logo

ఫలితాల్లో మెరుగు... వసతులు కరవు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ సరస్వతీ నిలయంలో కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయి. శిథిలావస్థలో ఉన్న

Published : 07 Jul 2022 03:03 IST

నిరుపయోగంగా మూత్రశాలలు

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ సరస్వతీ నిలయంలో కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయి. శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్డులోనే తరగతులను నెట్టుకొస్తున్నారు. మూత్రశాలలు సైతం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మారుమూల ప్రాంత విద్యార్థులకు పెద్దదిక్కుగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం 300లకు పైగా విద్యార్థులతో కళకళలాడుతున్న కళాశాలలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడంలేదు.

కావాల్సిన వసతులు ఇవీ...
జూనియర్‌ కళాశాలలో తరగతుల నిర్వహణ, ప్రయోగశాలలు, గ్రంథాలయం, బాలికలు నిరీక్షణ తదితర అవసరాలకు మరో 15 గదులను నిర్మించాల్సి ఉంది. అన్ని వసతులతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేయాల్సి ఉండగా కళాశాలపై శీతకన్ను వేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేకులషెడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. ప్రస్తుతం ఉన్న మూత్రశాలలకు నీటిని సరఫరా చేసి, వాటిని అందుబాటులోకి తీసుకువచ్చి, తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

శిథిలమైన తలుపులు

గదుల్లో చేరుతున్న వర్షపు నీరు
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను 1999లో ఏర్పాటు చేశారు. బీపీసీ, ఎంపీసీ, సీఈసీ కోర్సులను తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో 179 మంది విద్యార్థులు ఉండగా ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. గత విద్యాసంవత్సరం ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు బి. అజయ్‌కుమార్‌ 400(బీపీసీ), జె. అఖిల 454(సీఈసీ), సీహెచ్‌. శ్రీలత 420(సీఈసీ) మార్కులు సాధించి శెభాష్‌ అనిపించుకున్నారు. ఆరు గదులున్న రెండు శాశ్వత భవనాల్లోని ఒక గదిలో కార్యాలయం, స్టాఫ్‌రూం, రసాయనశాస్త్ర ప్రయోగశాల ఉండగా మిగిలిన మూడింటిని తరగతులకు వినియోగిస్తున్నారు. ఏళ్ల కింద నిర్మించిన రేకులషెడ్డులోని రెండు గదులను ప్రయోగశాలలకు, రెండు గదులను తరగతులకు కేటాయించారు. ప్రస్తుతం రేకులషెడ్డు శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు రేకులు, తలుపులు, కిటికీలు ధ్వంసమవగా గదుల్లోకి వర్షపునీరు చేరుతోంది. స్వల్ప వర్షాలకు గదులు ఉరుస్తున్నాయి. రేకులకు రంధ్రాలు పడటంతో వానరాలు లోనికి ప్రవేశిస్తున్నాయి. గతంలో నిర్మించిన మూత్రశాలలకు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. మరోచోట ఉన్న మూత్రశాలలకు కూడా నీటిసరఫరా లేకపోవడంతో బాలికలు ఇబ్బంది పడుతుండగా బాలురు ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణాలు బేసిమెంటు స్థాయికే పరిమితమయ్యాయి.


సమస్యల నడుమ చదువు
-వైష్ణవి, సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే సమస్యల నడుమ చదువును కొనసాగించాల్సి వస్తోంది. సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆ ప్రభావం చదువుపై పడుతోంది. రేకులషెడ్డును వెంటనే మరమ్మతు చేయించాలి. ముఖ్యంగా మూత్రశాలలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉన్న వాటికి నీటి వసతి ఏర్పాటు చేయాలి.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
- సీహెచ్‌.మోహన్‌, డీఐఈఓ

ప్రతి సంవత్సరం కళాశాలలో 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. కోతుల స్వైరవిహారంతో పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. వీటిని వెంటనే మరమ్మతు చేయించాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే మారుమూల ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని