logo
Published : 28 Jun 2022 05:38 IST

హత్య కేసులో 9 మంది నిందితుల అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే, చిత్రంలో అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌కు చెందిన నాగుల వేణు (40) హత్య కేసుకు సంబంధించి 9 మందిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. తిప్పాపూర్‌కు చెందిన నాగుల వేణు తాయత్తులు కడుతూ జీవించేవాడని, ఈక్రమంలోనే రమ్య అనే యువతి తాయత్తు కట్టించుకునేందుకు అమ్మమ్మతో కలిసి ఈ నెల 23న వేణు దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. అమ్మమ్మ బయట ఉండగా రమ్య వేణు గదిలోకి వెళ్లగా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున ఇంటికి వెళ్లి ఫోన్లో తన మేన బావ జలందర్‌, సోదరుడు బరిగెల రోహిత్‌లకు చెప్పిందన్నారు. జలందర్‌ మరుసటి రోజు 24న తన స్నేహితులు తీగల నరేశ్‌, కత్తుల మాధవరెడ్డి, కోడి రాజశేఖర్‌, స్వామిలను తీసుకొని సారంపల్లిలోని బరిగెల రోహిత్‌, బరిగెల రాజుల వద్దకు వెళ్లాడని తెలిపారు. అందరు కలిసి వేణును చంపాలని నిర్ణయించుకొని సిరిసిల్లలోని మడేలయ్యగుడి దగ్గరకు వచ్చినట్లు చెప్పారు. నరేశ్‌ బాబాయి గొట్టె కిరణ్‌ ద్వారా వేణుకు ఫోన్‌ చేయించి పని ఉందని రమ్మని చెప్పి కిరణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. వేణు, యాదగిరి ప్రసాద్‌రావుతో కలిసి సిరిసిల్లకు వచ్చినట్లు పేర్కొన్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మడేలయ్యగుడి వద్దకు వేణును తీసుకెళ్లి కట్టెలు, ఇటుకతో తీవ్రంగా కొట్టి గాయపరిచారన్నారు. అడ్డువచ్చిన ప్రసాద్‌రావును కూడా కొట్టి చంపుతామని బెదిరించినట్లు చెప్పారు. అదే సమయంలో వేణుకు తన అల్లుడు కపిల్‌ ఫోన్‌ చేయగా తనను కొడుతున్నారని చెప్పడంతో కపిల్‌, ఆశవ్వ, సంపత్‌లు వెంటనే అక్కడికి చేరుకున్నారన్నారు. తన తమ్ముడిని ఎందుకు కొడుతున్నారని ఆశవ్వ అడగగా నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. తీవ్ర గాయాలైన వేణుకు వేములవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించగా మృతి చెందినట్లు ఎస్పీ వివరించారు. వేణు మృతికి కారకులైన జలందర్‌, రమ్య, రోహిత్‌, నరేశ్‌, కిరణ్‌, స్వామి, మాధవరెడ్డి, రాజశేఖర్‌లతో పాటు మరో వ్యక్తిని మంగళవారం మడేలమ్మగుడి వద్ద పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌, మూడు కర్రలు, సిమెంటు ఇటుకను స్వాధీనపరుచుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఎవరైన తాయత్తుల పేరిట మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వాటిని నమ్మవద్దని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ అనిల్‌కుమార్‌, ఎస్‌ఐలు రఫీక్‌ఖాన్‌, సీననాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts