logo

సై అంటే సై

అభివృద్ధిపై చర్చ హుజూరాబాద్‌ను అట్టుడికించింది. హోరాహరీ నినాదాలతో అంబేడ్కర్‌ చౌరస్తా మారుమోగింది.  శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెరాసకు చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాలు విసిరారు.

Published : 06 Aug 2022 06:27 IST

హుజూరాబాద్‌లో భాజపా, తెరాస రాజకీయ పోరు
మూడు గంటలపాటు ఉద్రిక్తత
ఈనాడు, కరీంనగర్‌,  న్యూస్‌టుడే, హుజూరాబాద్‌, పట్టణం, గ్రామీణం


భాజపా కార్యకర్తలను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

అభివృద్ధిపై చర్చ హుజూరాబాద్‌ను అట్టుడికించింది. హోరాహరీ నినాదాలతో అంబేడ్కర్‌ చౌరస్తా మారుమోగింది.  శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెరాసకు చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాలు విసిరారు. బహిరంగ చర్చకు రావాలనేలా తేదీని, సమయాన్ని ఖరారు చేసి శుక్రవారం తాను తన శ్రేణులతో వస్తానని ప్రకటించారు. ఇందుకు ప్రతిగా భాజపా నాయకులు కూడా సవాలును స్వీకరించారు.

భాజపా శ్రేణులు ఇక్కడి చర్చాస్థలికి రాకుండా పోలీసులు ఎక్కడకిక్కడే ముందస్తు చర్యల్లో భాగంగా నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్‌ మండలాలకు చెందిన కమలం పార్టీ ముఖ్య నాయకుల్ని పోలీసులు నిలువరించి ఠాణాలకు తరలించారు. మరోవైపు తెరాస శ్రేణులు మాత్రం నియోజకవర్గ కేంద్రంలోని బహిరంగ చర్చ కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. వారిని ఏ ఒక్క చోట కూడా పోలీసులు అడ్డుకోలేదు. ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. మరో కుర్చీని ఎమ్మెల్యే కోసం వేయించారు. దాదాపుగా 25 నిమిషాలపాటు వేచి చూసిన తరువాత పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద ఎత్తున శ్రేణులు తరలిరావడంతో అక్కడి ప్రాంగణమంతా గులాబీ మయమైంది. తెరాసకు, కౌశిక్‌కు అనుకూలంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఎస్సీకార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌తోపాటు జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెరాస తరపున మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గైర్హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాషాయ జెండా పట్టుకుని ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమైన 152 మందిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. చర్చాస్థలి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు డీసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలో  బందోబస్తుని నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగంణం ఇవతలి గేటు నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు వాహనాల రాకపోకలకు ఒకవైపునకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హుజూరాబాద్‌-జమ్మికుంట మార్గంలోనూ పట్టణంలో ఆంక్షలు విధించారు.


వేదికపైకి వచ్చిన భాజపా మహిళా కార్యకర్తను కిందకు నెట్టివేస్తున్న తెరాస శ్రేణులు

కాషాయదళం దూకుడు..
ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుని వేదిక వద్దకు రాకుండా నిలువరించినా.. భాజపా శ్రేణులు మాత్రం తమ పట్టుని నిలుపుకొనేలా చర్చ జరిపే స్థలం వద్దకు దూసుకొచ్చారు. కౌశిక్‌రెడ్డి వేదిక మీద ఉన్న సమయంలోనే భాజపాకు చెందిన ఇద్దరు మహిళలు సిగ లత, పంజాల లక్ష్మీలు వేదికపైకి దూసుకొచ్చారు. ఒకరు వేదికపైకి ఎక్కి తాము చర్చకు సిద్ధమనేలా తెరాస శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమెను  పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు పంపించారు. కౌశిక్‌రెడ్డి ప్రసంగం ముగిసిన కాసేపటికే చౌరస్తా సమీపంలోని ఓ వీధిలో నుంచి భాజపా నాయకులు సుమారు 60 మంది వరకు కాషాయం జెండాలు పట్టుకుని ఈటల రాజేందర్‌కు జేజేలు పలుకుతూ ఒక్కసారిగా దూసుకొచ్చారు. అప్పటికే రోడ్డుపై అడ్డుగా ఉన్న భారీకేడ్‌లతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఒక వైపు తెరాస, మరోవైపు భాజపా నాయకులు హోరాహోరీ నినాదాలు చేపట్టడంతో పోలీసులు వారిని సముదాయించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ఒక దశలో ఇరుపార్టీల వాళ్లు చెప్పులను విసురుకున్నారు. తమ జెండా కర్రలను ప్రత్యర్థులపైకి విసిరారు. దీంతో పోలీసులు రెండు పార్టీకు చెందిన నాయకుల్ని చెదరగొట్టేందుకు శ్రమించారు. సుమారు 20 నిమిషాలపాటు అక్కడి ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలను విడతల వారీగా అరెస్ట్‌ చేసిన పోలీసులు గొడవను సద్దుమణిచారు. మరోవైపు కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మలను నియోజకవర్గంలోని పలు చోట్ల కమలం పార్టీ నేతలు తగులబెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని