logo

ఔరా.. సౌర!

ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మించిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. రూ.423తో ఎన్టీపీసీ రిజర్వాయర్‌పై 500 ఎకరాల విస్తీర్ణంలో 40 బ్లాక్‌ల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేసి 100 మెగావాట్ల

Published : 02 Jul 2022 04:21 IST

నీటిపై తేలియాడే విద్యుత్తు కేంద్రం ప్రారంభం

100 మెగావాట్ల ఉత్పత్తి షురూ

న్యూస్‌టుడే, జ్యోతినగర్‌

జీఎం అనిల్‌కుమార్‌ను అభినందిస్తున్న సీజీఎం సునీల్‌కుమార్‌

ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మించిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. రూ.423తో ఎన్టీపీసీ రిజర్వాయర్‌పై 500 ఎకరాల విస్తీర్ణంలో 40 బ్లాక్‌ల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేసి 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతున్నారు. 2021 జులైలో 15 మెగావాట్లకు సంబంధించి పనులు పూర్తిచేసి ఉత్పత్తిని మొదటి దశలో ప్రారంభించారు. రెండు, మూడు దశల్లో అక్టోబరు నాటికి 65 మెగావాట్లతో పూర్తి చేయగలిగారు. మిగిలిన 20 మెగావాట్లను జూన్‌ రెండో వారంలో పూర్తి చేయాల్సి ఉండగా, అనుసంధాన ప్రక్రియలో కొంత జాప్యం కావడంతో జులై 1న పూర్తి చేసి 100 మెగావాట్లను అందుబాటులోకి తేగలిగారు. దీంతో కమర్షియల్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 100 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని 40 బ్లాకులుగా నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రతి బ్లాక్‌లో 11,200 సౌర ఫలకాలు అమర్చారు. డ్రైడాక్‌ స్ట్రింగ్‌లను ఏర్పాటు చేసి ఫలకాల బిగింపును పూర్తి చేయగలిగారు. క్రిస్టలిక్‌ సిలికాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటో వోల్టాయిక్‌ ప్యానళ్లను ఉత్పత్తికి వినియోగించారు. సౌర ఫలకాలతోపాటు ఇన్వర్టర్‌ గదులు, ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీ బ్రేకర్లు నీటిపై తేలియాడేలా నిర్మాణానికి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇలాంటి విద్యుత్తు కేంద్రం దేశంలోనే ప్రథమంగా చెప్పవచ్ఛు కాయంకుళంలో 80 మెగావాట్ల ప్రాజెక్టు మాత్రమే ఇటీవల అందుబాటులోకి రాగా, రామగుండం ప్రాజెక్టు అతిపెద్దదిగా చెప్పవచ్ఛు సోలార్‌ మ్యాడ్యూల్స్‌ హెచ్‌డీపీఈ(హై డెన్సిటీ పాలిథిలిన్‌)తో తయారు చేసిన ఫ్లోటర్లపై ఉంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.

గోవాకు విద్యుత్తు..

రామగుండం ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రంలోని 100 మెగావాట్లను గోవా రాష్ట్రానికి కేటాయించారు. పర్యావరణ రక్షణకు దోహదపడుతున్న ఈ విద్యుత్తు కేంద్రంతో 32.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని ఆవిరి కాకుండా నివారించగల్గుతున్నారు. పర్యావరణహిత ప్రాజెక్టుతో ఏడాదికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగాన్ని, ఏటా 2,10,000 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ విడుదలను నివారించగలిగారు.

అధికారుల హర్షం

100 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి రావడంపై రామగుండం ప్రాజెక్టులో హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు సీజీఎం సునీల్‌కుమార్‌ ప్రాజెక్టు జీఎం అనిల్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు. నీటిపై తేలియాడే మరో 80 మెగావాట్ల కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి సౌర విద్యుత్తు కేంద్రం పరిసరాల్లో సిమెంట్‌ రహదారిని కూడా చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని