logo

ప్రాంగణం.. ప్రహసనం

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు, నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ ఏడాది పల్లెప్రగతిలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల(టీకేపీ) ఏర్పాటును ప్రభుత్వం చేర్చింది.

Published : 28 Jun 2022 05:38 IST

క్రీడా మైదానాలకు ప్రభుత్వ స్థలాలు కరవు

చాలా చోట్ల దూరంగా ఏర్పాటుకు నిర్ణయం

న్యూస్‌టుడే, ధర్మారం

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు, నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ ఏడాది పల్లెప్రగతిలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల(టీకేపీ) ఏర్పాటును ప్రభుత్వం చేర్చింది. ఉపాధిహామీ పథకం నిధుల నుంచి రూ.4.17 లక్షల అంచనా వ్యయంతో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో కోర్టులతో పాటు లాంగ్‌జంప్‌ పిట్‌, డబుల్‌బార్‌, సింగిల్‌బార్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా అందుబాటులో ప్రభుత్వ భూములు లేకపోవడం, ఉన్నప్పటికీ ఇతరుల ఆక్రమణలో ఉండటం సమస్యగా మారింది. దీంతో చాలా చోట్ల ప్రాంగణాల ఏర్పాటు ఆలస్యమవుతోంది.

స్థలాల గుర్తింపే అసలు సమస్య

జిల్లాలోని 14 మండలాల పరిధిలోని 353 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూన్‌ 2 నాటికే రెవెన్యూ అధికారులు స్థలాలు గుర్తించి పంచాయతీలకు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 163 చోట్లనే స్థలాలు గుర్తించారు. మిగతా గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోవడం, ఉన్న చోట అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం కేటాయించిన స్థలాలు సైతం చాలా చోట్ల ఊళ్లకు దూరంగా ఉన్నవి, రాళ్లు, రప్పలతో నిండి చదును చేసేందుకూ వీలు కానివే. దీంతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రహసనంగా మారింది.

పాలకుల చొరవతోనే ప్రయోజనం

గ్రామాల్లో పాఠశాలల మైదానాలు, వివిధ సామాజిక భవనాల వద్ద ఖాళీ స్థలాలున్నాయి. ఇలాంటి చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపితే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. ఊరికి దూరంగా నిర్మిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లక్ష్యం 353

స్థలం గుర్తించినవి 163

పనులు ప్రారంభం 68

పనులు పూర్తయినవి 48

ప్రగతిలో ఉన్నవి 20

ఎక్కడెక్కడ.. ఎలా..!

* ధర్మారం మండలంలోని 29 పంచాయతీల పరిధిలో 36 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు నిర్ణయించగా ఆరు చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. వీటిలో నాలుగు పూర్తి కాగా రెండు ప్రగతిలో ఉన్నాయి.

* ధర్మారంలో జక్కన్నపల్లి శివారులో గిరిజిన బాలికల గురుకులం వెనుక వైపు గుల్లకోటకు వెళ్లే రహదారికి సమీపంలో స్థలం కేటాయించారు. స్థలాన్ని చదును చేశాక మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు. పట్టణానికి దూరంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా మండల పరిషత్తు కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రతిపాదించారు.

* నర్సింగాపూర్‌లో 5 కిలోమీటర్ల దూరంలోని పెగడపల్లి మండలం నక్కపలి సమీపంలో స్థలాన్ని చూపించారు. ఇందుకు పంచాయతీ అభ్యతరం తెలిపి ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నందిమేడారంలో ఊరికి దూరంగా స్థలాన్ని చూపించారు.

* దొంగతుర్తిలో వివాదాస్పద భూమిని కేటాయించారు. స్థానిక అధికారులు చదును పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ సాగు చేసుకుంటున్న అనుభవదారు అభ్యంతరం తెలిపారు.

* అంతర్గాం మండలంలో 18 ప్రాంగణాల ఏర్పాటు లక్ష్యం కాగా, మూడు పూర్తయ్యాయి. రెండు చోట్ల ప్రగతిలో ఉన్నాయి.

* ఎలిగేడులో 14కు గాను 4, జూలపల్లిలో 15కు 3, కమాన్‌పూర్‌లో 17కు 4 చోట్ల భూములు గుర్తించారు. 3 చోట్ల మాత్రమే పూర్తయ్యాయి.

* మంథని మండలంలో 48 ఆవాసాల్లో క్రీడా ప్రాంగణాలకు 14 చోట్ల మాత్రమే స్థలాన్ని గుర్తించారు. ఆరు చోట్ల పనులు ప్రారంభించగా అయిదు చోట్ల పూర్తయ్యాయి.

* ముత్తారంలో 3, పాలకుర్తిలో 4, పెద్దపల్లిలో 9, రామగిరిలో 2, శ్రీరాంపూర్‌లో 3 పనులు మాత్రమే పూర్తి చేశారు.

* ఓదెల మండలంలో 23కు గాను 12 చోట్ల స్థలాలు గుర్తించారు. అయిదు చోట్ల పనులు మొదలుపెట్టారు. గుంపుల, గుండ్లపల్లిలో మాత్రమే పూర్తయ్యాయి. మడక, పొత్కపల్లి, నాంసానిపల్లిలలో ఊరికి దూరంగా ఉన్నాయి.

● సుల్తానాబాద్‌ మండలంలో 35 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు లక్ష్యం కాగా, 7 చోట్ల మాత్రమే భూములు కేటాయించారు. కాట్నపల్లి, గర్రెపల్లి, చిన్నకల్వలలో పూర్తయ్యాయి. ఐతురాజ్‌పల్లి, సుద్దాల గ్రామాల్లో స్థలాలు దూరంగా ఉన్నాయి.


ఊరికి దూరం.. అటవీ ప్రాంతం

ధర్మారం మండలం కటికెనపల్లిలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలం ఇది. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో, అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉంది. వన్యప్రాణులూ తిరుగుతున్నాయి. ఈ స్థలాన్ని కూలీలతో చదును చేయడం సాధ్యం కాదు. యంత్రాలతో చదును చేసి పరికరాలు ఏర్పాటు చేసినా యువత ఇక్కడకు వచ్చి సాధన చేసే ఆస్కారం లేదు.


కానంపల్లిలో అందుబాటులో మైదానం

కానంపల్లిలోనూ మొదట ఊరికి దూరంగా, అటవీ ప్రాంతానికి సమీపంలో స్థలం కేటాయించారు. అయితే అక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని, ఊరికి మధ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేయాలని పంచాయతీ నిర్ణయించింది. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని