logo
Published : 28 Jun 2022 05:14 IST

నాలాలు.. ఆక్రమణలు

వరదకాల్వల్లోకి వస్తున్న నిర్మాణాలు

కట్టడి చేయడంలో నిర్లక్ష్యం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

ప్రభుత్వాసుపత్రికి ఎదురుగా ఉన్న వీధిలో ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న వరదకాల్వ మూలమలుపులో కుదించుకుపోయింది. ఓ ఇంటి యజమాని సెట్‌బ్యాక్‌ వదిలి నిర్మించుకోగా..మరొకరు గోడను పూర్తిగా కాల్వలోకి వచ్చేలా నిర్మించుకున్నారు. నాలా గోడ పూర్తిగా పడిపోయి నీటిని ఆటంకం ఏర్పడుతోంది.

గణేశ్‌నగర్‌ బైపాసు రోడ్డులో వరదకాల్వ నిర్మాణ పనులు చేస్తుండగా కాల్వకు ఆనుకొని ఉన్న నిర్మాణాలు తొలగించారు. నిర్మాణ సమయంలోనే వెనక్కి జరిగి నిర్మించుకుంటే ఇంటి గోడలకు ముప్పు వచ్చే అవకాశముండదు.

సాయినగర్‌లో వరదకాల్వకు పైకప్పు శ్లాబులు వేసి మూసి వేయగా దానిపై తాత్కాలికంగా గోడలు, నిర్మాణాలు చేపట్టారు. భారీగా వరద వస్తే నీరంతా రోడ్ల మీదికి పరుగులు పెట్టే ప్రమాదం ఉంది.

చినుకు పడితే చాలు..ఆ నీరంతా మురుగు కాల్వల గుండానే ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహం పెరిగి వీధులు జలమయం అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు వరద కాల్వల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఆక్రమణలు తొలగించి విస్తరిస్తే ప్రయోజనం ఉంటుంది.

కరీంనగర్‌ నగరంలో 2001 సంవత్సరంలో అప్పటి జనాభా, అవసరాల మేరకు వరదకాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. ఎగువ ప్రాంతాల వచ్చే వరదనీటితో పాటు మురుగు పంపించేందుకు వీటిని నిర్మించారు. నగర వ్యాప్తంగా 35 కిలోమీటర్ల పొడువునా వచ్చే మురుగును నగర శివారు ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆ సమయంలో నిర్మించిన వరదకాల్వల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని చోట్ల వంకలు తిరిగి నిర్మించగా, ప్రమాదాలు జరగకుండా వేసిన శ్లాబులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. వరద ముంచుకొచ్చే సమయంలో వాటిని తొలగించడానికి వీల్లేకుండా తయారు చేస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

స్మార్ట్‌సిటీలో ...

స్మార్ట్‌సిటీలో రూ.132.98 కోట్లతో వరదకాల్వలు నిర్మించే పనులు ప్రారంభించారు. ఐదు జోన్ల పరిధిలో 736.3 కిలో మీటర్ల పొడవునా నాలాలు నిర్మించనున్నారు. వీటిని ప్రధాన, అంతర్గత కాల్వలుగా గుర్తించగా ప్రైమరీ, సెకండరీగా ప్రాధాన్యం ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. దీని ఆధారంగా నిర్మాణ పనులు ప్రారంభించగా వరదకాల్వలు, మురుగు కాల్వలపై ఉన్న ఆక్రమణలు, వంకలు తొలగించి విస్తరిస్తే వరద సాఫీగా ప్రవహించనుంది.

కనిపించని సర్వే

ప్రతీ రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు కలిసి నాలాల వెంట ఉన్న ఆక్రమణలు, నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టడాలను గుర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతేడాది హైదరాబాద్‌లో ముంపు సమస్య రాగా సర్వే చేయాలని, ఆక్రమణలు తొలగించాలని ఆదేశించినా కరీంనగర్‌లో మాత్రం అలాంటి సర్వేనే కనిపించలేదు. ఆక్రమిస్తే మార్కింగ్‌ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ వైపే వెళ్లడం లేదు. అంతేకాకుండా కొత్తగా ఇళ్లను నిర్మించుకుంటున్న సమయంలో కూడా పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇంటి శ్లాబులు కాల్వలపై వస్తున్నాయి.

ఆనుకునే నిర్మాణాలు

ప్రధాన వరదకాల్వలు నగరానికి రెండు వైపులా ఉన్నాయి. జనసముహం, ఇళ్ల మధ్యల్లోంచి వీటిని నిర్మించడంతో కొన్ని ప్రాంతాల్లో మురుగుకాల్వలకు ఆనుకునే నిర్మాణ పనులు చేపట్టారు. గణేశ్‌నగర్‌ బైపాసు రోడ్డు, జ్యోతినగర్‌, అశోక్‌నగర్‌, హుస్సేనీపుర, శర్మనగర్‌, సాయినగర్‌, ముకరంపుర, సంతోష్‌నగర్‌, మంకమ్మతోట, కోతిరాంపూర్‌లో కాల్వ గోడ పక్కనే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నారు. జ్యోతినగర్‌లో 15రోజుల కిందట కురిసిన వర్షానికి ఇంటి పునాది నీటిలో కొట్టుకొని పోయింది. కాల్వ మధ్యన కొంత మేర స్థలం వదిలి కట్టుకుంటే వరద తాకిడి సమయంలో నీరు లోపలికి వచ్చే అవకాశముండదు. లేదంటే గోడలకు తడి ఉండి ప్రమాదకరంగా మారే ప్రమాదముంది.

గుర్తించి చర్యలు తీసుకుంటాం : - వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

వరదకాల్వ ప్రహరీలపై ఎలాంటి నిర్మాణాలు కట్టినా తొలగించడం జరుగుతుంది. కొత్తగా నిర్మాణాలు చేసుకునే సమయంలో వెనక్కి జరిగి కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటివి ఏవైనా ఉంటే గుర్తించి చర్యలు తీసుకుంటాం.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts