పనులు

ఇప్పటికి పూర్తయింది  35 శాతమే

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

పైపులైను పనులు

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు పెంచే అదనపు టీఎంసీ కాలువ పనులకు ఆటంకాలు తప్పడం లేదు. జిల్లాలో రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ వరకు చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. 2019లోనే టెండర్ల ప్రక్రియ ముగిసింది. 2020 జూన్‌తో గడువు ముగిసింది. దీనిని 2021 వరకు పొడిగించారు. అయినా ఇప్పటికీ 35 శాతం మాత్రమే పనులు జరిగాయి. పనుల ప్రగతికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు పూర్తయితే ప్రస్తుతం రాజరాజేశ్వర నుంచి కొండపోచమ్మకు నీటి తరలింపు రెండు టీఎంసీలకు చేరుతుంది. దీని ద్వారా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌ జిల్లాలో ఆయకట్టు పరిధిలోకి మరింత సాగుభూమి వస్తుంది.

కాళేశ్వరం నుంచి తొలుత రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా పనులు చేపట్టారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ పనులు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. మోటార్ల ట్రయల్‌రన్‌ కూడా జరిగింది. నందిమేడారం, గాయిత్రి పంపుహౌజ్‌ల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాల్వలు, పైపులైన్లు, పంపుహౌజ్‌ పద్ధతిలో జరగాలి. ఇది భూసేకరణకు అడ్డంకిగా మారింది. కరీంనగర్‌ జిల్లాలో భూసేకరణ దాదాపు పూర్తయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నాయి. పరిహారంపై అసంతృప్తి, సర్వేలో తప్పులు దొర్లాయని తిరిగి సర్వే చేసి పరిహారం చెల్లించాకే పనులు చేయాలని అడ్డుకుంటున్నారు. రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ వరకు 538 ఎకరాలకు గాను 90 శాతానికి పైగా సేకరించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలోని జలాశయం నుంచి కాల్వ తవ్వకంలో కీలకమైన 65 ఎకరాలు మూడేళ్లుగా కొలిక్కి రావడం లేదు. పరిహారంపై అసంతృప్తితో ఉన్న రైతులు ఇటీవలే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వెల్జిపూర్‌ వద్ద పంపుహౌజ్‌ పనులు


భూసేకరణ ఆటంకంగా మారింది
- శ్రీనివాస్‌, పదో ప్యాకేజీ డీఈ

జలాశయం నుంచి ప్రధాన కాల్వ తవ్వకానికి భూసేకరణ ఆటంకంగా మారింది. దీని ప్రభావం ఇతర పనులపైనా చూపుతోంది. గడువు పొడిగింపుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

పనులు జరిగేది ఇలా...
రాజరాజేశ్వర నుంచి కొండపోచమ్మకు ప్రస్తుతం ఒక టీఎంసీ నీటిని మాత్రమే తరలిస్తున్నారు. అదనపు టీఎంసీని తరలించేందుకు రాజరాజేశ్వర, అన్నపూర్ణ మధ్య రూ.3,352.17 కోట్లతో పనులు చేస్తున్నారు. ఇవి 2019లోనే ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర నుంచి 5.8 కిలోమీటర్ల కాల్వ ద్వారా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌లోని పంపుహౌజ్‌కు తరలిస్తారు. పంపుహౌజ్‌లోని నాలుగు పంపులు ఒక్కొక్కటీ 125 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది. ఇవి ఏడాదిలో 120 రోజుల్లో 120 టీఎంసీల నీటిని 16 కిలోమీటర్ల పైపులైను ద్వారా అన్నపూర్ణలోకి తరలిస్తాయి. అక్కడి నుంచి 11, 12 ప్యాకేజీల ద్వారా రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మకు తరలిస్తారు. జిల్లా పరిధిలో పూర్తిగా కాల్వ, పంపుహౌజ్‌ తవ్వకం పనులు మాత్రమే ప్రగతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని