logo

అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి

వస్త్రోత్పత్తి రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొచ్చినపుడే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ పేర్కొన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు

Published : 07 Jul 2022 03:03 IST

చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌

సిరిసిల్లలో బతుకమ్మ చీరల డిజైన్లను కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు వివరిస్తున్న ఆసామి రామచంద్రం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: వస్త్రోత్పత్తి రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొచ్చినపుడే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ పేర్కొన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి సిరిసిల్లకు వచ్చారు. సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. మరమగ్గాల వస్త్రోత్పత్తి అంటేనే సిరిసిల్లగా గుర్తింపు ఉందని, ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారి జీవనస్థితిగతులను మెరుగుపర్చుకోవాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని చెప్పారు. తొలుత సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ చీరలు, ఏకరూప దుస్తుల ఉత్పత్తి తీరును పరిశీలించారు. వాటి డిజైన్లు, అందులో వాడే నూలు రకాలను వస్త్రోత్పత్తిదారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో నూలు నుంచి వస్త్రం ఉత్పత్తి అయ్యే వరకు వివిధ దశలను పరిశీలించారు. అందులో పని చేస్తున్న వార్పిన్‌, వైపని, డైయింగ్‌, ప్రాసెసింగ్‌, కార్మికుల పని తీరు, వేతనాలు తదితరాలను చేనేత, జౌళిశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆర్డర్లను నిర్ణీత సమయంలోగా ఉత్పత్తి చేసి అప్పగించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు.

పెద్దూరులోని అపారెల్‌ పార్కులో ఉత్పత్తులను కమిషనర్‌కు చూపుతున్న కంపెనీ సిబ్బంది

తర్వాత పెద్దూరులోని అపారెల్‌ పార్కులో గ్రీన్‌పిన్‌ కంపెనీని సందర్శించారు. అక్కడ తయారు చేస్తున్న ఉత్పత్తులను చూశారు. కంపెనీలో ప్రస్తుతం యాభైశాతం యంత్రాలతో మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని, పరిశ్రమకు సంబంధించి వివిధ దశల్లో గుర్తింపులు వచ్చాక త్వరలోనే వందశాతం ఉత్పత్తులు ప్రారంభిస్తామని నిర్వాహకులు కమిషనర్‌కు వివరించారు. అందులో పని చేస్తున్న మహిళలతో మాట్లాడి ఉపాధి పొందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దాని పక్కనే ఉన్న గ్రూప్‌ వర్క్‌షెడ్‌ను సందర్శించారు. కార్మికుల శిక్షణ కోసం తీసుకొచ్చిన యంత్రాల పని తీరు, వాటి ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలను కంపెనీ సాంకేతిక నిపుణులు వివరించారు. లబ్ధిదారుల ఎంపిక, కార్మికుల శిక్షణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్క్‌షెడ్‌ల నిర్మాణ ప్రగతిపై ఆరా తీశారు. అక్కడి నుంచి తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్కుకు వెళ్లి అందులోని యజమానులతో సమావేశమయ్యారు. వస్త్రోత్పత్తులతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కులో పరిశ్రమలు నడపలేక మూసివేసిన వారికి ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ క్లియరెన్స్‌ ఇప్పించాలని కోరారు. నిబంధనల ప్రకారం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, చేనేత, జౌళిశాఖ అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని