logo

అసలే కొరత.. ఆపై భత్యాల వాత

‘నిధులు మూరెడు.. వ్యయం బారెడు..’ అన్న చందంగా మారింది పంచాయతీల పరిస్థితి.. ఇప్పటికే పారిశుద్ధ్య నిర్వహణ, నెలవారీ జీతభత్యాల చెల్లింపు ఖర్చులు తడిసి మోపెడవుతుండగా, నిర్వహణ వ్యయాలు.. ప్రభుత్వం ‘డిజిటల్‌ కీ’ పేరిట ఖర్చుల చెల్లింపులో మెలికలు పెడుతుండటం మరింత భారంగా మారింది.

Published : 07 Jul 2022 03:03 IST

మండల స్థాయి నిర్వహణ ఖర్చులూ పంచాయతీలపైనే..
డిజిటల్‌ కీ విధానంతో పల్లె సచివాలయాలకు ఆర్థిక కష్టాలు
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పంచాయతీ ట్యాంకరుతో మొక్కలకు నీటిని పడుతున్న సిబ్బంది

‘నిధులు మూరెడు.. వ్యయం బారెడు..’ అన్న చందంగా మారింది పంచాయతీల పరిస్థితి.. ఇప్పటికే పారిశుద్ధ్య నిర్వహణ, నెలవారీ జీతభత్యాల చెల్లింపు ఖర్చులు తడిసి మోపెడవుతుండగా, నిర్వహణ వ్యయాలు.. ప్రభుత్వం ‘డిజిటల్‌ కీ’ పేరిట ఖర్చుల చెల్లింపులో మెలికలు పెడుతుండటం మరింత భారంగా మారింది.

ల్లెల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో పరిశీలనకు మండల పంచాయతీ అధికారి(ఎంపీవో) పర్యటిస్తుంటారు. ఇందులో భాగంగా అవుతున్న వాహన ఖర్చులనూ పంచాయతీల నుంచే వసూలు చేస్తున్నారు. వరుస క్రమంలో అన్ని పంచాయతీలు ఈ ఖర్చులు భరించాల్సి వస్తోందని అధికారులు చెబుతుండటం గమనార్హం. మండల పరిషత్‌ కార్యాలయంలోని కంప్యూటరు ఆపరేటర్ల జీతభత్యాలు సైతం పంచాయతీ ఖాతాల నుంచే చెల్లిస్తుండటంతో ఆర్థిక కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీవో ఉండగా అదే స్థాయిలో గ్రామీణాభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఎంపీవోలకు విధులు అప్పగించడం, వారి నిర్వహణ ఖర్చులూ భరించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ఆదాయ వనరులు లేని తాము పాలనపరమైన ఖర్చులకు ఎక్కడి నుంచి నిధులు తేవాలో తెలియడం లేదని చిన్న పంచాయతీల పాలకవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

నిధుల వ్యయానికీ
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తుల ఖాతాలకు నేరుగా జమ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పెంచేందుకు డిజిటల్‌ కీ  విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని అమలు చేసే పంచాయతీలకే నిధులు కేటాయిస్తామని పేర్కొంది.

పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంఘాల నిధులు, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌, ఉపాధిహామీ, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమ గ్రాంట్లు వస్తాయి. వీటి నుంచి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలకు 30 శాతం, పారిశుద్ధ్యానికి 15 శాతం, వీధి దీపాలు 15 శాతం, తాగునీటికి 15 శాతం, రహదారులు, కాలువలకు 20 శాతం, ఇతర అవసరాలకు 5 శాతం వెచ్చించాల్సి ఉంటుంది.

పంచాయతీలకు విడుదలయ్యే మొత్తం నిధులు, సొంత ఆదాయ వనరులు కలుపుకుని రూ.62.40 కోట్లు, మొత్తం కేటాయించిన హరితనిధి(గ్రీన్‌ బడ్జెట్‌) 10 శాతం చొప్పున రూ.6.2 కోట్లు కలిపి రూ.68.52 కోట్లు ఆర్థిక సంఘం నిధులను జిల్లాలోని స్థానిక సంస్థలకు ఏటా ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇకపై ఈ నిధుల వ్యయాన్నంతటినీ ఉమ్మడి డిజిటల్‌ కీ పవర్‌తోనే నిర్వహించాల్సి ఉంటుంది.

జిల్లాలోని 267 పంచాయతీల్లోని సర్పంచులు, ఉపసర్పంచులకు ఈ నిధులను పంపిణీ చేశారు. గ్రామాల్లో సర్పంచి, ఉపసర్పంచులకు నిధులు డ్రా చేసే అధికారం ఉండగా, మండల పరిషత్తులో ఎంపీడీవో, ఎంపీపీ, జిల్లా పరిషత్తులో జడ్పీ సీఈవో, జడ్పీ ఛైర్మన్లకు వినియోగించే అవకాశం కల్పించింది.


మండల స్థాయి భత్యాలకు రూ.34 వేలు
ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, నీటి ట్యాంకరు, ట్రాలీల నిర్వహణ ఖర్చులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్తు బిల్లులు, బ్యాంకు రుణాల కిస్తీ.. ఇలా నెలనెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన ఖర్చులుంటున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో 267 పంచాయతీలుండగా 2,436 వార్డులున్నాయి. గ్రామీణ ప్రాంత జనాభా 4,88,358. ఎంపీవోలు 13 మంది, కంప్యూటర్‌ ఆపరేటర్లు 40 మంది ఉన్నారు. ఒక్కో కంప్యూటరు ఆపరేటరుకు నెలకు రూ.19 వేలు, ఎంపీవో నెలవారీ వాహన నిర్వహణ ఖర్చులు రూ.15 వేలు కలిపి మొత్తం ప్రతి నెలా రూ.34 వేలను పంచాయతీలు చెల్లించాల్సి వస్తోంది.


పూర్తి స్థాయిలో నిబంధనలు అమలు

చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీల వారీగా నిధులను సక్రమంగా, సకాలంలో వినియోగించేలా సర్పంచులు, ఉపసర్పంచుల వారీగా డిజిటల్‌ కీ లను అందిస్తున్నాం. ఇక పంచాయతీలు వరుస క్రమంలో విడతల వారీగా ఎంపీవో వాహన నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని