logo

Huzurabad : సవాళ్ల పోరు.. విమర్శల జోరు

హుజూరాబాద్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తెరాసతోపాటు భాజపా శ్రేణులు నువ్వా-నేనా అనేలా ఇక్కడి నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. దాదాపు పది నెలల కిందట జరిగిన ఉప ఎన్నికలతో ఇక్కడి హోరాహోరీ

Updated : 05 Aug 2022 08:33 IST

హుజూరాబాద్‌లో తెరాస, భాజపా ఘర్షణ

నేటి బహిరంగ చర్చపై ఉత్కంఠ

ఈనాడు, కరీంనగర్‌

తెరాస, భాజపా కార్యకర్తల ఘర్షణను నివారిస్తున్న పోలీసులు

హుజూరాబాద్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తెరాసతోపాటు భాజపా శ్రేణులు నువ్వా-నేనా అనేలా ఇక్కడి నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. దాదాపు పది నెలల కిందట జరిగిన ఉప ఎన్నికలతో ఇక్కడి హోరాహోరీ తీరు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించడంతో అధికార తెరాస కూడా తమ పార్టీ ప్రాబల్యాన్ని నిలుపుకొనేలా పలు కార్యక్రమాలతో ఇన్నాళ్లుగా జోరుని చూపిస్తోంది. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి తెరాసకు మారి ఎమ్మెల్సీ పదవిని అందుకున్న పాడి కౌశిక్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఈట రాజేందర్‌ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తూ తన మార్క్‌ను వేసుకుంటున్నారు. గడిచిన వారం రోజులుగా ఇటు తెరాస, అటు భాజపా నియోజకవర్గ అభివృద్ధి విషయమై సవాళ్ల జోరుని చూపిస్తున్నాయి. తెరాస అందిస్తున్న ప్రగతియే నియోజకవర్గంలో కనిపిస్తుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొంటూనే.. తనతో నియోజకవర్గ అభివృద్ధి విషయమై బహిరంగ చర్చకు ఈటల రావాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు ప్రతిగా స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. హుజూరాబాద్‌లో కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా తానే చేసిందని.. తన రాజీనామా వల్లనే ప్రగతి ఫలాలు అందాయనేలా తన వాణిని వినిపించారు. ప్రజలకే తాను జవాబుదారినని విలువలు లేని నాయకులను పట్టించుకోనని తనదైన తరహాలో ప్రత్యర్థి నేత సవాలుని తిప్పికొట్టారు.

పోటాపోటీగా ఫ్లెక్సీలు..

మొదట తెరాస ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చర్చకు తాను సిద్ధమేనని తేదీని ఖరారు చేస్తూ.. ఎమ్మెల్యేను చర్చకు రావాలనేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్దకు 5వ తేదీన(నేడు) ఉదయం 10 గంటలకు సమయానికి రావడానికి తెరాస శ్రేణులంతా సిద్ధమేనని అందులో పేర్కొనడంతో ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. దీనికి స్పందించిన భాజపా నాయకులు కూడా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వైఖరిని తెలియజెప్పేలా పెద్ద ఫ్లెక్సీని పట్టణంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై చర్చకు భాజపా సిద్ధమని తమ నేత ఈటల రాజేందర్‌తో చర్చకు కూర్చునే అనుభవం ప్రత్యర్థులకు లేదనేలా ఫ్లెక్సీలో ఎదుటి పార్టీ నేతల వైఖరిని ఖండించేలా వ్యాఖ్యల్ని రాశారు. గురువారం సాయంత్రం పట్టణంలో కూడలి వద్ద ఇరుపార్టీల నాయకులు పార్టీ తోరణాల్ని కట్టే సమయంలో మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు తెరాస- భాజపా శ్రేణుల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సీఐకి స్వల్ప గాయాలయయ్యాయి. నేటి ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చ విషయమై ఉద్రిక్తత వాతావరణం ఉండటంతో పోలీసులు తమదైన భద్రతా పరమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందుగానే ఇరుపార్టీల నేతల్ని గృహనిర్బంధం చేసేలా ప్రయత్నిస్తున్నారు. నేడు ఎం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. మరోవైపు ఈ నియోజకవర్గంలోని తెరాస నేతలైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఇటీవల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ల మధ్య ఉన్న దూరం మరోసారి వారి మాటలతో బహిర్గతమైంది. శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తనకు నేటి బహిరంగ చర్చ గురించి తెలవదని.. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వెళ్తానని చెప్పడం గమనార్హం.! మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెరాస తరపున తనకే టికెట్‌ వస్తుందనే ఆశాభావాన్ని బాహాటంగా వెళ్లడించగా.. రెండు మూడురోజుల కిందట పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తాననడం.. పార్టీలో ఇప్పుడే వీరిద్దరి మధ్య టికెట్‌ విషయమై జరుగుతున్న పోటీ మరో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని