logo

తగ్గిన దిగుబడి... పెరిగిన ధరలు

వరుసగా కురుస్తున్న వర్షాలతో తోటలు నీట మునగడం, కూరగాయ మొక్కలతో పాటు కాయలు కుళ్లిపోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దీంతో ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరల మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.

Updated : 08 Aug 2022 05:58 IST

సామాన్యులకు తప్పని కూరగాయాలు

గోదావరిఖని మార్కెట్లో కూరగాయల విక్రయాలు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: వరుసగా కురుస్తున్న వర్షాలతో తోటలు నీట మునగడం, కూరగాయ మొక్కలతో పాటు కాయలు కుళ్లిపోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దీంతో ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరల మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. టమాట, మిర్చి తదితర కూరగాయలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ టమాట దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధరలు పడిపోవడంతో ప్రస్తుత మార్కెట్లో ఒక్క టమాట ధరలు మాత్రమే అందరికీ అందుబాటులోకి రాగా మిగతా కూరగాయల ధరలు నెల క్రితం కంటే సుమారు రెట్టింపయ్యాయి. కిలో రూ.60 అమ్మిన వంకాయ ఇప్పుడు రూ.100 పలుకుతోంది. ప్రస్తుతమున్న మార్కెట్‌ ధరల్లో వంకాయనే ఆగ్రభాగాన నిలిచింది. అరుదుగా లభించే బోడకాకరకాయ గతంలో కిలో రూ.300 వరకు విక్రయించగా ఇప్పుడు తగ్గి రూ.160 నుంచి రూ.180 వరకు లభిస్తోంది.. ఆకు కూరలతో సహా మిగతా కూరగాయల ధరలు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగాయి. దీంతో మధ్యతరగతి జీవుల జీవనవ్యయం పెరగడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. తక్కువ కూరలతో సర్దుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అత్యధికంగా కూరగాయాలను సరఫరా చేసే పెద్దపల్లి పరిసరాల గ్రామాలతో పాటు ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలు నెల రోజులుగా భారీ వర్షాలతో నీట మునగడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దీనికి తోడుగా శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారం మానేస్తుండడంతో సహజంగానే కూరగాయలకు గిరాకీ పెరిగింది. ఫలితంగానే ధరలు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని