logo

స్వచ్ఛతకు పెద్దపీట

స్వచ్ఛత పాటిస్తూ ఆవరణను ఆహ్లాదంగా మారుస్తున్న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ్‌ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పక్రియ పూర్తవగా, జిల్లాలోని 36 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు 2021-22 సంవత్సరానికి

Published : 07 Jul 2022 03:03 IST

ఎనిమిది  రాష్ట్రస్థాయి, 28 జిల్లా  పురస్కారాలకు ఎంపిక

న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

స్వచ్ఛత పాటిస్తూ ఆవరణను ఆహ్లాదంగా మారుస్తున్న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ్‌ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పక్రియ పూర్తవగా, జిల్లాలోని 36 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు 2021-22 సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయి స్వచ్ఛ విద్యాలయ్‌ పురస్కారాలు లభించగా, వీటిలోని ఎనిమిది రాష్ట్ర స్థాయి పురస్కారాలకు అర్హత సాధించాయి.

ఈ అంశాలే ప్రధానం..
పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్ల పరిస్థితి, సబ్బుతో బాలలు చేతులు కడుక్కోవడం, ఉపయోగం-నిర్వహణ, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, సామర్థ్యాల నిర్మాణం అంశాలను సక్రమంగా అమలు తీరు ఆధారంగా స్వచ్ఛ గ్రేడ్‌లు ఇస్తూ  పురస్కారానికి ఎంపిక చేస్తారు. అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్న బడులతో పాటు ఒక్కో అంశంలో మెరుగైన వాతావరణం కల్పించే పాఠశాలలు కూడా పురస్కారాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాయి. 2018-19 నుంచి 2020-21 వరకు ఈ పురస్కారాలను ప్రభుత్వం అందించలేదు.

జాతీయస్థాయికి అర్హత...
జిల్లాలో ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు 675 ఉండగా, ప్రైవేటు పాఠశాలలు 282 ఉన్నాయి. స్వచ్ఛ విద్యాలయ్‌ పురస్కారాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ కార్యక్రమాల అమలు, ఫొటోల ఆధారంగా విద్యాశాఖ అధికారులు జిల్లా స్థాయి పురస్కారాల కోసం పరిశీలించారు. వచ్చిన మార్కుల ఆధారంగా 36 పాఠశాలలను పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో శ్రీప్రగతి పాఠశాల(రామడుగు), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(నర్సింగపూర్‌, తిమ్మాపూర్‌ మండలం), ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(కొండాపూర్‌, చిగురుమామిడి మండలం), జడ్పీ ఉన్నత పాఠశాల(ఓడ్యారం, గంగాధర్‌ మండలం), ఆదర్శ పాఠశాల(మానకొండూర్‌), శ్రీచైతన్య ఉన్నత పాఠశాల(రామడుగు), ఎక్స్‌ప్లోరికా ప్రాథమికోన్నత పాఠశాల(కరీంనగర్‌), అల్ఫోర్స్‌ ఉన్నత పాఠశాల(కరీంనగర్‌)లు జిల్లాలో అన్ని అంశాల్లో ఉత్తమంగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఇవి జాతీయ స్థాయి పురస్కారానికి అర్హత సాధించే అవకాశం ఉంది.

జిల్లాలో ఇలా...
చిగురుమామిడి మండలంలో ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల కొండాపూర్‌, రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని శ్రీప్రగతి పాఠశాలలు నాలుగు సబ్‌ కేటగిరిల్లో, గంగాధర మండలంలోని ఓడ్యారం జడ్పీ ఉన్నత పాఠశాల, మానకొండూర్‌లోని శాంతినికేతన్‌ ప్రైమరీ స్కూల్‌ రెండు సబ్‌ కేటగిరిల్లో ఎంపికయ్యాయి. చొప్పదండిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం, కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల(తీగలగుట్టపల్లి), ఎక్స్‌ప్లోరికా యూపీఎస్‌, ఆద్విత ఇంటర్నేషనల్‌ స్కూల్‌, కాకతీయ ఉన్నత పాఠశాల, విద్యార్థి యూపీఎస్‌, కేజీబీవీ, కోరా ఉన్నత పాఠశాల, వివేకానంద విద్యానికేతన్‌, విద్యాసంస్కార్‌ మంటెస్సోరి పాఠశాల, కరీంనగర్‌ రూరల్‌ మండలం నుంచి నగునూర్‌, చామనపల్లిలలోని జడ్పీ ఉన్నత పాఠశాలలు, కొత్తపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల చింతకుంట, రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని అల్ఫోర్స్‌ ఉన్నత పాఠశాల, శంకరపట్నం మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కరీంపేట, తిమ్మాపూర్‌ మండలంలోని ఫ్రీడం ఫైటర్‌ పాఠశాలలు ఎంపికయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని