logo

వణికిస్తున్న వంతెనలు

జిల్లాలో మానేరు, మూలవాగుల్లోని వంతెనలు, కాజ్‌వేలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తవి నిర్మించాలన్న ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. మూడేళ్లుగా భారీ వర్షాలకు చెదిరిపోయిన రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు.

Published : 06 Aug 2022 06:31 IST

ప్రతిపాదనల్లోనే తాత్కాలిక మరమ్మతులు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


శిథిలమైన నర్మాల-కోళ్లమద్ది వంతెన

జిల్లాలో మానేరు, మూలవాగుల్లోని వంతెనలు, కాజ్‌వేలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తవి నిర్మించాలన్న ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. మూడేళ్లుగా భారీ వర్షాలకు చెదిరిపోయిన రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. వరదలొస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గత నెల వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్‌శాఖల పరిధిలో తాత్కాలిక మరమ్మతులకు రూ.1.56 కోట్లు మంజూరైనా చాలా చోట్ల పనులు ప్రారంభం కాలేదు. కొన్ని తాత్కాలికంగా చేపట్టినా వర్షాలకు యథాస్థితికి చేరుకుంటున్నాయి. వరదలొస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 28 వంతెనలు ఉండగా అందులో 8 వంతెనలు.. కాజ్‌వేలు వర్షాలకు కోతకు గురయ్యాయి. బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్‌ మధ్య రెండేళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోతే గతేడాది రూ.3.5లక్షలతో పైపులు మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేసినా, గత నెలలో కురిసిన వర్షాలకు మళ్లీ కొట్టుకుపోయాయి. చందుర్తి మండలం కొత్తపేట వద్ద కాజ్‌వే కొట్టుకుపోవడంతో ఇటీవల రూ.1.50 లక్షలతో పైపులు వేసి మట్టితో తాత్కాలిక రహదారి నిర్మించారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలతో వచ్చిన వరదకు మళ్లీ కొట్టుకుపోయింది. పంచాయతీరాజ్‌ రహదారులు బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో ఎక్కువగా ఛిద్రమయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.36.50 లక్షలు విడుదలయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు ఉన్న చోట్ల మరమ్మతులు చేశారు. కాగా పైపై పనులతో నెలల వ్యవధిలోనే యథాస్థితికి చేరుతున్నాయి. శాశ్వత మరమ్మతులు చేసి రాకపోకలను మెరుగుపరచాలని వాహనదారులు కోరుతున్నారు.


వేములవాడ శివారు మల్లారం రహదారిలో ప్రమాదకరంగా కాజ్‌వే

రక్షణ లేని ప్రయాణం
రహదారులు, భవనాలశాఖ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ డివిజన్లలో 19 రహదారులు దెబ్బతినగా, తొమ్మిది వంతెనలు కోతకు గురయ్యాయి. వీటిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉంది. రెండు డివిజన్ల పరిధిలో తాత్కాలిక మరమ్మతులకు రూ.1.20 కోట్లు మంజూరు చేసినా టెండర్ల దశలోనే ఉన్నాయి. పనులు చేపట్టడంలో జాప్యం వీడటం లేదు. చాలా చోట్ల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులు చేసే వరకు అయినా కనీసం సూచికలు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

టెండర్లు పిలిచాం : - కిషన్‌రావు, ఈఈ ఆర్‌అండ్‌బీ
తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రెండు డివిజన్లలో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. టెండర్‌ నోటిఫికేషన్‌ దశలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల హైలెవల్‌ వంతెనల నిర్మాణానికి రూ.89 కోట్లతో ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని