logo

గ్యాస్‌బండ భారమే

చమురు సంస్థలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను మళ్లి పెంచాయి. నెల గడవటమే తరువాయి మరింత భారం మోపాయి. ఈ ఏడాది మే నెలలో రూ.50.50పైసలు పెంచిన కంపెనీలు ప్రస్తుతం మరో రూ.50 పెంచుతూ ప్రకటనల

Published : 07 Jul 2022 03:03 IST

అందనంత దూరంలో ఎల్‌పీజీ ధరలు

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: చమురు సంస్థలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను మళ్లి పెంచాయి. నెల గడవటమే తరువాయి మరింత భారం మోపాయి. ఈ ఏడాది మే నెలలో రూ.50.50పైసలు పెంచిన కంపెనీలు ప్రస్తుతం మరో రూ.50 పెంచుతూ ప్రకటనల జారీ చేశాయి. ప్రస్తుతం రూ.1074 ధర పలుకుతున్న గ్యాస్‌ సిలిండర్‌ పెరిగిన ధరతో రూ.1124కు చేరుకుంది. అసలే ఉపాధి అవకాశాలు అడుగంటుతూ నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్న తరుణంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడంతో వినియోగదారులకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది. కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సామాన్య ప్రజలకు పులిమీద పుట్రలా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వంటింటి నూనె ధరలను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరగడంతో జిల్లాలో సుమారు 2,89,500 మంది ఎల్‌పీజీ కనెక్షన్‌ దారులకు రూ.1,44,75000  భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మేలో మురిపించారు..
చమురు సంస్థలు గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా గ్యాస్‌ ధరలను పెంచుతూ వస్తున్నాయి తప్పితే తగ్గించడంలేదు. మే  7న రూ.50.50 పెంచిన చమురు సంస్థలు ఇదే నెల 19న రూ.2.50లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వినియోగదారుల్లో కొంత ఆశలు చిగురించాయి. ఇక నుంచి ధరలు తగ్గే అవకాశం ఉందని ఆశించారు. అంతలోనే వారి ఆశలను ఆవిరిచేస్తూ మరోమారు పెంచేశాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

కిరోసిన్‌ వాడకాన్ని దూరం చేశారు
కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్‌ వాడకాన్ని పెంచుతూ కిరోసిన్‌ వాడకాన్ని తగ్గించేసింది. రెండేళ్ల కిందటి వరకు జిల్లాలో 71,529 లీటర్ల కిరోసిన్‌ వంటకోసం వాడుకునేవారు. ఈ కిరోసిన్‌ సరఫరాను ప్రభుత్వం క్రమంగా తొలగించేసింది. పేదలు ఎల్‌పీజీ గ్యాస్‌ వాడాల్సిన పరిస్థితిని కల్పించింది. కిరోసిన్‌ నిలిపివేసిన సమయంలో సిలిండర్‌ ధర రూ.656.50 ఉండేది. ప్రస్తుతం సుమారు రెండింతలు పెరిగింది. నిరుపేదలు గ్యాస్‌ కొనలేక.. కిరోసిన్‌ అందుబాటులో లేక మళ్లీ కట్టెలపొయ్యి ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఉజ్వల పథకం కొందరికే..
ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన పథకం కింద ఎల్‌పీజీ కనెక్షన్‌ పొందిన వారికి రాయితీ రూ.250 బ్యాంకు ఖాతాలో జమచేస్తోంది. జిల్లాలో సుమారు 14,480 మందికి ఈ పథకం కింద కనెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ కనెక్షన్లు పొందిన వారిలో పేదలకన్న రాజకీయ నాయకుల అనుచరులే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం రాయితీతో ఇస్తున్న ఉజ్వల పథకం పక్కదారి పట్టడంతో వారు బహిరంగమార్కెట్‌ ధరకే ఎల్‌పీజీ గ్యాస్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది.


గతంలో మాదిరిగా రాయితీ ఇవ్వాలి
-సంధ్య, గృహిణి

అడ్డగోలుగా గ్యాస్‌ ధర పెంచారు. గతంలో ధర పెంచినా రాయితీ ఇవ్వడంతో పెద్దగా భారం అనిపించేది కాదు. ప్రస్తుతం రాయితీ కొన్ని వర్గాలకే పరిమితం చేయడంతో నష్టపోతున్నాం. రాయితీని పునరుద్ధరించాలి.


ఇబ్బందులు పడుతున్నాం..
- బచ్చు ప్రభాకర్‌, టైలరింగ్‌

గ్యాస్‌ ధర రూ.వెయ్యి దాటడంతో కొనడానికి ఇబ్బంది పడుతున్నాం. ధర తగ్గించాలి. పెద్దమొత్తం వెచ్చించాలంటే ఇబ్బంది అనిపిస్తోంది. అన్ని వస్తువుల ధరలు పెరిగిన స్థాయిలో ఆదాయం పెరగడంలేదు. ఇబ్బందిపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని