logo

చుట్టూ మురుగు... ప్రజలకు కంపు

ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం ఇప్పటిలో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా విడుదల కావడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు.

Published : 07 Jul 2022 03:03 IST

ప్రతిపాదనల్లోనే భూగర్భ డ్రైనేజీ  నిర్మాణం
న్యూస్‌టుడే, వేములవాడ

గుడి చెరువులోకి వెళ్తున్న మురుగు

ధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం ఇప్పటిలో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా విడుదల కావడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు పట్టణంలోని మురుగంతా శివారు ప్రాంతాలకు చేరి నిల్వ ఉండటంతో దుర్వాసన వచ్చి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

పట్టణంలోని మురుగును భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా పట్టణ శివారు ప్రాంతాలకు తరలించేందుకు రూ. 33 కోట్ల అంచనాలతో వేములవాడ పురపాలక సంఘం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వీటిని ప్రభుత్వానికి పంపి ఏళ్లు గడుస్తున్నప్పటికీ నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. పట్టణంలో దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవు కాలువల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదలలో జాప్యం జరుగుతుంది. ఫలితంగా పట్టణంలోని మురుగు పట్టణం చుట్టూ శివారు ప్రాంతాలకు వెళ్లి అక్కడ నిల్వ ఉంటుంది. దుర్గంధం రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగంతా ఓ వైపు న్యూ అర్బన్‌కాలనీ ప్రాంతంలోని మురుగు, మరో వైపు వీఐపీ రోడ్డులోనిది పెద్ద ఎత్తున గుడి చెరువులోకి వెళుతుంది. దీంతో గుడి చెరువులోని జలాలు కలుషితమవుతున్నాయి. మరోవైపు రెండు బైపాస్‌ రోడ్ల వెంబడి మూలవాగులోకి చేరి అక్కడి నుంచి వర్షాకాలంలో వాగు ప్రవహించి మధ్యమానేరు జలాశయంలో కలుస్తుంది. కాలువల్లో పెద్ద ఎత్తున ప్రవహించే మురుగుతో సమీప ఇళ్ల ప్రజలు దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బైపాస్‌ రోడ్డు నుంచి వెళ్లి మూలవాగులో పేరుకుపోయిన మురుగు

రెండు వైపులా ఏర్పాటుకు
పట్టణంలో రెండు వైపులా భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. కట్టుకాలువ నుంచి న్యూ అర్బన్‌ కాలనీ, ఇరిగేషన్‌ కెనాల్‌, చెక్కపల్లి రోడ్డు, భగవంతరావునగర్‌, గుడి చెరువు, భీమన్నగుడి నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా రాఘవేంద్ర హోటల్‌, మున్నూరు కాపు సత్రం నుంచి సంకెపల్లి వరకు ఒక వైపు భూగర్భ మురుగు కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. మరోవైపు మల్లారం రోడ్డు నుంచి రెండో బైపాస్‌ రహదారి మీదుగా మున్నూరు కాపు సత్రం వరకు భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ రెండింటి ద్వారా వెళ్లే మురుగును సంకెపల్లి వద్ద శుద్ధి చేసేందుకు మురుగు శద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. అక్కడ శుద్ధి అయిన నీరు బయటకు వెళ్లి మూలవాగులో కలిసే విధంగా కార్యాచరణ రూపొందించినప్పటికి నిధుల కొరతతో కార్యరూపం దాల్చడం లేదు. మురుగును శుద్ధి చేసిన తరవాత వచ్చే వ్యర్థాలతో ఎరువు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధులు విడుదల కాక వీటికి మోక్షం లభించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


అంచనాలు పంపించాం
- మాధవి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వేములవాడ

పట్టణంలో భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి రూ. 33 కోట్లతో అంచనాలు పంపించాం. నిధుల మంజూరు విషయం ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాం. నిధులు వస్తే పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని