logo

విద్యార్థుల చూపు గురుకులాల వైపు

ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉన్న వసతి గృహాలు ప్రస్తుతం పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని మూతబడ్డాయి. అరకొర విద్యార్థులతో మరికొన్ని మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వసతి గృహాలు

Published : 08 Aug 2022 05:34 IST

వెలవెలబోతున్న వసతి గృహాలు

వేములవాడలోని బీసీ బాలుర వసతి గృహం

న్యూస్‌టుడే, వేములవాడ: ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉన్న వసతి గృహాలు ప్రస్తుతం పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని మూతబడ్డాయి. అరకొర విద్యార్థులతో మరికొన్ని మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వసతి గృహాలు నామమాత్రపు విద్యార్థులతో కొనసాగుతున్నాయి. గతంలో వందల సంఖ్యలో ప్రవేశాలు పొందేవారు. ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రవేశపెట్టడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

వేములవాడ డివిజన్‌లోని వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ఎస్సీ, బీసీ బాలురు, బాలికల వసతి గృహాలున్నాయి. పలు మండలాల్లోని వసతి గృహాలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. ఒక్కొక్క వసతి గృహంలో వంద మంది ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉంది. రికార్డుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే వేములవాడ పట్టణంలో ఎస్సీ బాలుర వసతి గృహం మూతపడగా అందులో వేములవాడ గ్రామీణ మండల తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. భిక్షాటన చేసుకునే వారి పిల్లల కోసం వసతి గృహం ఉండేది. అయిదేళ్ల క్రితం ఇది మూతపడింది. మూడేళ్ల క్రితం బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులు లేక మూతపడింది. దీంతో ఇదే భవనంలో మార్పులు చేసి ప్రస్తుతం బీసీ బాలుర వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. చందుర్తిలోని బాలుర వసతి గృహాన్ని సిరిసిల్ల బాలుర వసతి గృహానికి మార్పు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న కొద్దీ వసతి గృహాలు మూతపడుతున్నాయి.


రెండూ ఒకేచోట ఉండటంతో అటువైపు వెళుతున్నారు
- గంగయ్య, బీసీ వసతి గృహ సంక్షేమాధికారి, వేములవాడ

వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య చాలా వరకు తగ్గింది. గ్రామాల నుంచి విద్యార్థులు వివిధ గురుకులాల్లో ప్రవేశం పొందడంతో వసతి గృహాలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడ వారి పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకే ఆసక్తి చూపుతున్నారు. వసతి గృహం, పాఠశాల ఒకేచోట ఉండటంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు.


వంద మందికి అవకాశం ఉన్నా...

గతంలో ఒక్కొక్క వసతి గృహంలో వంద మంది విద్యార్థులు ఉండేందుకు అవకాశం ఉండేది. ఇలాంటి సందర్భంలో చాలా వరకు వంద సీట్లు కొన్ని రోజుల్లోనే భర్తీ అయ్యేవి. దీంతో చాలా వసతి గృహాల్లో ప్రవేశాలు లభించక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగేవారు. కొన్ని సందర్భాల్లో పలువురి ప్రజా ప్రతినిధులు, ఇతరత్రా నాయకుల సిఫారసు లేఖలతో వసతి గృహాల్లో సీటు కోసం పైరవీలు చేసిన సందర్భాలుండేవి. అలాంటిది ప్రస్తుతం ఉన్న వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి మూతపడే స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జ్యోతిబాఫులే, సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌, ప్రతి మండలంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఇలా విరివిగా పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నెలకొల్పడంతో వసతి గృహాలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారు. గురుకులాల్లో చదువుతో పాటు వసతి గృహాలు కొనసాగడంతో తల్లిదండ్రులు అందులో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. గురుకులాల్లో వందల సంఖ్యలో విద్యార్థులతో కిటకిటలాడుతుండగా వసతి గృహాలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. వసతి గృహాల సంక్షేమ అధికారులు (వార్డెన్లు) విద్యార్థులను చేర్పించేందుకు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు లేకపోతే మూతపడుతుందనే ఆందోళన వారిలో నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని