logo

మళ్లీ తెరపైకి కొత్త మండలాల ప్రతిపాదన..?

జిల్లాలో గతంలో వినిపించిన పలు కొత్త మండలాల ఏర్పాటు విషయమై జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 2016లో నాలుగు జిల్లాలుగా విడిపోయిన సంగతి

Published : 07 Jul 2022 03:03 IST

ఈనాడు, కరీంనగర్‌: జిల్లాలో గతంలో వినిపించిన పలు కొత్త మండలాల ఏర్పాటు విషయమై జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 2016లో నాలుగు జిల్లాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే.! ఇదే సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి భౌగోళిక స్థితిగతులు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని 16 మండలాలతో కరీంనగర్‌ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలోనూ ఇల్లందకుంట మండలం వావిలాలపల్లిని, వీణవంక మండలం చల్లూర్‌ గ్రామాన్ని కొత్త మండలంగా మారుస్తామనే హామీలు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి  వినిపించాయి. తాజాగా ఇదే విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొన్ని మండలాల తహసీల్దార్లకు గతంలో ఉన్న డిమాండ్ల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఏఏ గ్రామాల పరిధితో నూతన మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేలా సాధ్యాసాధ్యాల  విషయమై సమాచారాన్ని అడిగినట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం ఆయా గ్రామాలతో కూడిన మ్యాప్‌లను రూపొందించాలని కొందరు తహసీల్దార్‌లకు జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఆదేశాలందినట్లు వినికిడి. జిల్లాలో ఈ రెండు గ్రామాలే కాకుండా రామడుగు మండలం గోపాల్‌రావుపేట, గంగాధర మండలం గర్శకుర్తి, మానకొండూర్‌ మండలంలోని పచ్చనూర్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌లు ఆయా గ్రామాలనుంచి గతం నుంచి వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయాన్ని జిల్లాధికారులు బయటకు వెళ్లడించకుండా రహస్యంగా వివరాల్ని సేకరిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు ఏ క్షణాన అడిగినా..ఇక్కడి సమాచారం తెలియజెప్పేలా జిల్లాధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు