logo

బొగ్గు ఉత్పత్తికి వరుణుడి దెబ్బ

జులైలో వర్ష ప్రభావంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి భారీగా విఘాతం కలిగింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో సుమారు 20 రోజుల వరకు ఉపరితల గనుల్లో బొగ్గు వెలికి తీయలేని పరిస్థితి.

Published : 06 Aug 2022 06:14 IST

జులైలో 69 శాతంతోనే సరి
1.5 మిలియన్‌ టన్నులకు విఘాతం
న్యూస్‌టుడే, గోదావరిఖని


బొగ్గు నింపుతున్న షావల్‌ యంత్రం

జులైలో వర్ష ప్రభావంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి భారీగా విఘాతం కలిగింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో సుమారు 20 రోజుల వరకు ఉపరితల గనుల్లో బొగ్గు వెలికి తీయలేని పరిస్థితి. సింగరేణి ఈ ఏడాది 74 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది.. దీంతో ప్రతి నెలా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ వార్షిక ఉత్పత్తిని చేరుకోవాలని భావించింది. జూన్‌ వరకు 99 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి జులైలో కురిసిన భారీ వర్షాలతో 92 శాతానికి చేరుకుంది. ఆ నెలలో కేవలం 69 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసింది. 4.7 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 3.2 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది.. సగటున రోజుకు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో బొగ్గు ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. క్వారీలన్నీ జలమయం కావడంతో మోటార్ల ద్వారా నీటిని తోడేందుకే సమయం పట్టింది. సింగరేణి మొత్తంలో అత్యధికంగా కొత్తగూడెంలో 99 శాతం బొగ్గు ఉత్పత్తి చేయగా, అతి తక్కువగా మందమర్రి ప్రాంతం 43 శాతం మాత్రమే చేయగలిగారు.. శ్రీరాంపూర్‌ 85, ఆర్జీ-1 80 శాతం బొగ్గు ఉత్పత్తి మినహా మిగతా డివిజన్‌లలో అతి తక్కువగా లక్ష్యం చేరుకున్నారు. నాలుగు నెలల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రకారం 21.95 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీయాల్సి ఉండగా 20.20 మిలియన్‌ టన్నులు మాత్రమే సాధ్యమైంది..

పుంజుకుంటేనే..
సింగరేణి సంస్థ ఈ ఏడాది సాధించాల్సిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి పుంజుకునే దిశగా చర్యలు చేపడితేనే వార్షిక బొగ్గు ఉత్పత్తిని చేరుకునే అవకాశం ఉంది. గతేడాది వార్షిక బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్‌ టన్నుల లక్ష్యంగా నిర్దేశించారు. కానీ, 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ సారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఏ నెలకానెల లక్ష్యాలను చేరుకునే దిశగా చర్యలు చేపట్టింది. బొగ్గు డిమాండ్‌ కూడా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులకు సాధ్యమైనంత మేర ఎక్కువ మొత్తంలో సరఫరా చేసేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది. వినియోగదారుల నుంచీ బొగ్గు రవాణాకు ఒత్తిడి పెరగడంతో వర్షాలు కురుస్తున్న సయమంలోనూ నిల్వ బొగ్గును సరఫరా చేశారు. ఒక దశలో నిల్వ బొగ్గు కూడా ఖాళీ కావడంతో ఉత్పత్తి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని