logo

రహదారులే బస్టాపులు.. తప్పని తిప్పలు

కరీంనగర్‌ నగరం మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి చెందుతున్నా ఆర్టీసీ ప్రయాణీకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం ప్రధాన బస్సుస్టాండ్‌లో తప్ప నగరంలో ఎక్కడ కూడా ప్రయాణీకులు నిలబడటానికి కనీస నీడ లేని పరిస్థితి నెలకొంది.

Published : 07 Jul 2022 03:03 IST

ఏళ్ల తరబడి నిర్మించని షెల్టర్లు
ఈటీవీ, కరీంనగర్‌, రవాణా విభాగం, న్యూస్‌టుడే

ఒకటో ఠాణా సమీపంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు

రీంనగర్‌ నగరం మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి చెందుతున్నా ఆర్టీసీ ప్రయాణీకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం ప్రధాన బస్సుస్టాండ్‌లో తప్ప నగరంలో ఎక్కడ కూడా ప్రయాణీకులు నిలబడటానికి కనీస నీడ లేని పరిస్థితి నెలకొంది. కరీంనగర్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం సర్కస్‌ గ్రౌండ్‌తో పాటు కొన్నిచోట్ల మాత్రమే బస్సుస్టాపుల నిర్మాణం జరిగింది. రహదారులు  ఇరుకుగా మారడంతో ప్రయాణీకుల కోసం బస్సును ఆపితే  ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రహదారుల విస్తరణ సందర్భంగా ముందుచూపు లేకపోవడం వల్లనే ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.కరీంనగర్‌ నుంచి ఇరుగు పొరుగు ప్రాంతాలకు వెళ్లడానికి వందలాది మంది  ఆయా ప్రాంతాల్లో వేచి ఉంటారు. అలాంటివి సుమారు 16 ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఆయా ప్రాంతాల్లో బస్‌ బేలు నిర్మిస్తే బాగుంటుందని నగరపాలక అధికారులకు విన్నవిస్తున్నారు.  ప్రస్తుతం జగిత్యాలవైపు వెళ్లే మార్గంలో సర్కస్‌ గ్రౌండ్‌, కోర్టు వద్ద తప్ప మరెక్కడా ప్రయాణీకులకు షెల్టర్లు లేవు. వందలాది మంది ప్రయాణీకులు నీడను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.

వేములవాడ,సిరిసిల్ల దారిలో బస్సుల కోసం వేచిచూస్తున్న దృశ్యం


స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్మించాలని కోరాం
ఖుస్రోషాఖాన్‌,రీజినల్‌ మేనేజర్‌ ఆర్టీసీ, కరీంనగర్‌

స్మార్ట్‌సిటీ నిధులతో అనేక అభివృద్ధ్ది కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్‌బేలు నిర్మించాలని మేయర్‌ సునీల్‌రావుకు విజ్ఞప్తి చేశాం.వరంగల్‌ -హైదరాబాద్‌ రహదారిలో కల్పన హోటల్‌తో పాటు అల్గునూరు కూడలిలో మూడువైపులా కమాన్‌చౌరస్తాలో కరీంనగర్‌ వైపు రాంనగర్‌ వద్ద రెండువైపులా గీతాభవన్‌ వద్ద వేములవాడ, కరీంనగర్‌ రెండువైపులా మంచిర్యాల కూడలిలో నాలుగువైపులా కోర్టుకూడలిలో గోదావరిఖని,జోనల్‌ వర్క్‌షాపు వద్ద, జగిత్యాలవైపు నిర్మించాలని కోరాం.  


ప్రజల సౌకర్యానికే ప్రాధాన్యం: సునీల్‌రావు, కరీంనగర్‌ మేయర్‌
స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా బస్‌బేల నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పటికే ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఖుస్రోషాఖాన్‌ స్వయంగా బస్‌బేల నిర్మాణం చేయాలని కోరారు.ఎక్కడెక్కడ నిర్మించాలి.ఏమేరకు నిధులు ఖర్చు చేయాలనే అంశంపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా 32 ప్రాంతాల్లో సిగ్నల్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని