logo

గన్నీ సంచుల నష్టాన్ని మేమెందుకు భరించాలి?

ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన గన్నీ సంచులు చిరిగి వస్తున్నాయని, వాటిని వాపసు తీసుకోకుండా పాడైన సంచుల డబ్బులను

Published : 28 Jun 2022 05:14 IST

కేడీసీసీబీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం


సమావేశంలో మాట్లాడుతున్న బ్యాంకు అధ్యక్షుడు రవీందర్‌రావు

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన గన్నీ సంచులు చిరిగి వస్తున్నాయని, వాటిని వాపసు తీసుకోకుండా పాడైన సంచుల డబ్బులను తమ సంఘాల నుంచి వసూలు చేయడంతో సంఘాలకు నష్టం వాటిల్లుతోందని సహకార సంఘాల అధ్యక్షులు ధ్వజమెత్తారు. సోమవారం ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశం రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు అధ్యక్షతన జరిగింది. చర్చకు వచ్చిన గన్నీ సంచుల విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని రవీందర్‌రావు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు క్వింటాలుకు రూ.32 కమీషన్‌ ఇస్తున్న వివరాలను సంఘాల అధ్యక్షులకు తెలపాలని, డివిడెంట్‌ పెంచాలని సభ్యులు కోరారు. పెట్రోల్‌బంకులకు సరఫరా చేసే డీజిల్‌ పెట్రోల్‌పై రాయితీ ఇవ్వాలని కోరగా కేంద్ర సహకారశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి వచ్చే నెల 4న తీసుకువెళ్తున్నట్లు రవీందర్‌రావు సమాధానం ఇచ్చారు. సంఘాల అధ్యక్షులకు గౌరవవేతనం, ప్రొటోకాల్‌ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

రూ.వంద కోట్ల రుణాలు పంపిణీ చేశాం

పంటలకు, నిరుద్యోగులు ఉపాధి పొందేందుకు రూ.వందకోట్లకు పైగా రుణాలిచ్చి బ్యాంకు అండగా నిలిచిందని రవీందర్‌రావు తెలిపారు. గృహ నిర్మాణ రుణాలు కూడా రూ.75లక్షలు ఇస్తామని ప్రకటించారు. కర్షకమిత్ర ద్వారా ప్రతీ సంఘానికి రూ.50లక్షలు, మరో పద్ధతిలో రూ.కోటి కేటాయిస్తున్నామని, వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కరీంనగర్‌ డెయిరీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. పంటలతో పాటు పాల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. 3లక్షల లీటర్ల పాలసేకరణకు అవసరమయ్యే కొత్త ప్రాజెక్టు సిద్ధమైందని త్వరలోనే సీఎం చేత ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. రూ.415 కోట్ల టర్నోవర్‌తో పాటు హైదరాబాద్‌లో కూడా 60వేల లీటర్ల పాలు, పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నామన్నారు. సమావేశంలో బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు, బ్యాంకు ఉపాధ్యక్షుడు రమేశ్‌, జిల్లా సహకార శాఖ అధికారులు శ్రీమాల, రామనుజచార్యులు, నాబార్డు డీజీఎం అనంత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని