logo

Telangana News : కరీంనగర్‌లో జల విలయం

ఇళ్లల్లోకి వస్తున్న వరద...  కూలుతున్న ఇళ్లను చూసి బాధితులకు కన్నీళ్లొస్తున్నాయి. రోడ్లపైన ప్రవహిస్తున్న జలధారలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి.  కూలుతున్న కల్వర్టులు తెగుతున్న రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముసురేసిన

Updated : 14 Jul 2022 08:01 IST

ప్రధానదారుల్లో నడుము లోతు నీళ్ల ప్రవాహం

ఈనాడు, కరీంనగర్‌

ఇళ్లల్లోకి వస్తున్న వరద...  కూలుతున్న ఇళ్లను చూసి బాధితులకు కన్నీళ్లొస్తున్నాయి. రోడ్లపైన ప్రవహిస్తున్న జలధారలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి.  కూలుతున్న కల్వర్టులు తెగుతున్న రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముసురేసిన వానలకు తడిసిన నివాస గృహాలు నేలవాలుతున్నాయి. లోతట్టు వారధులు జలమయమై ఊళ్ల మధ్య రాకపోకల్ని నిలువరిస్తున్నాయి. సాగుకు సన్నద్ధమైన పంటపొలాలు చెరువులుగా దర్శనమిస్తున్నాయి.  ముసురు తాకిడికి విద్యుత్తు సరఫరా లోపాలు ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి...నాలుగు రోజులుగా నగరం తడిసిముద్దయింది.. ఎటు చూసినా నీళ్లు కలవర పెడుతున్నాయి.

జిల్లాలోని పలు ప్రధాన రహదారులను ముంచెత్తింది. కరీంనగర్‌లోని జగిత్యాల రోడ్డు మార్గంలో ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఎదుట మోకాళ్ల మట్టు నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. రేకుర్తి- శాతావాహన విశ్వవిద్యాలయం మీదుగా బస్టాండ్‌కు దారి మళ్లించారు. కిందకు ప్రవహిస్తున్న నీళ్లతో సమీపంలోని కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఆయా డివిజన్లలోని అంతర్గత దారులు జలమయమయ్యాయి. గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. అనుసంధానంగా ఉన్న రోడ్లమధ్యన దిగువస్థాయి వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తుండంటతో రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మికుంట మండల విలాసాగర్‌- తనుగుల మధ్య ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద వాననీరు చేరడంతో ఇరువైపులా రాకపోకలకు అసౌకర్యం ఏర్పడింది. చొప్పదండి మండలంలోని పంది వాగు ఉవ్వెత్తున పారుతుండటంతో రాగంపేట- ఆర్నకొండ గ్రామాల మధ్య, వెలిచాల-కొత్తపల్లి మధ్యలోని వాగు నీటి తాకిడికి రవాణా వ్యవస్థ ఆగిపోయింది. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి వాగు ప్రవాహంతో వాహనదారులంతా వెంకటాయపల్లి మీదుగా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. కరీంనగర్‌- జమ్మికుంట మార్గంలోని నర్సింగాపూర్‌ వద్ద రోడ్డుపైనుంచి నీరు పారుతుండటంతో వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. గన్నేరువరం ఠాణాలోపల నీళ్లు నిలిచాయి. శంకరపట్నంతోపాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో వందకుపైగా ఎకరాల్లో పత్తి పంట నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కూలుతుండటంతో అవస్థలు..
చొప్పదండి మండలంలో బుధవారం ఒక్క రోజే 20కిపైగా ఇళ్లు కూలిపోయాయి. జిల్లావ్యాప్తంగా మరో 30 నుంచి 50 వరకు దెబ్బతిన్నాయి. గడిచిన నాలుగు రోజులుగా 200కుపైగా ఇళ్లకు ముప్పు వాటిల్లింది. ఆయా మార్గాల్లోని వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో పైపులు నీటిపాలయ్యాయి. 50 లోతట్టు వంతెనలు వరదలోనే ఉన్నాయి. జిల్లాలోని వరద కాలువలతోపాటు గ్రావిటీ కాలువలు, కాకతీయ కాలువల్లో జలకళ ఉట్టిపడుతోంది. చిన్ననీటి వనరులైన చెరువులు కుంటలు నిండటంతో వాటి చెంతన ఉన్న కట్టలకు ముప్పు వాటిల్లే వీలుంది. ఇప్పటికే నీటి తాకిడికి కొన్ని చోట్ల గండి పడేలా పరిస్థితులు మారాయి. కొన్నిచోట్ల సమీపంలో పడిన బుంగలను గ్రామస్థులు పూడ్చే ప్రయత్నాల్ని చేశారు.

గంగాధర మండలం ఇస్లాంపూర్‌ మార్గంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఆయా గ్రామాల్లోని శ్మశానవాటికలతోపాటు క్రీడాప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు వాననీటిలో చిక్కుకుపోయాయి. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్ని మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు సందర్శించి ప్రజలకు భరోసానిచ్చారు. యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఆందోళన చెందవద్దని మనోధైర్యం నింపారు.

నగరంలో..
కార్పొరేషన్‌ : కరీంనగర్‌ నగర పరిధిలో  అలకాపురి ప్రాంతంలో మురుగునీటి కాల్వలు పూర్తికాకపోవడంతో నీరంతా ఇళ్ల మధ్యన నిలిచి రాకపోకలు సాగించకుండా తయారైంది.  బాలాజీనగర్‌ మీదుగా వస్తున్న ప్రవాహంతో సూర్యనగర్‌ ప్రాంతంలో చేరుతుండటంతో సమీపంలో ఉన్న దుకాణాలు, షోరూంలలో నీరు చేరింది. బుధవారం సాయంత్రం నుంచి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు దారి మళ్లించారు.

పద్మనగర్‌, రాంనగర్‌, కిసాన్‌నగర్‌ ప్రాంతంలోని ప్రవిష్ట దగ్గర ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో రహదారులు, ఇళ్లు జలమయమయ్యాయి. హుస్సేనీపురలో మురుగునీటి కాల్వలు నిండి రోడ్లపైకి వరద చేరుతోంది. పీటీసీ పక్కన ఉన్న ఖాళీ స్థలాలు నిండి శ్రీహరినగర్‌ రోడ్డు నెంబర్‌ 9లోకి వరదనీరు చేరుతోంది. తీగలగుట్టపల్లిలో ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా కాల్వ నిర్మించగా గత వర్షాలకు అది కూలింది. వరదనీరంతా ఇళ్లలోకి వస్తుందని ఆ ప్రాంతవాసులు చెప్పారు.

చెరువు కట్టకు గండి కొట్టిన అధికారులు
గంగాధర : గంగాధర, నారాయణపూర్‌ జలాశయాలకు ఎగువ ప్రాంతం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఆయా గ్రామాల నుంచి వర్షాలకు వరదనీటి ప్రవాహం ఉద్ధృతం కావడంతో దిగువ గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంగాధర, నారాయణపూర్‌ చెరువులు పూర్తిగా నిండి మత్తడి పడుతుండగా చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండటంతో ఎస్సీ కాలనీ, ఇస్తారుపల్లి గ్రామాల్లోని ప్రజలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచన మేరకు తహసీల్దారు శ్రీనివాస్‌, ఎస్సై రాజు, సర్పంచి నజీర్‌, సాగునీటి పారుదల శాఖ అధికారులు వాహనాల ద్వారా బుధవారం రాత్రి గంగాధరలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. లక్ష్మీదేవిపల్లి పోచమ్మ వాడలోని పలు కుటుంబాలను ఖాళీ చేయించి అక్కడి ఓ పాఠశాలలో వసతి కల్పించారు. దిగువన ఉన్న రామడుగు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అంతకుముందే మత్తడి వద్ద మట్టి తెగిపోయి లక్ష్మీదేవిపల్లి వంతెనపై నుంచి నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లలోకి ప్రజలు వెళ్లిపోయారు. నారాయణపూర్‌ చెరువు మత్తడి, మైసమ్మ గుడి మధ్యలోని కట్టకు జేసీబీ యంత్రంతో అధికారులు గండి కొట్టారు. చెరువులోని నీరు గంగాధరలోని కల్లు మండువా వద్ద నూతనంగా నిర్మాణం చేసిన హైలెవల్‌ వంతెన కింద నుంచి ప్రవహిస్తోంది. పక్కనే తాత్కాలిక మట్టిరోడ్డు కొట్టుకుపోగా ఆయా గ్రామాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.


ఆందోళన వద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది
మంత్రి గంగుల కమలాకర్‌

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం కిసాన్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాన్ని నగర మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వెంటనే వీరిని పునరావస కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. అనంతరం బైపాసు రోడ్డు మీదుగా కృష్ణానగర్‌, మధురానగర్‌, కోతిరాంపూర్‌లో వరదనీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరీంనగర్‌లోనే ఉండి వరద పరిస్థితులు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు నిండి మత్తడి దూకుతున్నాయని, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో అధికారులు ఉండి సమాచారం అందిస్తున్నారని, పురాతన ఇళ్లు కూలిపోతున్నాయని, వారికి పునరావసం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇళ్లు కూలిపోయి వారు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అన్ని మండలాల్లో చాలా చోట్ల పంట నీట మునిగిందని, వరద తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని వివరించారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని, మేయర్‌, కమిషనర్‌ పరిశీలిస్తూ వరదనీటిని సిబ్బంది తొలగిస్తున్నారని తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts