logo

టీకాస్త్రం.. సంధిస్తేనే ఆరోగ్యం

జిల్లాలో చిన్నారుల టీకా(వ్యాక్సినేషన్‌) విషయంలో తల్లిదండ్రుల్లో కొంతమేర అలసత్వం కనిపిస్తోంది. సకాలంలో టీకా అందించకపోవడంతో భావి పౌరులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుండటంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం

Published : 07 Jul 2022 03:03 IST

వ్యాక్సినేషన్‌తోనే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపు
రాష్ట్రంలో పలు చోట్ల కంఠసర్పి విస్తరణతో ఆందోళన  
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

జిల్లాలో చిన్నారుల టీకా(వ్యాక్సినేషన్‌) విషయంలో తల్లిదండ్రుల్లో కొంతమేర అలసత్వం కనిపిస్తోంది. సకాలంలో టీకా అందించకపోవడంతో భావి పౌరులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుండటంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది.
కొవిడ్‌ కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రగతిలో కొంత వెనుకబాటు కనిపించింది. బాల్యంలోనే వ్యాధులను నియంత్రించగలిగే రోగ నిరోధక శక్తినిచ్చే టీకాలకు పిల్లలు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో పలు చోట్ల కంఠసర్పి (డిప్తీరియా) వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తమైన రాష్ట్ర వైద్యశాఖ జిల్లా అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటివరకు వ్యాధి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ సాధారణ టీకాలు వేసుకోవడంలో నిర్లిప్తతతో ప్రమాద ఘంటికలు మోగనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో టీకాలు
పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పిల్లలకు విలువైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన ఆసుపత్రులతో పాటు పల్లె, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారు. ఏడాది వయసు పిల్లలకు వేసే డీపీటీ బూస్టర్‌ టీకా కంఠసర్పి సహా పలు రకాల వ్యాధులను నియంత్రిస్తుంది. పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌ ఏడాదిలోపు పిల్లలకు వేస్తున్నారు. కామెర్లు, ధనుర్వాతం, కోరింత దగ్గు, న్యూమోనియా నివారణకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ వేస్తున్నారు. పిల్లలతో పాటు గర్భిణులకు టీడీ(టెటనస్‌ డిప్తీరియా) అందుబాటులో ఉంది. టీకాలు వేసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రాణాంతక వ్యాధులకు అడ్డుకట్ట
పిల్లలు, గర్భిణుల్లో టీకా లక్ష్యాలు చేరుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి సహకారంతో ప్రగతి సాధిస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు బాధితుల వద్దకు వెళ్లి టీకాల ప్రయోజనాలు వివరిస్తున్నారు.
జూన్‌లో జిల్లాలో టీకా ప్రగతి పరిశీలిస్తే 3,569 మంది గర్భిణులకు గాను 3425 మందికి టీకా వేశారు. పెంటా వాలెంట్‌ మొదటి డోసును 3,252 మందికి గాను 3,253 మంది పిల్లలు వేసుకోవడంతో వంద శాతం దాటి నమోదైంది. మీసల్స్‌ రుబిల్లాను 3,222 మంది పిల్లలకు గాను 3,288 మంది తీసుకున్నారు.
సాధారణ టీకాలు వేసుకోని పిల్లల్లో అంటువ్యాధులు, ఇతర వ్యాధి లక్షణాలు వెలుగుచూసే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వసతి కల్పించినప్పటికీ కొందరు వినియోగించుకోవడం లేదు. వైద్య సిబ్బంది అవగాహన కల్పించినప్పటికీ ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు.


నిర్లక్ష్యం చేయొద్దు
డా.ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో చిన్నారులు, గర్భిణులకు టీకా పంపిణీలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వీడాలి. వివిధ రకాల టీకాలను ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తోంది. ముందస్తు టీకాలు పలు వ్యాధులకు రక్షణ కవచంగా ఉంటాయి. వ్యాక్సినేషన్‌ లక్ష్యాలపై సిబ్బందితో సమీక్షిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని