logo

వానొస్తే వణుకే

కరీంనగర్‌-జగిత్యాల జాతీయ రహదారిలో వ్యాపార కేంద్రంగా అభివృద్ధి సాధించిన గంగాధర మండలం మధురానగర్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనకాల,

Published : 08 Aug 2022 05:34 IST

అవస్థలు పడుతున్న లొతట్టు ప్రాంతాల ప్రజలు


మధురానగర్‌లో ఇంటికి చేరాలంటే దారిలోని నీటిని దాటాల్సిందే...

గంగాధర, న్యూస్‌టుడే: కరీంనగర్‌-జగిత్యాల జాతీయ రహదారిలో వ్యాపార కేంద్రంగా అభివృద్ధి సాధించిన గంగాధర మండలం మధురానగర్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనకాల, ఆర్టీసీ బస్టాండు సమీపంలో, బోయినపల్లి రోడ్డు వైపున ఉన్న ఇళ్ల సమీపంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరి వస్తువులన్నీ తడిసిపాడవుతున్నాయి. ఇళ్ల నిర్మాణ సమయంలో యజమానులు నిబంధనలు పాటించకపోవడం.. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండటంతో ముంపు సమస్యలు తప్పడం లేదు. గుంట స్థలం రూ.లక్షల్లో ఉండటంతో భూములు యజమానులు 30 ఫీట్ల దారి వదలకుండా కేవలం 10 నుంచి 15 అడుగులు దారికి వదిలేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇల్లు నిర్మాణం చేసే సమయంలో దారికి అదనంగా భూమి (సెట్‌బ్యాక్‌)ని వదిలేసినట్లుగా కాగితాలపై చూపుతుండగా స్థానికంగా మాత్రం అలా వదిలేయకుండానే ఇంటి నిర్మాణం చేస్తుండటంతో ఇరుకు దారుల్లో డ్రైనేజీల నిర్మాణం తీవ్ర సమస్యగా మారింది. దారులపై ఎత్తుగా మట్టి పోసి సీసీ రోడ్డు నిర్మాణం చేస్తుండగా ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు ఇక్కడకు వచ్చి చేరుతుండటంతో సమస్య తీవ్రరూపమై స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకు దారులు వరద ఉద్ధృతికి కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. రాత్రిపూట దారుల్లోని గుంతల్లో పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. మోటారు పంపుసెట్లు ఏర్పాటు చేసి నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. యజమానులు కూడా ఇళ్ల నిర్మాణ సమయంలోనే వరదనీరు వెళ్లేందుకు స్థలాన్ని వదిలిపెట్టాలని సూచించారు.అలాగే గంగాధర, నారాయణపూర్‌ చెరువుల కట్టలు తెగి దిగువన పంట పొలాల్లో ఇసుక మేటలు పడ్డాయి.

గంగాధరలో ఓ రైతు పొలంలో  ఇసుక మేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని