logo

ఉపాధ్యాయుల సహకారం.. విద్యార్థులకు ఉపకారం

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) అర్హత పరీక్షలో మాడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. పదేళ్లుగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికై సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాల్లో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.

Published : 28 Jun 2022 05:38 IST

ఎన్‌ఎంఎంఎస్‌ ప్రతిభా పరీక్షలో ర్యాంకుల పంట

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) అర్హత పరీక్షలో మాడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. పదేళ్లుగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికై సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాల్లో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.

25 మందికి ఉపకార వేతనాలు అందనున్నాయి. 2013-14లో ముగ్గురితో ప్రారంభం కాగా, క్రమేపి ఏడాదికి పదుల సంఖ్యలో ఎంపికయ్యే స్థాయికి చేరారు. కరోనాతో రెండేళ్లుగా తరగతులు సరిగ్గా జరగకపోయినా అధిక మంది సత్తా చాటారు. లింగాపూర్‌ మాడల్‌ పాఠశాల ఉపాధ్యాయులు రాజశేఖర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో విశేష ఫలితాలు వస్తున్నాయి. మెరిట్‌ విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి అవసరమైన శిక్షణను ఉదయం, సాయంత్రం వేళల్లో సెలవు రోజుల్లో అందించారు.

రెండు పేపర్లలోనూ..

ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్షలకు ఎనిమిదో తరగతి విద్యార్థులు అర్హులు.. వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు మ్యాట్‌, శాట్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక్కో పేపరుకు 90 మార్కుల చొప్పున 180 మార్కులు ఇస్తున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి ఏటా రూ.12 వేలు ఉపకార వేతనం అందుకుంటారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అందుతుంది. ఏటా సెప్టెంబరులో నోటిఫికేషన్‌ వేసి నవంబరులో పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా పరీక్షలు, ఫలితాలు వచ్చాయి.

సాధనతోనే మంచి మార్కులు... : - కాల్వ వెన్నెల, తొమ్మిదో తరగతి

ఖని ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి వరకు చదివా.. అనంతరం 6వ తరగతి ప్రవేశం కోసం లింగాపూర్‌ మాడల్‌ స్కూల్‌ ప్రవేశపరీక్ష రాసి 8వ ర్యాంకు సాధించి ప్రవేశం పొందా. మా పాఠశాలలోని ఆంగ్ల ఉపాధ్యాయుడు రాజశేఖర్‌ శిక్షణతో ఎన్‌ఎంఎంఎస్‌లో 130 మార్కులు సాధించి జిల్లా స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించా. కరోనా సమయంలోనూ ప్రతి రోజు పాఠశాలకు వచ్చి ప్రత్యేకంగా తరగతులకు హాజరయ్యాను. గణితం, సైన్స్‌లో మంచి మార్కులతోనే జిల్లా ర్యాంకులు వచ్చాయి.

గణితంలో పట్టు సాధించా... : - చందన, తొమ్మిదో తరగతి

ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసి 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మాడల్‌ పాఠశాలలో ప్రవేశం పొందా. గణితంపై పట్టు ఉండటంతో నాపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఎన్‌ఎంఎంఎస్‌లో 128 మార్కులు సాధించా.. ఉపకార వేతనానికి ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల శిక్షణతో మంచి మార్కులు వచ్చాయి. నా కష్టానికి తగిన ఫలితం దక్కింది.

ఇంటర్‌ వరకు ప్రోత్సాహకం.. : - తోకల సిరి, తొమ్మిదో తరగతి

ప్రభుత్వ పాఠశాలలో సాధారణంగా పేద విద్యార్థులే చదువుతుంటారు. ఎన్‌ఎంఎంఎస్‌లో 126 మార్కులు సాధించా.. చిన్నప్పటి నుంచి చదువులో ముందుంటా.. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు హైదరాబాద్‌ ప్రైవేటు పాఠశాల, 4వ, 5వ తరగతి ఖని ప్రైవేటు పాఠశాలలో చదివి 6వ తరగతి మాడల్‌ పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి అనుమతి పొందాను. ఎన్‌ఎంఎంఎస్‌లో ప్రతిభ కనబర్చాలని నిత్యం సంబంధిత పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదివాను.. ఇంటర్‌ వరకు ప్రోత్సాహకం అందనుంది.

ప్రత్యేక చొరవతోనే ఫలితాల సాధన : - ముత్యం రాజశేఖర్‌, మాడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నిరుపేదలే... వారికి సాధారణ పాఠ్యంశాలతో పాటు.. ప్రత్యేకంగా మ్యాట్‌, శాట్‌కు సంబంధించిన అంశాలు వివరించడంతో పాటు సాధన చేయిస్తాను. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనుడటంతో ప్రత్యేక శ్రద్ధ పెరగడంతో సాధించాలన్న పట్టుదల పెరుగుతోంది. ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతోనే ప్రతి రోజు పాఠశాలలో మూడు పీరియడ్లు సంబంధిత పాఠ్యాంశాలను సాధన చేయించడంతో ఈ ఫలితాలు రాబట్టగలుగుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని