logo

కొరవడిన నిఘా

పంటల్లో చీడపీడల నిరోధానికివాడే సస్యరక్షణ మందుల అమ్మకాలపై నిఘాకొరవడి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. ఉత్పాదకాలను ఇష్టారీతిన అమ్మటంతో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.

Published : 06 Aug 2022 06:27 IST

ఇష్టారాజ్యంగా పురుగు మందుల అమ్మకం  
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం


దుకాణంలో సస్యరక్షణ మందులు

పంటల్లో చీడపీడల నిరోధానికివాడే సస్యరక్షణ మందుల అమ్మకాలపై నిఘాకొరవడి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. ఉత్పాదకాలను ఇష్టారీతిన అమ్మటంతో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు సాధారణ పరిస్థితుల్లో ఒక సీజన్‌లో 4.42 లక్షల ఎకరాల్లో ఆహార, ఉద్యాన పంటలను సాగుచేస్తారు. దిగుబడుల సాధనకు ఇటీవల ప్రతి పంటలోనూ రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ, పోషకాల వాడకం తప్పనిసరిగా మారింది. పత్తిలో హెక్టారుకు 3.6 లీటర్ల నుంచి 5-8 లీటర్ల వరకు పురుగు మందులను వాడుతున్నారు. వరిలో హెక్టారుకు 3.2 లీటర్ల క్రిమిసంహారక మందులు, 10 కిలోల గుళికలను వేస్తుండగా మొక్కజొన్నలో 7.0 కిలోల గుళికలు, మామిడిలో 15 లీటర్ల మందు, మిగిలిన పంటల్లోనూ 1.5-3.5 లీటర్ల మందును రైతులు వాడుతున్నారు.

నష్టం ఇలా..
పలుచోట్ల వ్యవసాయశాఖ లైసెన్స్‌ లేనివారు, శిక్షణ పొందనివారు, కిరాణాలు, గ్రామాల్లో తిరిగే కంపెనీల ప్రతినిధులు రైతులకు పంట ఉత్పాదకాలను విక్రయిస్తున్నారు. గంట గుళికలు, పసలేని పోషకాలు, బయోలు, సేంద్రియ ఎరువులను అంటగడుతున్నారు. చాలామంది రైతులు తమ పంట నమూనాలను దుకాణాలకు తీసుకువచ్చి సస్యరక్షణ మందులను కొని తీసుకెళ్లి వాడుతున్నారు. ఇదే సమయంలో అనుభవంలేని కొందరు దుకాణాదారులు పురుగుమందు, తెగుళ్లమందు, పోషకాన్నిఇచ్చి ఒకేసారి పంటపై వాడాలని రైతులకు సూచిస్తున్నారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగటం, మొక్కల్లో మందుల అవశేషాలు పెరిగి ఆరోగ్యాలకు నష్టంచేస్తోంది. సరైన మందు ఇవ్వనపుడు చీడపీడలు, కలుపు నివారణ జరగక మరోసారి మందులను మార్చి పిచికారి చేయాల్సి వస్తోంది. మందుల తీవ్రతను తెలపకపోవటం, మందులను చల్లుతున్నపుడు జాగ్రత్తలను చెప్పక పోవటంతో రైతులు మృత్యువాత పడుతున్న సంఘటనలూ జరుగుతున్నాయి.

అర్హులకు అవకాశం..
పంట ఉత్పాదకాలను విక్రయించేచోట నిపుణులైనవారు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు అనవసర మందుల వాడకం తగ్గి ఆర్థికంగా కలిసివస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలువురు దుకాణాలు నిర్వహిస్తున్నవారు వ్యవసాయ వర్సిటీ కోర్సును పూర్తిచేసి సర్టిఫికెట్‌ పొందారు. ఏజీబీఎస్సీ, రసాయనశాస్త్ర డిగ్రీ లేదా వ్యవసాయ వర్సిటీ డిప్లొమా పూర్తిచేసినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్టిఫికెట్లు లేనివారి దుకాణాల్లో పురుగు మందులను విక్రయించకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి. కేవీకేలు, వ్యవసాయశాఖ సమేతి, హైదరాబాద్‌లోని మేనేజ్‌సంస్థ ద్వారానూ పురుగుమందుల అమ్మకాలపై సర్టిఫికెట్‌ కోర్సును నేర్చుకోవచ్చు. ఈ నిబంధనలతో పాటుగా అధికారులు చీటీ రాసిస్తేనే దుకాణదారులు రైతులకు మందులను అమ్మాలనే నిబంధనలను కూడా అమలు చేయాల్సిఉంది. దీనిపై డీఏవో పి.సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులు లైసెన్స్‌ గల దుకాణాల్లోనే మందులను తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని