logo

పల్లె ప్రకృతి వనాలు... హరిత నిలయాలు

పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రభుత్వం గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నాయి.

Published : 28 Jun 2022 05:38 IST

పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం

న్యూస్‌టుడే, కోనరావుపేట


మర్తన్‌పేటలో...

పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రభుత్వం గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నాయి. దీంతో ప్రకృతి వనాలు హరిత నిలయాలకు చిరునామాగా మారాయి. ప్రజలు, చిన్నారులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు చూస్తున్నాయి.

కోనరావుపేట మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ కేటాయించిన సుమారు 20 గుంటల నుంచి ఎకరం భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వనానికి ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలు కేటాయించారు. వీటిలో వనం ఏర్పాటుకు రూ. 3 లక్షలు సామగ్రికి, మొక్కల కొనుగోలు, కూలీల వేతనాలకు మరో రూ. 2 లక్షలు వెచ్చించారు. దట్టమైన అటవీ ప్రాంతం ఏర్పాటుకు పలు రకాల మొక్కలు నాటించారు. ప్రకృతి వనం చుట్టూ పెద్ద సైజు, మధ్యలో వేప, జామ, కానుగ, గుల్‌మొహర్‌, సీమతంగేడు, మధ్యలో పలు రకాల పూల మొక్కలు నాటించారు. ఇవి ఏపుగా పెరిగి పచ్చదనం ఉట్టిపడేలా కళకళలాడుతున్నాయి. ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు సౌకర్యంగా ఉండేలా నడకదారి ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధుల ఆధారంగా పిల్లలు ఆడుకోవటానికి క్రీడా సామగ్రిని నెలకొల్పారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను వన సంరక్షణ సేవలకు అప్పగించారు. కూర్చోవటానికి బెంచీలు ఏర్పాటు చేశారు. మొక్కలు, ప్రకృతి వనాల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు రోజూ సాయంత్రం ప్రకృతి వనాలకు వెళుతూ ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు గడుపుతూ మానసిక ఉల్లాసం పొందుతున్నారు.


కొండాపూర్‌ పల్లె ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన మొక్కలు

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: -ఓదెల రామకృష్ణ, ఎంపీడీవో, కోనరావుపేట

గ్రామాల్లో ప్రకృతి వనాలు పచ్చదనంతో నిండిపోయాయి. పండ్ల మొక్కలు ఫలాలను ఇవ్వడంతో కోతులకు ఆహారం లభించి జనావాసాలపై సంచరించడం కొద్దిమేర తగ్గింది. ప్రకృతి వనంలో పలు రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, క్రీడా సామగ్రి, నడక దారి ఉండటంతో సద్వినియోగం చేసుకోవాలి. దీంతో స్వచ్ఛమైన గాలి లభించటంతో ఉపశమనం పొంది ఆరోగ్యంగా జీవించటానికి వీలుంటుంది. పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని