logo

నేటి నుంచి ప్లాస్టిక్‌ నిషేధం

ప్లాస్టిక్‌..మానవాళికి పెనుముప్పుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ) వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ఇవి మట్టిలో కలిసేందుకు దశాబ్దాలు పడుతోంది. వివిధ దశల్లో

Published : 01 Jul 2022 03:01 IST

ఒకసారి వాడి పారేసే వస్తువులపై నిఘా
నగరాలు, పట్టణాల్లో చర్యలకు ఆదేశాలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

నగరంలో తనిఖీలు చేస్తున్న సిబ్బంది

ప్లాస్టిక్‌..మానవాళికి పెనుముప్పుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ) వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ఇవి మట్టిలో కలిసేందుకు దశాబ్దాలు పడుతోంది. వివిధ దశల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పలుమార్లు కార్యాచరణ చేపట్టినా.. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పకడ్బందీగా అమలుకు చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని నగర, పురపాలికల్లో నివసించే ప్రజలకు నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగం ఒక భాగమైంది. దాని వినియోగం లేనిదే ఆ రోజు గడవడం లేదు. మార్కెట్లు, కిరాణ దుకాణాలు, చిరు వ్యాపారులు, పండ్ల బండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర ప్రాంతాల్లో ఒకసారి వాడి పడేసే కవర్లను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. విద్యావంతుల నుంచి మొదలుకొని కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ చేతిలో రెండు, మూడు కవర్లు వెంట తీసుకెళ్లడం సాధారణంగా మారింది.  బయటకు వచ్చే సమయంలో బట్ట సంచులు తీసుకు రావాలనే ఆలోచన చేయడం లేదు. కొంతమంది వ్యాపారులైతే వినియోగదారులకు కనీసం అవగాహన కల్పించకుండా ఇదే పనిగా వీటిని వాడుతున్నారు. పాలిథిన్‌ సంచులు నిషేధించడానికి గతంలో హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత విస్మరించింది. కొవిడ్‌ కారణంగా తనిఖీలు వదిలేయగా.. వ్యాపారులు సైతం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుండటంతో గతేడాది రోజుకు సుమారు 20 టన్నుల మేర వ్యర్థాలు బయట వదిలేశారు.

120 మైక్రాన్ల లోపుంటే..
ఇప్పటికే 50 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నిషేధించారు. ఒకసారి వాడి పడేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 75 మైక్రాన్లకు పెంచింది. గతేడాది డిసెంబర్‌ నుంచి 120 మైక్రాన్ల కవర్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, అమ్మకం, వాడకాన్ని జులై 1నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్దేశించిన మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లు తయారు చేసిన వారికి రూ.50 వేలు, అమ్మిన వారికి రూ.2500 నుంచి రూ.5వేలు, వాడిన వ్యక్తులకు రూ.250, రూ.500ల  నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించనుంది.

జాబితాలోనివి ఇవే
ప్లాస్టిక్‌ స్టిక్స్‌ తయారు చేసిన ఇయర్‌ బడ్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, ఐస్‌క్రీం పుల్లలు, క్యారీ బ్యాగ్స్‌, ప్యాకింగ్‌ చేయడం, సిగరెట్‌ ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ చెంచాలు, ముళ్ల చెంచాలు, ప్లేట్లు, కత్తులు, థర్మకోల్‌తో చేసిన ఆలంకరణ వస్తువులు, కప్పులు, అద్దాలు, స్టిక్కర్లు, స్ట్రాలు, మిఠాయి డబ్బాలు, ఆహ్వానపత్రాలు, 100మైక్రాన్ల కంటే తక్కువ కలిగిన పీవీసీ బ్యానర్లు, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్‌ స్టిక్స్‌ వంటివి పూర్తిగా నిషేధించనున్నట్లు ఉత్తర్వులో వివరించారు.

తనిఖీలు..అవగాహన కార్యక్రమాలు
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ సంచులను, వస్తువులను పూర్తిగా నిషేధిత జాబితాలోకి చేర్చడంతో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో సిటీ లెవల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్‌, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌జీవో, పోలీసు కానిస్టేబుల్‌ కమిటీలో ఉంటారు. వీరంతా శుక్రవారం నుంచి తనిఖీలు చేయడంతో పాటు జరిమానా విధిస్తారు. ప్రజలకు, వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువులను వివరించనున్నారు. దీనికోసం ప్రధాన రహదారులపై ప్రచారబోర్డులు, హోర్డింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. విస్తృతంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.


కఠిన నిబంధనలు అమలు

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నేటి నుంచి ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని, క్షేత్రస్థాయిలో 75 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ సంచులను ఎవరూ వాడరాదని, నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా పాలనాధికారి కర్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఒక ప్రకట విడుదల చేశారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు కచ్చితంగా అమలు చేయాలని ఆప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని