logo

వానాకాలం సాగునీటి ప్రణాళికలు సిద్ధం

కొత్త నీటి సంవత్సరం జూన్‌ ఒకటి నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు సాగునీరందించే గోదావరిలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వానాకాలం పంటలకు నీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Published : 28 Jun 2022 05:14 IST

అన్ని ప్రాజెక్టుల్లో కలిపి నిల్వ ఉన్నది 47.79 టీఎంసీలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ

కొత్త నీటి సంవత్సరం జూన్‌ ఒకటి నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు సాగునీరందించే గోదావరిలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వానాకాలం పంటలకు నీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మేడిగడ్డ (లక్ష్మి బారేజి)లోకి ఎగువన ప్రాణహిత నుంచి 16 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. సరస్వతి, పార్వతి బారేజీలతోపాటు ఎల్లంపల్లి, ఎగువన శ్రీరాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లోలేదు. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో 47.79 టీఎంసీల నీరుంది. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో అవసరం మేరకు జలాశయాల్లో నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లాకు కాళేశ్వరం, ఇటు శ్రీరాంసాగర్‌లు రెండు వైపులా నీటిని తరలించే అవకాశాలున్నాయి. రాజరాజేశ్వరలో నీటి లభ్యత ఆధారంగా అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మసాగర్‌లకు నీరు తరలిస్తారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌ ప్రారంభం నుంచి సాధారణ వర్షాలే కురుస్తున్నాయి. కరీంనగర్‌లో సగటున 60 శాతం, జగిత్యాల, పెద్దపల్లిలో 50 శాతం, సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో 20 శాతం సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది రాజరాజేశ్వర జలాశయంలోకి కాళేశ్వరం, శ్రీరాంసాగర్‌, వరదల ద్వారా 84 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వీటిలో 60 టీఎంసీలు దిగువ మానేరుకు, 16 టీఎంసీలు కాళేశ్వరం 10, 11, 12 ప్యాకేజీలకు వదలిరారు. 9వ ప్యాకేజీ, అదనపు ఎత్తిపోతల పనులు అసంపూర్తిగా ఉండటంతో ఎగువమానేరులోకి మల్లన్నసాగర్‌ నుంచి కూడెల్లివాగు ద్వారా నింపారు. 2.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎగువమానేరులో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉంది. ప్రస్తుతం జిల్లాలోని 677 చెరువులకు 215 చెరువుల్లో మాత్రమే 50 శాతం మేరకు నీరుంది. గతేడాది వానాకాలం సీజన్‌కు ముందే జలాశయాలు, చెరువుల్లో నీరు ఆశాజనకంగా ఉంది. జలాశయాల పరిధిలో చాలా వరకు మైనర్‌ కాల్వల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. చెరువులు, కుంటలను నింపి నీటిని వినియోగిస్తున్నారు.

పెరిగిన ఆయకట్టు పరిధి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2017-18 వరకు గరిష్ఠ సాగు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలకు మించలేదు. 2019 నుంచి జిల్లాల వారీగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 13.09 లక్షల ఎకరాలుగా వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో ఈ వానాకాలం 8.68 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. ఇప్పటికే వరినారు మళ్లు సిద్ధం చేసుకున్న రైతులు జులై మొదటి వారం నుంచి నాట్లు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రస్తుతం సాధారణ నీటి మట్టం కంటే తక్కువగానే ఉంది. వర్షాలు, వరదలతో జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, జలాశయాలకు నీటి విడుదల ప్రణాళికపై జిల్లా జలవనరులశాఖ ఈఈ అమరేందర్‌రెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా ప్రాజెక్టుల్లోకి ఈనెల 12 నుంచి నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. ఎగువమానేరు కింద ఆయకట్టుకు జులై రెండో వారంలో నీటిని అందిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని