logo

నెరవేరనున్న చిరకాల స్వప్నం

జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దీనికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. కళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లను మంజూరు చేసింది.

Published : 08 Aug 2022 05:34 IST

వైద్య కళాశాలకు  రూ.166 కోట్లు మంజూరు

సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి

న్యూస్‌టుడే, సిరిసిల్ల (విద్యానగర్‌): జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దీనికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. కళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లను మంజూరు చేసింది. ఇది ఏర్పాటయితే జిల్లా ప్రజలకు ఖరీదైన వైద్యం అందనున్నదని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. వైద్య కళాశాల నిర్మాణం జరిగితే ఇది సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారనున్నది. దీంతో ఇక్కడ అందనున్న సేవలు కూడా పెరుగుతాయి. జిల్లా ఆసుపత్రి నుంచి పలు సందర్భాల్లో అత్యవసర వైద్యానికి కరీంనగర్‌, వరంగల్‌ వంటి పెద్ద ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తూ ఉంటారు. బాధిత బంధువులు హుటాహుటిన తరలించాల్సి వస్తుంది. దీంతో ఎంతో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుంది. వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. జిల్లాలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గత సంవత్సరం జులైలో సిరిసిల్ల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. వైద్య కళాశాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు రూ.166 కోట్లు మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ముందుగా వంద సీట్లు కేటాయించి జిల్లా ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రజలకు పెద్ద పెద్ద పట్టణాల్లో లభించే ఖరీదైన వైద్యం అందనుంది.


స్థలాల పరిశీలన

వైద్య కళాశాల కోసం ఇప్పటికే పలు చోట్ల అధికారులు స్థలాలను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న రెండో బైపాస్‌ రోడ్డులో జేఎన్టీయూ కళాశాల నిర్మాణానికి స్థలం కేటాయించిన నేపథ్యంలో దాని సమీపంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని అధికారులు ఇది వరకే ప్రతిపాదనలు పంపించారు. అక్కడే ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత దవాఖానాను బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల నిర్మాణ బాధ్యతలు ఆర్‌అండ్‌బీ శాఖకు, ఎక్విప్‌మెంట్ బాధ్యతలు హైదరాబాద్‌ తెలంగాణ స్టేట్ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించారు. డెరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పర్యవేక్షణలో వైద్య కళాశాల నిర్మాణం జరగనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.


ప్రజలకు ఎంతో మేలు
- డా.మురళీధర్‌రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్

జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడం హర్షణీయం. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందనుంది. జిల్లా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య కళాశాల నిర్మాణం పూర్తిగా డీఎంఈ పర్యవేక్షణలో ఉంటుంది. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని