logo

పదిలో 91.37శాతం ఉత్తీర్ణత

పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. కరోనా కంటే ముందు వరసగా మూడేళ్లు రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపగా

Published : 01 Jul 2022 03:01 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. కరోనా కంటే ముందు వరసగా మూడేళ్లు రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపగా రాష్ట్రంలో వెనకబడ్డప్పటికి జిల్లాలో 91.37 శాతం ఉత్తీర్ణత సాధించి పరువు నిలుపుకున్నారు. జిల్లాలో 11,786 మంది పరీక్షలు రాయగా అందులో 10,769 మంది ఉత్తీర్ణులయ్యారు. 6135 మంది బాలురు పరీక్ష రాస్తే 5454 మంది(88.09 శాతం), 5651 మంది బాలికలు పరీక్ష రాస్తే 5315 మంది(94.05 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 333 పాఠశాలలుండగా 87 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. 229 ప్రభుత్వ పాఠశాలల్లో 38, 104 ప్రైవేటు పాఠశాలల్లో 49 వందశాతం ఫలితాలు సాధించాయి. మొత్తం విద్యార్థుల్లో 247 మంది 10.0 జి.పి.ఏ సాధించగా 385 మంది 9.8, 427 మంది 9.7, 567 మంది 9.5 జి.పి.ఏ సాధించారు.


తండ్రికి అనారోగ్యం.. గురి తప్పని లక్ష్యం

తల్లిదండ్రులతో శ్రీజ

మేడిపల్లి: మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన తోట రవీందర్‌-జలజ దంపతుల కూతురు శ్రీజ ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించింది. రవీందర్‌ విద్యుత్తు మోటార్లు రిపేర్‌ చేసుకుంటూ జీవిస్తుండగా రెండేళ్లుగా అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లి బీడీలు చుడుతూ వ్యవసాయ పనులు చేస్తోంది. కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలే అయినా.. తండ్రి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నా శ్రీజ చదువుపై పట్టు వీడలేదు. పేదరికం వెంటాడుతున్నా అక్కయ్య రుచిత  ఈ ఏడాది ఇంటర్‌లో 90 శాతం పైగా మార్కులు సాధించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో శ్రీజ 10 జీపీఏ సాధించిందని తెలిసి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.


పాలనాధికారి ప్రత్యేక దృష్టి
కరోనాతో రెండేళ్లు పరీక్షలు రాయకున్నా ప్రభుత్వం అందరినీ పాస్‌ చేయగా ఈ సంవత్సరం చదువులో విద్యార్థులు వెనకబడ్డ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌ గుగులోతు రవి మొదటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నత పాఠశాలలన్నింటిలో విద్యార్థులకు అల్పాహారం కోసం రూ.20 లక్షలు ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. చదువులో వెనకబడిన వారిని గుర్తించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పరీక్షల సందర్భంగా కఠినంగానే వ్యవహరించారు. ప్రతి పాఠశాలకో ఇతర శాఖలకు చెందిన అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

పేదింట విద్యా కుసుమం
కోరుట్లగ్రామీణం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక్కడు పదోతరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించి ప్రతిభ కనబరిచాడు. కోరుట్ల పట్టణానికి చెందిన గుంటుక రవికుమార్‌-మాధవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షణ్ముక్‌ కల్లూర్‌ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి గురువారం విడుదలైన ఫలితాల్లో 10 జీపీఏ సాధించాడు. తండ్రి టైలరింగ్‌ పని చేస్తుండగా తల్లి బీడీ కార్మికురాలు.  

వందశాతం..
మెట్‌పల్లి గ్రామీణం: వేంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 18 మందికి గాను 18 మంది ఉత్తీర్ణత చెందారు.  

ఇప్పటి వరకు 27 సార్లు
మల్యాల: తాటిపల్లిలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఏడు కూడా వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాల ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 37 పదో తరగతి బ్యాచ్‌లు ఉన్నత చదువులకు వెళ్లగా అందులో 27 సార్లు వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురువారం ప్రకటించిన పదో తరగతి పరీక్షల్లో మొత్తం 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో డి.పూర్ణిమ, శివప్రియ అనే విద్యార్థులిద్దరు 10 జీపీఏ సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని