logo

బోసిపోయిన పర్యాటకం

ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యాటకానికి అనువుగా ఉన్నా.. అభివృద్ధి కరవైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ఔషధ గుణాలున్న మొక్కలతో నిండిన కొండ ప్రాంతాలున్నాయి. ఏటా శ్రావణ మాసంలో ఆహ్లాదం గొలిపే ప్రాంతాలు

Published : 02 Jul 2022 04:21 IST

పడవలు తెచ్చి వదిలేశారు..

ప్రతిపాదనలు దాటని పనులు

న్యూస్‌టుడే, గోదావరిఖని, గంగాధర, హుజూరాబాద్‌

సైదాపూర్‌ మండలం రాయికల్‌ ప్రాంతంలోని ఆహ్లాదం గొలుపుతున్న జలపాతం

ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యాటకానికి అనువుగా ఉన్నా.. అభివృద్ధి కరవైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ఔషధ గుణాలున్న మొక్కలతో నిండిన కొండ ప్రాంతాలున్నాయి. ఏటా శ్రావణ మాసంలో ఆహ్లాదం గొలిపే ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతాయి. కానీ అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరినది నిండుకుండలా ఉంటోంది. పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు నెరవేరడం లేదు. నదుల్లో విహరించేందుకు బోటింగ్‌, ఆహ్లాదంగా గడిపేందుకు పచ్చని మైదానాలు, హరిత హోటళ్లతో సందడిగా ఉండాల్సిన కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో సందర్శకులు కనిపించడం లేదు.

ఆధ్యాత్మిక కేంద్రాల్లో పట్టింపేది?

దక్షిణకాశీగా గుర్తింపు పొందిన వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఆలయానికి పక్కనే ఉన్న చెరువును విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు. అత్యంత విశిష్టమైన ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సమీపంలోని గోదావరినది తీరాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తలచినా నిర్లక్ష్యానికి గురవుతోంది. మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకోవడానికి రోప్‌వే నిర్మించాలన్నదీ కార్యారూపం దాల్చడం లేదు. కోటిలింగాల ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకు ఆహ్లాదం కోసం గోదావరినది తీరంలో ఆహ్లాదం కల్పించేందుకు పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఉమ్మడి జిల్లాలో జలపాతాలతో పాటు పచ్చని చెట్లతో విహారయాత్రకు వెళ్లి సరదగా గడిపే సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్య కేంద్రాలున్నా కనీసం అభివృద్ధిని విస్మరించారు.

పెద్దపల్లి జిల్లాలో..

మంథని మండలంలో ఎల్‌-మడుగు ప్రకృతి వనంతో పాటు గోదావరినదీ నీటితో జలాశయం మాదిరిగా ఆకర్శిస్తుంది.. అందులో పడవ ద్వారా విహరించే వారికి ఎంతో పర్యాటక అనుభూతి కలుగుతుంది. రామగిరిఖిల్లా శత్రుదుర్భేద్యమైన కోట. ఔషధ గుణాలున్న ఎన్నో రకాల మొక్కలున్నాయి. పర్యాటక కేంద్రంగా తయారు చేయడంతో పాటు ఔషధ మొక్కల పరిశోధన కేంద్రంగా తయారు చేయాలన్న ప్రతిపాదనకు మోక్షం లభించలేదు. సబితం గ్రామ సమీపంలో ఎత్తైన కొండల మధ్య నుంచి వచ్చే జలపాతం ఆహ్లాదాన్ని గొలుపుతుంది. ఏటా ఎంతో మంది సందర్శకులు సేదదీరుతుంటారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. బసంత్‌నగర్‌ వద్ద బుగ్గగుట్ట ప్రాంతం పర్యాటకానికి అనుకూలం. ఏడాది పొడవునా సందర్శకులతో సందడిగా ఉంటుంది.

కరీంనగర్‌లో..

ఎలగందుల చారిత్రాత్మకమైన ఖిల్లాను వీక్షించేందుకు ఎంతో మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ కేవలం మ్యూజికల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. అవీ పనిచేయడం లేదు. సైదాపూర్‌ మండలం రాయికల్‌ గ్రామ శివారులో సహజసిద్ధ జలపాతం చూపరులను ఆకర్శిస్తోంది. అక్కడ ఎలాంటి సౌకర్యాల్లేవు. జిల్లా కేంద్రంలోని ఉజ్వలపార్కులో సందర్శకులను ఆకట్టుకోవడానికి మరింత మెరుగైన పనులు చేపట్టాలి. గంగాధర మండలం బొమ్మలగుట్టను పర్యాటక క్షేత్రంగా తయారు చేస్తామని ప్రతిపాదించారు. కేవలం మెట్లు మాత్రమే నిర్మించారు.

జగిత్యాలలో..

వెల్గటూరు మండలంలోని మునులగుట్ట పచ్చని చెట్లతో ఆహ్లాదం గొలుపుతుంది. ఈ గుట్టను పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు అనుకూలం. మల్లాపూర్‌ మండలంలోని సోమేశ్వరాలయం గోదావరినదీ తీరంలో ఉంటుంది. ఎంతో ప్రశిష్టమైన ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గోదావరి తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక క్షేత్రంగా మార్చే అవకాశాలున్నాయి. రాయికల్‌ మండలంలోని కొత్తపేటలో త్రికూటాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు.

సిరిసిల్లలో..

వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్ఛు పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రుద్రంగి సమీపంలో సహజసిద్ధ నీటి జలపాతాలున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో రాశిగుట్ట ఒక ప్రత్యేకమైంది. గుట్టవద్ద పడే సూర్యకిరణాలు శరీరంపై పడగానే రంగు మారుతుంది. ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉన్న రాశిగుట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా మార్చవచ్ఛు ఇదే మండలంలో సముద్రలింగాపూర్‌ వద్ద జలాశయం ఆకర్షణీయంగా ఉంటుంది.

పనుల ప్రతిపాదనలు పంపించాం

- వెంకటేశ్వర్‌రావు, కరీంనగర్‌ పర్యాటక శాఖ అధికారి

పర్యాటక శాఖ ద్వారా కొన్ని ప్రతిపాదనలు పంపించాం. కొన్ని పనులు సాగుతున్నాయి. బొమ్మలమ్మగుట్ట ప్రాంతంలో మెట్లదారి, రేయిలింగ్‌ పనులు పూర్తయ్యాయి. ఎల్‌ఎండీలో ఒక్క పడవ మాత్రమే నడవడం లేదు. జెట్‌ పడవలు నడుస్తున్నాయి. మానేరు రివర్‌ఫ్రంట్‌ పనులు తీగల వంతెన సమీపంలో నడుస్తున్నాయి. నీటిపారుదల శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నాం.

ఇక్కడ అహ్లాదంగా కనిపిస్తున్నది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల.. గోదావరి పరివాహక ప్రాంతం, ఆధ్యాత్మిక కేంద్రంలో అభివృద్ధికి చేయాలి రెండు పడవలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. రెండు పెద్ద పడవలు, ఒక స్పీడ్‌ బోట్‌ను ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా.. అడుగు కూడా ముందుకు పడలేదు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి సమీపంలో పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. 60 సీట్ల పడవను ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడంతో నది ఒడ్డున ఖాళీగా ఉంటుంది. నదీ తీరంలో హరిత హోటల్‌తో పాటు పిల్లల పార్కు, బోటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా నిధులు కేటాయించలేదు.

ఈ పడవ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయంలోనిది. క్రూయిజర్‌ డబుల్‌డక్కర్‌ పడవను ఏర్పాటు చేసినప్పటికీ విహరించేందుకు ఇంకా అనుమతులు రాలేదు. పడవ విహారం కోసం ప్లాట్‌ఫాం నిర్మించలేదు. సందర్శకులతో నిత్యం సందడిగా ఉండే దిగువ మానేరు జలాశయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి.

ఈ పడవ సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు జలాశయంలోనిది. కేవలం పడవ మాత్రమే తెప్పించారు. విహరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదు. ఎగువ మానేరు ప్రాంతంలో ఆహ్లాదం కోసం ఎలాంటి పనులు చేపట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని