logo

లక్ష్యం దాటితే.. ప్రోత్సాహకం

సహజ ప్రసవాలను పెంచేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. దీంతో సహజ ప్రసవాలను ప్రోత్సహించే వైద్యులు, వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు తెలంగాణ వైద్య

Published : 08 Aug 2022 05:34 IST

వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలు
సహజ ప్రసవాల పెంపునకు ప్రభుత్వ నిర్ణయం


గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: సహజ ప్రసవాలను పెంచేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. దీంతో సహజ ప్రసవాలను ప్రోత్సహించే వైద్యులు, వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 85 శాతం సహజ ప్రసవాలే ఉండాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇందులో సగం కూడా చేరుకోవడం లేదు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నెలా 190 నుంచి 230 వరకు ప్రసవాలు జరుగుతుండగా సహజ ప్రసవాల శాతం 30 నుంచి 37 శాతం వరకే ఉంటుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం అక్కడ జరిగే శస్త్ర చికిత్స ప్రసవాలను సహజ ప్రసవాలుగా దస్త్రాల్లో నమోదు చేస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి రావడం గమనార్హం. శస్త్రచికిత్సతో జరిగే ప్రసవానికి ‘ఆరోగ్యశ్రీ’లో రూ.11 వేలు చెల్లిస్తుండడంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సైతం శస్త్ర చికిత్స ప్రసవాలపైనే దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. తాజాగా శస్త్రచికిత్స ప్రసవాలకు ‘ఆరోగ్యశ్రీ’ చెల్లింపులను నిలిపివేయడంతో పాటు సహజ ప్రసవాలను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అవగాహన పెరగాలి...

* సహజ ప్రసవాలతో తల్లి, బిడ్డకు ఆరోగ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలపై గర్భిణుల్లో అవగాహన కల్గించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది.

* ఇటీవల జిల్లా పాలనాధికారి తీసుకున్న ప్రత్యేక చర్యలపై ముహూర్తపు ప్రసవాల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ సహజ ప్రసవాలు ఆశించిన మేరకు పెరగడం లేదు.

* సహజ ప్రసవాలతో ప్రయోజనాలపై గర్భిణితో పాటు ఆమె బంధువుల్లో సరైన అవగాహన లేకపోవడం, కళ్లముందే గర్బిణి పురుటి నొప్పులతో బాధపడుతుంటే చూడలేని బంధువులు వెంటనే శస్త్రచికిత్సతో ప్రసవాలు చేయాలంటూ వైద్యులపై ఒత్తిళ్లు తెస్తున్నారు.

* తప్పనిసరిగా సహజ ప్రసవమయ్యే అవకాశముందని, లేనిపక్షంలో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు, వైద్య సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండడం లేదు.

* సహజ ప్రసవాలు చేయడంలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ప్రత్యేక శిక్షణతో సిద్ధంగా ఉన్నప్పటికీ గర్భిణులు, బంధువులు సహకరించకపోవడంతోనే సఫలం కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

* సంబంధిత ఉన్నతాధికారులు మాత్రం ఇవేం పట్టించుకోకుండా సహజ ప్రసవాలను ఎందుకు పెంచడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం వైద్యులు, వైద్య సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.


యోగాసనాల నుంచి ప్రోత్సాహకాల దాకా

సహజ ప్రసవాలను పెంపొందించాలనే లక్ష్యంతో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగేళ్ల క్రితమే గర్భిణుల కోసం యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదట్లో ఈ యోగా కేంద్రాలు అత్యంత ఉత్సాహంగా పనిచేసినప్పటికీ క్రమంగా గాడి తప్పాయి. మళ్లీ ఇటీవల కొంత మేరకు నిర్వహణ చేపడుతున్నారు. నెలసరి చికిత్స కోసం వచ్చే గర్భిణులకు యోగా కేంద్రాల్లో సహజ ప్రసవానికి అవసరమైన యోగాసనాలను నేర్పించి పంపించేవారు. ఇంటి దగ్గర అవే యోగాసనాలను ప్రాక్టీస్‌ చేస్తే సహజ ప్రసవాలు సుసాధ్యమయ్యేవి. సహజ ప్రసవాలపై గర్భిణుల్లో అవగాహన కల్గించేందుకు ఆశ, ఎ.ఎన్‌.ఎం. కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 85 శాతం సహజ ప్రసవాల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సహజ ప్రసవాలను పెంపొందించే వైద్యులు, వైద్య సిబ్బందిని మరింత ప్రోత్సహించేలా ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత లక్ష్యం దాటాక నిర్వహించే ఒక్కో సహజ ప్రసవానికి రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకాన్ని వైద్యులు, వైద్య సిబ్బందికి అందించనుంది. ఆస్పత్రుల స్థాయిని బట్టి సహజ ప్రసవాల లక్ష్యాలను నిర్దేశించారు. వాటిని అధిగమిస్తేనే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకం అందనుంది. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నెల 190 నుంచి 230 వరకు ప్రసవాలు జరుగుతుండగా ఇందులో సహజ ప్రసవాలు 60 నుంచి 80 వరకున్నాయి. బోధనాస్పత్రిగానున్న ఈ ఆస్పత్రిలో సహజ ప్రసవాల సంఖ్య 350 దాటితేనే ఒక్కో సహజ ప్రసవానికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని