logo

నిఘా నీడలో అయిదు ఠాణాలు

సాంకేతిక పరంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మెరుగైన సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రం పరిధిలోకి కరీంనగర్‌ కమిషనరేట్ సైతం చోటు దక్కించుకుంది.

Updated : 08 Aug 2022 05:59 IST

హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం

హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌

న్యూస్‌టుడే, కరీంనగర్‌ నేరవార్తలు: సాంకేతిక పరంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మెరుగైన సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రం పరిధిలోకి కరీంనగర్‌ కమిషనరేట్ సైతం చోటు దక్కించుకుంది. జిల్లా పరిధిలో జరిగే సంఘటనలు, స్థానిక పరిస్థితుల పరిశీలన, ఆధారాల సేకరణకు ఉపకరించనుంది. భవిష్యత్తులో చీమ చిటుక్కుమన్నా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో నమోదయ్యేలా తీర్చిదిద్దనున్నారు.

ప్రయోగాత్మకంగా..

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రం పరిధిలో కమిషనరేట్, జిల్లా స్థాయిలోని కొన్ని ఠాణాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకొని రెండు నెలల కిందటనే ఠాణాల్లో నూతన సాంకేతికతో వీడియో, ఆడియో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో మొదటి విడతగా కరీంనగర్‌ 1, 2, 3 ఠాణాలతో పాటు మహిళా ఠాణా, సీసీఎస్‌ ఠాణాలను ఎంపిక చేశారు. ఒక్కో ఠాణాలో 20 సీసీ కెమెరాలను బిగించారు. వివిధ సమస్యలతో ప్రజలు  ఠాణాలోకి వచ్చి, వెళ్లే మార్గాలు, అధికారి గది, నిందితులను భద్రపరిచే గది, రైటర్స్‌ గది, ఫిర్యాదు స్వీకరణ ప్రాంతం, స్వాధీనం చేసుకున్న వాహనాల నిలుపుదల ప్రాంతం ఇలా మొత్తంగా 20 ఆడియో, వీడియో రికార్డింగ్‌తో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పలుమార్లు ఆడియో, వీడియో సైతం పరిశీలించి పలు మార్పులు చేశారు.

కరీంనగర్‌ రెండో ఠాణా వద్ద ఏర్పాటు చేసిన నూతన సిసి కెమెరాలు

మరిన్ని

రాష్ట్ర స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభం కాగా, మొదటి విడతగా కరీంనగర్‌ నగర పరిధిలోని ఐదు ఠాణాలను అనుసంధానం చేశారు. త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని ఠాణాల్లో ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమౌతున్నట్లు తెలిసింది. మరో రెండు, మూడు నెలల్లో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు వినియోగంలో ఉంటే వాటిని అనుసంధానం చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.

ఆధునికీకరిస్తే నిఘా కట్టుదిట్టం

జిల్లాల పునర్విభజనతో భాగంగా 2016 ఆగస్టులో కరీంనగర్‌ కమిషనరేట్ ఏర్పాటైంది. 2017 నుంచి నేటి వరకు ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు దాతల సహకారం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య, వ్యాపార నిర్వాహకుల సహకారంతో ఇప్పటి వరకు మూడు వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను స్థానికులు చూసేవారు. వాహన రాకపోకల కారణంగా కెమెరాల వైర్లు తెగిపోవడంతో మరమ్మతుకు వేల రూపాయల ఖర్చయ్యేది. తొలుత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు సంయుక్తంగా మరమ్మతులు చేయించినా రానురాను ర్చు పెరిగిపోవడం, మొదటగా ఏర్పాటు చేసిన అనేక  సీసీ కెమెరాల పర్యవేక్షణను ఎవరూ పట్టించుకోకపోవడంతో సగానికి పైగా కెమెరాలు మూలన పడ్డాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లేక పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కాలనీ అభివృద్ధి కమిటీలు వాటిని బాగు చేయించి భద్రతను పర్యవేక్షించుకుంటున్నాయి. ప్రధాన కూడళ్లలో కరీంనగర్‌ పోలీసులు సైతం ఆధునిక  సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమిషనరేట్ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు మాత్రమే కంట్రోల్‌రూం పరిధిలో పర్యవేక్షణ జరుగుతున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. 60 డివిజన్లలో నాలున్నర లక్షల జనాభా కలిగిన స్మార్ట్‌ సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను ఆధునికీకరించి నిరంతరం పర్యవేక్షించడం వల్ల నగరంలో భద్రత కట్టుదిట్టం చేయవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు