logo

ప్రత్యామ్నాయం.. అదనపు ఆదాయం

వరి, పత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొందరు అరటి, మిర్చి, పసుపు, కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ తదితర పంటలు సాగు చేస్తుండగా,

Published : 07 Jul 2022 03:03 IST

10 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు సన్నద్ధం
రెండు నర్సరీల్లో 6 లక్షల మొక్కల పెంపకం
న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌

చిన్నకల్వల నర్సరీలో పెరుగుతున్న ఆయిల్‌పాం మొక్కలు

వరి, పత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొందరు అరటి, మిర్చి, పసుపు, కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ తదితర పంటలు సాగు చేస్తుండగా, కొత్తగా మరికొందరు రైతులు ఆయిల్‌పాం సాగుకు సన్నద్ధమవుతున్నారు.

మ్మడి జిల్లావ్యాప్తంగా ఆయిల్‌పాం సాగుకు భూములు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ప్రోత్సాహకాలు అందిస్తామంటూ ఉద్యాన శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల్లోని తోటల వద్దకు రైతులను తీసుకెళ్లి పంట సాగు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. దీనికి తగ్గట్లు రైతులకు మొక్కలు ఇచ్చేందుకు సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల, ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో నర్సరీలు ఏర్పాటు చేసి 6 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు.

నాటిన నాలుగేళ్లకు దిగుబడి
నర్సరీలో సంవత్సరం పాటు పెంచిన ఆయిల్‌పాం మొక్కలను ఎకరానికి 50 చొప్పున నాటాల్సి ఉంటుంది. సమ త్రికోణంలో మూడు వైపులా తొమ్మిది మీటర్ల దూరంతో ఒక్కో మొక్క నాటుతారు. బిందు, తుంపర సేద్యం ద్వారా మొక్కలకు నీరు, ఎరువులు, పురుగుల మందు అందిస్తారు. నాటిన మూడేళ్లకు కాత మొదలవుతుంది. ఎకరాకు పది టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏడేళ్ల తర్వాత అది మరింత పెరుగుతుంది. 25 నుంచి 30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు రూ.15 వేలు పలుకుతుంది. పెట్టుబడి ఖర్చులు పోను సంవత్సరానికి ఎకరాకు రూ.లక్ష నికర ఆదాయం వస్తుంది. అంతర పంటలుగా టేకు, శ్రీగంధం, కూరగాయలు, పూలు, అరటి, పప్పు దినుసులు, మిరప సాగు చేసుకొని అదనపు ఆదాయం ఆర్జించవచ్చు.


ఏడు ఎకరాల్లో సిద్ధం చేశాను

గోపిడి ప్రభాకర్‌రెడ్డి, రేగడిమద్దికుంట
ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో క్షేత్ర పర్యటనకు వెళ్లి, ఆయిల్‌పాం సాగుపై అవగాహన పెంచుకున్నాను. పెట్టుబడి, సాగు విధానం, మార్కెటింగ్‌, రాబడి తదితర అంశాలు తెలిశాయి. ఇక్కడి నేలలు పంటకు అనుకూలమని తెలిసింది. నేను ఏడు ఎకరాల్లో సాగుకు సిద్ధం చేశాను. ప్రభుత్వం రాయితీపై బిందు, తుంపరసేద్యం పరికరాలు అందిస్తే బాగుంటుంది.


తక్కువ నీటితో ఎక్కువ రాబడి

జ్యోతి, ఉద్యాన శాఖ అధికారి
జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు వందలాది రైతులు ముందుకు రావడంతో ఇతర జిల్లాలోని పంటల సందర్శనకు తీసుకెళ్లి అవగాహన కల్పించాం. వరి, ఇతర పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం వేసుకోవచ్చు. కూలీల బెడద ఉండదు. దిగుబడి, లాభాలు వరి కంటే అధికంగా ఉంటాయి. చిన్నకల్వల, అడవిశ్రీరాంపూర్‌ నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఎకరా వరికి అందించే నీటితో నాలుగెకరాల్లో ఆయిల్‌పాం పండించవచ్చు. ప్రభుత్వం రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందిస్తోంది. ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి పోను రూ.లక్ష వరకు లాభం ఉంటుంది.  


జిల్లాలో ఇలా..
సాగు లక్ష్యం: 10 వేల ఎకరాలు
గుర్తించిన రైతుల సంఖ్య: 1800
ఎకరాకు నాటాల్సిన మొక్కలు: 50
ఒక మొక్కకు రైతులు చెల్లించాల్సింది (రాయితీ పోను): రూ.30
ప్రభుత్వ ప్రోత్సాహకం: రూ.36 వేలు (మూడు సంవత్సరాలకు)
ఎకరాకు వచ్చే పెట్టుబడి ఖర్చు: రూ.30 వేలు (ఏడాదికి)
గెలల ధర: రూ.15 వేలు (టన్నుకు)
ఏడాదికి ఎకరాకు రాబడి: రూ.2 లక్షలు (అంతర పంటలు సహా)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని