logo
Published : 28 Jun 2022 05:14 IST

రైల్వే గేట్లు.. తప్పని పాట్లు

వంతెనల నిర్మాణంలో ఎడతెగని జాప్యం

న్యూస్‌టుడే, పెద్దపల్లి


పెద్దపల్లిలోని కూనారం రోడ్డులో గేటు పడటంతో నిలిచిన వాహనాలు

రైల్వే గేట్ల మీదుగా ప్రయాణించే వాహనదారులకు నిత్యం నరకం కనిపిస్తోంది. గేటు పడిందంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయంలో ప్రయాణం ప్రాణాల మీదకు తెస్తోంది. ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణం నిధుల కొరతతో ముందుకు సాగడం లేదు.

ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన జీటీ(గ్రాండ్‌ట్రంక్‌) ట్రాక్‌పై కాజీపేట-బల్హార్షా సెక్షన్‌లో నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గేటు మూయడం, మూసిన ప్రతిసారీ 20 నిమిషాల తర్వాతే తెరవడం అనివార్యంగా మారింది. పెద్దపల్లి, నిజామాబాద్‌ జంక్షన్‌ల మధ్య కూడా ఇలాంటి సమస్యే ఉంది.

నిధుల మంజూరుతోనే సరి

ప్రధాన మార్గాల్లో రైల్వే లెవల్‌ క్రాసింగ్‌(గేట్లు) తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆరేళ్లుగా రైల్వే పైవంతెన(ఆర్వోబీ), రైల్వే కింది వంతెన(ఆర్‌యూబీ)లను మంజూరు చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలో గడిచిన అయిదేళ్లలో 6 ఆర్వోబీలు, 3 అండర్‌పాసులు మంజూరయ్యాయి. ఒక్కో ఆర్వోబీ నిర్మాణానికి కనీసం రూ.100 నుంచి రూ.200 కోట్లు అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ మంజూరు చేసిన ఆర్వోబీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంతో పనులు ప్రారంభం కావడం లేదు. పెద్దపల్లి స్టేషన్‌ కుడి, ఎడమ వైపుల్లో కూత వేటు దూరంలో కూనారం, గౌరెడ్డిపేట(రెండు) ఆర్వోబీలు 2019లో మంజూరయ్యాయి. వీటిలో కూనారం రోడ్డువైపు రూ.219.50 కోట్లతో ప్రతిపాదించిన ఆర్వోబీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు చెల్లించడంతో పనుల నిర్వహణకు వేలం ప్రక్రియ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. గౌరెడ్డిపేట ఆర్వోబీకి నిధుల విడుదల సమస్య వెంటాడుతోంది. పొత్కపల్లి, ఓదెల, తారకరామనగర్‌, కొలనూరు, పెద్దంపేట గ్రామాల వద్ద ఆర్వోబీలను 2018లోనే మంజూరు చేశారు. గతేడాది కరీంనగర్‌ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద కూడా ఆర్వోబీని కేంద్రం మంజూరు చేసింది. రాజకీయ ప్రాధాన్యంతో మంజూరు చేస్తున్నా నిధుల విడుదలపై పాలకులు దృష్టి సారించకపోవడంతో ఆర్వోబీల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.


కల్వర్టులే అండర్‌పాసులు


మురుగుకాలువనే అండర్‌పాస్‌గా వినియోగిస్తున్న వాహనదారులు

అండర్‌పాస్‌ల నిర్మాణం కూడా సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు. పెద్దపల్లి మండలం అందుగులపల్లి, గొల్లపల్లి గ్రామాల వద్ద అండర్‌పాస్‌(దిగువ వంతెన)ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలను రైల్వే అధికారులు తిరస్కరించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆర్వోబీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఓదెల మండలం హరిపురం, పెద్దపల్లి మండలం కొత్తపల్లి, చీకురాయి గ్రామాల వద్ద అండర్‌పాస్‌ల నిర్మాణానికి అనుమతించారు. రైలు గేటు ఉన్న ప్రాంతానికి చేరువలో ఉండే కల్వర్టులను స్థానికులు అండర్‌పాసులుగా వినియోగిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని కూనారం గేటు పడితే ద్విచక్రవాహనదారులు సమీపంలోని కల్వర్టు కింది నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో మాత్రం ఈ దారిని వినియోగించుకోవడం కష్టంగా మారింది. ఇదే పరిస్థితి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ ఉంది.


సమన్వయ లోపంతో జాప్యం

* లెవల్‌ క్రాసింగ్‌లు లేని లైన్‌లు ఉండాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ ఏటా ఆర్వోబీలు, అండర్‌పాసులు మంజూరు చేస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.

* ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న ఆర్వోబీలు, అండర్‌పాస్‌లు మినహా 38 రైల్వేలెవల్‌ క్రాసింగ్‌(గేట్లు)లున్నాయి. పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ మార్గంలో 12 గేట్లు, కాజీపేట-బల్హర్షా సెక్షన్‌లో పెద్దంపేట నుంచి ఉప్పల్‌ వరకు 26 లెవల్‌ క్రాసింగులున్నాయి.

* వీటన్నింటినీ తొలగించి ఆర్వోబీ లేదా ఆర్‌యూబీ నిర్మించాల్సి ఉంది. అత్యధికంగా పెద్దపల్లి, కమలాపూర్‌ మండలాల్లో 7 చొప్పున ఉండగా, పాలకుర్తి మండలంలో ఒక లెవల్‌ క్రాసింగ్‌ గేటు ఉన్నాయి.

* ఉప్పల్‌ స్టేషన్‌ సమీపంలో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. బసంత్‌నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారి విస్తరణ కోసం నిర్మించిన ఆర్వోబీ నిర్మాణం ఇరువైపులా పూర్తయింది. కాగా రైల్వే లైన్‌పై వంతెన నిర్మాణం జరగకపోవడంతో ఇరుకు వంతెన కష్టాలు తప్పడం లేదు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts